Magazines

‌సోనియా ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావనేదీ?

18 నిమిషాల క్రితం

autobiography
avatar
balaji

ప్రచురించబడింది నవం 18, 2026 | 4 నిమిషాల చదవడం

ఎన్నికల ముందు అభయహస్తం తర్వాత రిక్తహస్తం

కాంగ్రెస్ పాలనలో సాధించింది శూన్యం

గాంధీలకు బాడీగార్డ్‌లా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డి

తెలంగాణ రైజింగ్ కాదు ఫాలింగ్

మూడేండ్లలో ఎన్ని పెట్టుబడులొచ్చాయో శ్వేతపత్రం ప్రకటించాలి

మీడియాతో చిట్‌‌చాట్‌‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్


నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
సోనియా గాంధీ గుండెల్లో తెలంగాణ ఉంటే ఆమె ఆత్మకథ పుస్తకంలో తెలంగాణ ప్రస్తావన ఎందుకు లేదని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మేనని చెప్పే కాంగ్రెస్‌ నేతలు ‌దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. సోనియాగాంధీ ఆత్మకథలో తెలంగాణ పదం కూడా లేకపోవడంతో ఆమెకు, కాంగ్రెస్ పార్టీకి నిజమైన ప్రేమ లేదన్న విషయం స్పష్టమవుతోందన్నారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఆయన మీడియాతో చిట్‌‌చాట్‌ ‌నిర్వహించారు. తెలంగాణ సోనియాగాంధీ దయాభిక్ష కాదనీ, ప్రజల పోరాటం, కేసీఆర్ నాయకత్వంలో సాగిన మహత్తర ప్రజా ఉద్యమ ఫలితమని స్పష్టం చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై అంత ప్రేమ ఉంటే ఆయన అంత్యక్రియలను ఢిల్లీలో ఎందుకు నిర్వహించలేదంటూ ఆయన కూతురు, ఎమ్మెల్సీ వాణీదేవి ప్రశ్నించిన విషయాన్ని గుర్తుచేశారు. రాహుల్ గాంధీని ముద్దపప్పు అని విమర్శించింది తాము కాదనీ, రేవంత్ రెడ్డే ఆ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. సోనియాగాంధీని బలిదేవత అన్నది కూడా రేవంత్ రెడ్డేనని అన్నారు. తెలంగాణకు ప్రథమ విలన్, ప్రథమ శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. 2001 ఏప్రిల్ 27న కరీంనగర్‌లో కేసీఆర్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారనీ, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అదే వైఖరితో ఉందని తెలిపారు.

మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ర్టానికి మిగిలింది శూన్యం
ఎన్నికలకు ముందు అభయహస్తం తర్వాత రిక్తహస్తమని కేటీఆర్‌ ‌విమర్శించారు. కాంగ్రెస్ వంచనకు అభయహస్తం మ్యానిఫెస్టోనే ప్రతిరూపమని అన్నారు. ఈ శతాబ్దపు అతిపెద్ద మోసంగా అది చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం సాధించింది శూన్యమని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడమే కాంగ్రెస్ సాధించిన ఘనతనా అని ప్రశ్నించారు. ఇప్పటికే రూ.4.5 లక్షల కోట్ల అప్పులు చేసి, ప్రభుత్వ భూములను అమ్ముతూ, కుదువపెడుతూ తెలంగాణ భవిష్యత్తును దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. మూడేండ్లకే రాష్ట్ర పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మరో రెండేండ్లు ఈ ప్రభుత్వాన్ని ఎలా భరించాలని ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు.

పడిపోతున్న భూముల ధరలు

తెలంగాణలో అభివృద్ధి, ఉపాధి, పెట్టుబడుల రంగాలు ముందుకు సాగాల్సింది పోయి వెనక్కి వెళ్తున్నాయని కేటీఆర్ విమర్శించారు. మూడేండ్ల తెలంగాణ రైజింగ్ కాదనీ, తెలంగాణ ఫాలింగ్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో భూముల ధరలు పడిపోతున్నాయని చెప్పారు. ఐటీ ఉద్యోగాలు తగ్గుముఖం పడుతున్నాయనీ, అవినీతి, బంధుప్రీతి, రైతుల ఆత్మహత్యల్లో మాత్రమే తెలంగాణ రేసింగ్‌లో ఉందని ఎద్దేవా చేశారు. ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకు కేసులు, కమీషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. మూడేండ్లలో రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం, ఎన్ని పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయి, ఎన్ని పరిశ్రమలు, ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయనే అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిజంగానే రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే ఐటీ ఉద్యోగాలు ఎందుకు తగ్గుతున్నాయని ప్రశ్నించారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఎందుకు కుదేలవుతోందని అడిగారు. గవర్నర్ ప్రసంగంలో ఐటీ ఉద్యోగాలు ఏడు వేలకు పైగా తగ్గినట్లు పేర్కొన్నారని గుర్తు చేశారు.

22ఏ పేరుతో భూములు బ్లాక్‌

మూడేండ్ల కాంగ్రెస్ పాలన అవినీతికి కేంద్రంగా మారిందని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్‌లో మంచినీటి కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు. హైదరాబాద్‌లో రోజుకు సుమారు 8,000 వాటర్ ట్యాంకర్లు, నెలకు 2.50 లక్షల ట్యాంకర్లు బుక్ అవుతున్నాయంటేనే నగరంలో నీటి కొరత తీవ్రత అర్థమవుతోందన్నారు. 22ఏ పేరుతో భూములను బ్లాక్ చేయడం, హైడ్రా పేరుతో సెలెక్టివ్ డెమాలిషన్లు చేపట్టడం, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించడం వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని ఆరోపించారు. పెద్దల అక్రమ నిర్మాణాలను పట్టించుకోకుండా పేదల ఇండ్లను కూల్చడం కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. హైడ్రా పేరుతో బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. మరోవైపు ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో చదరపు అడుగుకు రూ.200 వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ ఆత్మగౌరవానికి అవమానం

ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి గాంధీ కుటుంబానికి బాడీగార్డ్‌లా వ్యవహరించడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని కేటీఆర్ విమర్శించారు. సోనియా గాంధీ వచ్చినా, రాహుల్ గాంధీ వచ్చినా, ప్రియాంక గాంధీ వచ్చినా రేవంత్ రెడ్డి ఒక బాడీగార్డ్ మాదిరిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ బానిస సంస్కృతి కాంగ్రెస్ పార్టీకే పరిమితం కాలేదనీ, బీజేపీలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని తెలిపారు. ఆయనకంటే ఐదేండ్లు చిన్నవాడైన అమిత్‌షా కాళ్లకు రాంచందర్ రావు మొక్కడం ఏంటని ప్రశ్నించారు. బండి సంజయ్ కూడా బౌన్సర్‌లా, బాడీగార్డ్‌లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రెండు ఢిల్లీ పార్టీల నాయకత్వం ముందు తెలంగాణ నాయకులు బానిసలు, గులాముల్లా వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటని అన్నారు.

భారత్ సమ్మిట్‌‌తో ఒరిగిందేంటీ?

కాంగ్రెస్ పార్టీ భారత్ సమ్మిట్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంతో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని కేటీఆర్‌ ‌విమర్శించారు. అది అంతర్జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించుకున్న రాజకీయ సమ్మిట్ తప్ప రాష్ట్రానికి ఉపయోగపడిన కార్యక్రమం కాదని అన్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో ఈ రూ.వంద కోట్లు రైతులకు సహాయంగా అందించినా, ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగించినా ఎంతో ప్రయోజనం ఉండేదని తెలిపారు. అది గ్లోబల్‌ ‌సమ్మిట్‌ ‌కాదనీ, గోబెల్స్‌ ‌సమ్మిట్‌ను నిర్మహించారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నేతల పేర్లతో ఉన్న ప్రాజెక్టులు, ప్రాంతాల పేర్లన్నీ మారుస్తామన్నారు. రాజీవ్ గాంధీ విమానాశ్రయం, ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీ, రాజీవ్ సాగర్, ఉప్పల్ స్టేడియం వంటి పేర్లతో పాటు కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న ఇతర సంస్థలు, ప్రాజెక్టుల విషయంలోనూ ఇదే విధానం అనుసరిస్తామని హెచ్చరించారు. మూసీలో పోసే 10 టీఎంసీల నీళ్లను హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగించవచ్చు కదా?అని సూచించారు. కరువును కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ రైతులకు ఎలాంటి సహాయం అందించడం లేదన్నారు. శాసనసభలో తనపై ఎనిమిది వేల ఎకరాల భూకబ్జా ఆరోపణలు చేసి రెండు నెలలు గడిచినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు చూపలేదని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి ఎక్కడికి వెళ్లినా అభివృద్ధి గురించి మాట్లాడాలని డిమాండ్‌ ‌చేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై మూడేండ్ల డ్రామా సరిపోలేదా?అని ప్రశ్నించారు.

​




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్