Magazines

ఎలా చేద్దాం?

1 గంట క్రితం

El Niño
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 4 నిమిషాల చదవడం

రేషన్‌షాపుల్లో నిత్యవసర సరుకుల పంపిణీపై సర్కారు సమాలోచనలు

మూడు ప్రత్యామ్నాయాలు..రెండు నివేదికలు

కసరత్తు పూర్తిచేసిన పౌరసరఫరాలశాఖ అధికారులు

సన్న బియ్యంతోపాటు ఐదు రకాల వస్తువులు సబ్సిడీపై ఇవ్వాలని నిర్ణయం

ఒక్కో కార్డుపై రూ.300 వరకు లబ్ది చేకూర్చే యోచన


ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్ర్తి
రాష్ట్రంలో ఎల్‌నినో కరువు పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. అసంఘటితరంగంలో కార్మికులకు ఇప్పటికే ఉపాధి సమస్య ఏర్పడుతున్నది. పనులు లేకపోవడంతో పూట గడవడం కూడా కష్టంగా మారింది. నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని ఉపశమన చర్యలకు సిద్ధమవుతున్నది. దానిలో భాగంగా రేషన్‌షాపుల ద్వారా సన్నబియ్యంతో పాటు ఐదు రకాల నిత్యవసర వస్తువులను ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించి, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై రెండు రకాల నివేదికలను అధికారులు సిద్దంచేసినట్టు సమాచారం. ఒక్కో రేషన్‌కార్డుదారుకు గరిష్టంగా రూ.300 రూపొందించినట్టు తెలిసింది.


ఈ వారంలోనే దీనిపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకొని, డిసెంబర్‌ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే రేషన్‌ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి అదనంగా తెల్ల రేషన్‌ కార్డుదారులకు కిలో గోధుమపిండి, కిలో కందిపప్పు, లీటర్‌ పామాయిల్‌, కిలో చక్కెర, చింతపండు, కారం పొడి వంటి నిత్యావసర వస్తువులను కూడా ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. దీనికి పంపిణీ విధానాలు, ఆర్థిక అంచనాలను అధికారులు పరిశీలించి, ప్రాథమికంగా రెండురకాల నివేదికలు సిద్ధం చేసినట్టు తెలిసింది.

లెక్కలు ఇలా...

రాష్ట్రంలో 1,06,28,092 కోట్ల తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. 17,329 రేషన్‌దుకాణాల నుంచి ఈ కార్డుల ద్వారా 3.42 కోట్ల మంది ప్రజలు లబ్దిపొందుతున్నారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 85 శాతం మందికి ఈ వ్యవస్థ ద్వారా ప్రయోజనం కలుగుతున్నదని ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. ప్రస్తుతం తెల్లరేషన్‌కార్డులు ఉన్న కుటుంబాలకు ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. వారికి తక్కువ పరిణామంలో ఎక్కువ నిత్యవసర వస్తువులు ఇవ్వాలా? లేక కార్డుదారుల నుంచి నిర్ణీత సొమ్మును వసూలు చేసి, సబ్సిడీపై వస్తువులు ఇవ్వాలా? అనేదానిపై ప్రభుత్వం పరిశీలన చేస్తున్నది.

వీరికి ప్రయోజనం

నిర్మాణ రంగంలో రోజువారీ కూలీలు, వ్యవసాయ కూలీలు, చిన్న వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, గఅహ కార్మికులు, చిరుద్యోగులు వంటి వర్గాలకు నెలవారీ ఆదాయం స్థిరంగా ఉండదు. పని దొరికిన రోజునే ఆదాయం వస్తుంది. అనారోగ్యం, వర్షాలు, పని నిలిచిపోవడం, పండుగల అనంతర వ్యాపార మందగమనం వంటి కారణాలతో కూడా ఆదాయం తగ్గుతుంది. ఇలాంటి కుటుంబాలకు ప్రభుత్వం బియ్యంతోపాటు పప్పు, నూనె, పంచదార, ఇతర వంట సరుకులను తక్కువ ధరకు అందించడం వల్ల ఆ కుటుంబాలు ఆహార కొనుగోళ్లపై పెట్టే ఖర్చు తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.

ఇలా ప్రభుత్వ లెక్కలు

ఒక కుటుంబానికి నెలకు రూ.300 విలువైన సరుకులను రేషన్‌ దుకాణం ద్వారా ఇస్తే ఏడాదికి రూ.3,600 ఆదా అవుతుందని అధికారులు లెక్కలు కడుతున్నారు. అలాగే ఒక్కో రేషన్‌కార్డుదారునకు ప్రస్తుతం ఇస్తున్న సన్నబియ్యంతో పాటు నెలకు రెండు కిలోల గోధుమపిండి, ప్రోటీన్‌ లభ్యత కోసం కిలో కందిపప్పు, ఒక లీటరు పామాయిల్‌, కిలో చక్కెర, 250 గ్రాముల చింతపండు, 100 గ్రాముల కారంపొడి ఇస్తే ప్రభుత్వంపై ఎంత ఆర్థికభారం పడుతుందో అధికారులు అంచనా వేసినట్టు తెలిసింది. అయితే కుటుంబసభ్యుల సంఖ్యను బట్టి ఈ వస్తువులు పూర్తిగా చాలకున్నా, వారికి కొంతైనా ఆర్థికభారం తప్పించినట్టు అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. దానికీ అధికారులు గణాంకాలను సిద్ధం చేశారు. ఉదాహరణకు ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి ఒక కిలో కందిపప్పు ఇవ్వడం వల్ల ప్రతి సభ్యుడికి సగటున 200 గ్రాముల పప్పు మాత్రమే లభిస్తుందనీ, ఇది నెల మొత్తం అవసరాలకు ఎంతవరకు సరిపోతుందనే అంశంపై కూడా చర్చ జరిగినట్టు తెలిసింది. అలాగే చక్కెర స్థానంలో అధిక పోషక విలువలు ఉండే చిరుధాన్యాలు పంపిణీ చేస్తే ఎలా ఉంటుందనే దానిపైనా చర్చ జరిగింది. దీనికి సంబంధించి పౌరసరఫరాల శాఖ అధికారులు ఇప్పటికే పోషకాహార నిపుణులు, ఆర్థికవేత్తలతో చర్చలు జరిపినట్టు సమాచారం.

రూ.4వేల కోట్ల భారం

రాష్ట్రంలోని 1.06 కోట్ల రేషన్‌కార్డులకు నిత్వవసర వస్తువులు ఇవ్వాలంటే ప్రభుత్వంపై దాదాపు రూ.3 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్ల వరకు ఆర్థికభారం పడుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. వస్తువుల కొనుగోలు వ్యయంతో పాటు రవాణా, గోదాముల నిర్వహణ, నాణ్యత పరీక్షలు, ప్యాకింగ్‌, పంపిణీ, పర్యవేక్షణ ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు.

నెలకు ఒక్కో కార్డుపై రూ.300

తెల్ల రేషన్‌కార్డులకు నెలకు సగటున రూ.300 విలువైన అదనపు నిత్వవసరాలు అందిస్తే ఎంత ఖర్చవుతుందనే దానిపై అధికారులు ప్రాథమికంగా లెక్కలు వేశారు. దాని ప్రకారం రాష్ట్రంలో తెల్ల రేషన్‌కార్డులు 1.06 కోట్లు కాగా, ఒక్కో కార్డుకు నెలవారీ సరుకుల విలువ రూ.300 చొప్పున నెలకు రూ.318 కోట్లు, 12 నెలలకు రూ.3,816 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్టు తెలిసింది.

ఇలా చేస్తే...

పౌరసరఫరాలశాఖ అధికారులు మరోలెక్కను కూడా సిద్ధం చేసినట్టు సమాచారం. ఒక్కో కార్డు నుంచి నెలకు రూ.100 వసూలు చేస్తే ప్రభుత్వ నెలవారీ ఖర్చులో రూ.106 కోట్లు, ఏడాదికి రూ.1,272 కోట్లు చొప్పున వ్యయం తగ్గి, మొత్తం ఖర్చు రూ.2,544 కోట్లకు పరిమితం అవుతుందని కూడా అంచనా వేసినట్టు తెలిసింది.

మూడో ప్రత్యామ్నాయం

ప్రభుత్వం రేషన్‌దుకాణాల ద్వారా నిత్యవసర వస్తువులను నేరుగా ఇచ్చేకంటే లబ్దిదారుల ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేస్తే ఎలా ఉంటుందనేదానిపై కూడా ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది. ఇలా చేయడం వల్ల కార్డుదారులు తమకు కావల్సిన వస్తువులను బహిరంగ మార్కెట్‌నుంచి కొనుక్కుంటారనే ప్రతిపాదన కూడా అధికారులు చేసినట్టు సమాచారం. అలాగే 2026 అక్టోబర్‌ 16 నాటికి రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర పూల్‌ సహా 9.64 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయి. పెండింగ్‌ సరఫరాలతో కలిపి మొత్తంగా 28.03 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యం అందుబాటులోకి వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో బియ్యం ధర రూ.85 వరకు ఉన్న విషయం తెలిసిందే.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్