కేంద్రం సహకారంతోనే ఓటు చోరీ కుట్ర :
‘ఓట్ బచావో.. దేశ్ బచావో’
కార్యక్రమంలో
ఏఐసీసీ పరిశీలకులు రంగరాజన్ మోహన్, కుమార మంగళం
నవతెలంగాణ-వికారాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఓటు చోరీని అడ్డుకుందామని ఏఐసీసీ పరిశీలకులు రంగరాజన్ మోహన్, కుమార మంగళం పిలుపునిచ్చారు. ‘ఓట్ బచావో దేశ్ బచావో’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సత్యభారతి ఫంక్షన్ హాల్‌లో డీసీసీ అధ్యక్షులు జాదవ్ ధారాసింగ్ నాయక్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకొని ఓటు చోరీకి పాల్పడుతుందని ఆరోపించారు. ఓటు హక్కును కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి పౌరుడీ బాధ్యత అని, ఓటు చోరీని అడ్డుకుని ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు.
ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కును పరిరక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించాలని కోరారు. దేశంలో ఓటు హక్కు పరిరక్షణపై అనేక సందేహాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఓటరు జాబితాల పారదర్శకతను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల వ్యవస్థపై ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగాలని అభిప్రాయపడ్డారు.
ఓటు హక్కు అనేది కేవలం ఎన్నికల సమయంలో వినియోగించే హక్కు మాత్రమే కాదని, ప్రజాస్వామ్య భవిష్యత్‌ను నిర్ణయించే కీలక బాధ్యత అని అన్నారు. ప్రతి ఓటరూ తన పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలని, ఓటరు జాబితాల్లో తప్పులు లేదా అనుమానాస్పద మార్పులు కనిపిస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఓటు హక్కు పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అక్టోబర్ చివరి నుంచి నవంబర్ 25వ తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్ చైర్ పర్సన్ రజిత, వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మెన్ అర్థ సుధాకర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, ఆర్టీఏ నెంబర్ సయ్యద్ జాఫర్, ఏఎంసీ చైర్మెన్లు శ్రీనివాస ముదిరాజ్, సర్ కన్వీనర్లు కరణం పురుషోత్తం రావు, కోఆర్డినేటర్ మల్లేష్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్లు అనంతరెడ్డి, కడుమూరు ఆనందం, నర్సిరెడ్డి, సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి రామచంద్ర రెడ్డి, నర్సింలు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సతీష్ రెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షులు అమీర్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)