Magazines

కలిసి పనిచేద్దాం

27 నిమిషాల క్రితం

together
avatar
balaji

ప్రచురించబడింది నవం 17, 2026 | 2 నిమిషాల చదవడం

శాంతి, స్థిరత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి' : ప్రధానిమోడీ

మనీలా : ప్రపంచంలో ప్రస్తుతం ఒకదాని తర్వాత మరొకటి సంక్షోభాలు ఎదురవుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో దేశాల మధ్య పోటీ కంటే పరస్పర సహకారం ఎంతో అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. శాంతి, స్థిరత్వం, స్పష్టమైన విధానా లతోనే భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. భారత్, ఆసియాన్ దేశాలు ఈ దిశగా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనిలాలో జరిగిన 23వ భారత్-ఆసియాన్ సదస్సులో ఆయన మాట్లాడారు. భారత్, ఆసియాన్ దేశాలు కలిసి ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగో వంతు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని మోడీ గుర్తుచేశారు. ఇంతటి ప్రజాబలం ఉన్న ప్రాంతానికి ప్రపంచంలో

ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఆ ప్రాంతాన్ని శాంతి, స్థిరత్వానికి నిలయంగా మార్చే సామర్థ్యం భారత్, ఆసియాన్ దేశాలకు ఉందని చెప్పారు. ఇందుకు అవసరమైన సంకల్పం కూడా ఉభయ పక్షాలకు ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆసియాన్ సదస్సు థీమ్ 'నావిగేటింగ్ అవర్ ఫ్యూచర్ టుగెదర్' (మన భవిష్యత్తును కలిసి నిర్మించుకోవడం) ఎంతో ప్రాధాన్యం కలిగినదని నరేంద్ర మోదీ అన్నారు

ప్రపంచం వరుస సంక్షోభాలను ఎదుర్కొంటున్న సమయంలో ఆ థీమ్ మరింత అవసరమని చెప్పారు. దేశాల మధ్య పరస్పర నమ్మకం, సహకారం పెరిగితేనే భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగలమని ఆయన అభిప్రాయపడ్డారు.భారత్, ఆసియాన్ దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో యాక్ట్ ఈస్ట్ పాలసీ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని తెలిపారు. గత కొన్నేళ్లుగా ఆ విధానం వల్ల ఇరు పక్షాల మధ్య సంబంధాలకు కొత్త ఊపు వచ్చిందన్నారు. 2014 నుంచి భారత్, ఆసియాన్ దేశాల ప్రజల మధ్య సంబంధాలను పెంచేందుకు 100కు పైగా కార్యక్రమాలు చేపట్టినట్టు వెల్లడించారు. దాదాపు 250 క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టులను ప్రారంభించినట్టు తెలిపారు.భారత్, ఆసియాన్ దేశాల మధ్య రవాణా, పర్యాటక సంబంధాలు కూడా పెరుగుతున్నాయని ప్రధాని తెలిపారు. భారత్ నుంచి ఆసియాన్‌లోని తొమ్మిది దేశాలకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ మార్గాల్లో ప్రయాణాలు పెరగడంతోపాటు పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతోందన్నారు. ఇది ఇరు ప్రాంతాల మధ్య సన్నిహిత సంబంధాలకు నిదర్శనమని పేర్కొన్నారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్