Magazines

12 వేల మంది రైతులతో 
ముంబయికి వాహన లాంగ్‌మార్చ్‌

51 నిమిషాల క్రితం

Long march of vehicles to Mumbai with 12,000 farmers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 3 నిమిషాల చదవడం

లిఖితపూర్వక హామీ ఇచ్చేవరకు 
పోరాటం కొనసాగిస్తాం : ఏఐకేఎస్‌

వెయ్యి వాహనాలతో అఖోలే నుంచి ప్రారంభం
కరువు పరిహారం, రుణమాఫీ, అటవీ భూములపై హక్కుల కోసం ఆందోళన

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

మహారాష్ట్రలో కరువు బాధిత రైతులకు తగిన పరిహారం చెల్లించాలని, రుణమాఫీ అమలు చేయాలని, సాగు చేస్తున్న భూములపై హక్కులు కల్పించాలని, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎఐకెఎస్‌ ఆధ్వర్యంలో భారీ వాహన లాంగ్‌ మార్చ్‌ ప్రారంభమైంది. సోమ‌వారం మ‌హారాష్ట్రలోని అహిల్యానగర్‌ జిల్లా అఖోలే నుంచి ప్రారంభమైన ఈ మార్చ్‌లో 20కి పైగా జిల్లాల నుంచి 12 వేల మందికిపైగా రైతులు, వెయ్యికి పైగా వాహనాల్లో ముంబాయికి బయలు దేరారు. 200 కిలోమీటర్లకు పైగా సాగనున్న ఈ మార్చ్‌ ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన వర్షా బంగ్లా వరకు కొనసాగనుంది. వాహనాలపై రెపరెపలాడుతున్న ఎర్రజెండాలు, డిమాండ్లతో కూడిన బ్యానర్లు, రైతులు ధరించిన ఎర్ర బ్యాడ్జీలతో అఖోలే ప్రాంతం పోరాట స్ఫూర్తిని చాటింది.

వాహన లాంగ్‌ మార్చ్‌కు ముందు అఖోలే పట్టణంలో భారీ పాదయాత్ర నిర్వహించారు. వందలాది ఎర్రజెండాలతో సాగిన ఈ యాత్రలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రైతుల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఎఐకెఎస్‌ జాతీయ అధ్యక్షులు అశోక్‌ ధావలే, ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌, స‌హాయ‌ కార్యదర్శి అజిత్‌ నవాలే, సీపీఐ(ఎం) ఎమ్మెల్యే వినోద్‌ నికోలే, ఎఐకెఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు యశ్వంత్‌ జాడే, కార్యదర్శి ఉమేష్‌ దేశ్‌ముఖ్‌, కోశాధికారి సదాశివ్‌ సాబ్లేతోపాటు పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే, కిసాన్‌ సభ మాజీ రాష్ట్ర అధ్యక్షులు జె.పి.గావిట్‌ నాయకత్వంలో నాసిక్‌ జిల్లా నుంచి వచ్చిన వాహనాల బృందం ఘోటీ వద్ద ప్రధాన మార్చ్‌లో కలిసింది.

రూ.5 వేల పరిహారం సరిపోదు

మహారాష్ట్రలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ఒక్కో రైతు కుటుంబానికి రూ.5 వేల పరిహారం ప్రకటించడం రైతులు ఎదుర్కొంటున్న నష్టాలను అవహేళన చేయడమేనని ఎఐకెఎస్‌ విమర్శించింది. రాష్ట్రంలోని 358 తాలూకాల్లో 305 తాలూకాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించిన నేపథ్యంలో రైతులకు తక్షణమే గణనీయమైన ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేసింది. పంట నష్టాలకు తగిన పరిహారం చెల్లించాలని, పంటల బీమా పరిహారం పొందకుండా రైతులకు ఎదురవుతున్న అడ్డంకులను తొలగించాలని కోరింది.

రుణాలు చెల్లించిన రైతులకూ మాఫీ వర్తింపజేయాలి

రూ.2 లక్షల రుణమాఫీ ప్రయోజనాన్ని సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు సైతం వర్తింపజేయాలని ఎఐకెఎస్‌ డిమాండ్‌ చేసింది. రుణాలు చెల్లించలేని రైతులకే మాఫీ పరిమితం చేసి, క్రమం తప్పకుండా చెల్లించిన రైతులకు అన్యాయం చేయడం తగదని పేర్కొంది. నమో శేత్కారీ మహాసన్మాన్‌ నిధి పథకం కింద పెండింగ్‌లో ఉన్న రెండు విడతల నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరింది. అటవీ భూములు, దేవాలయ ట్రస్టుల భూములు, ఇనాం భూములు, పశువుల మేత భూములను ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న రైతులకు వాటిపై యాజమాన్య హక్కులు కల్పించాలని డిమాండ్‌ చేసింది.

నోటీసులతో ఉద్యమాన్ని ఆపలేరు

ఈ డిమాండ్ల సాధన కోసం అక్టోబరు 21 నుంచి 26 వరకు అఖోలేలో మహాముక్కాం సత్యాగ్రహం నిర్వహించారు. ఆందోళనకు స్పందించి ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలను పరిష్కరిస్తుందని రైతులు ఆశించారు. అయితే, చర్చలకు ముందుకు రావడానికి బదులుగా పోలీసులు ఆందోళనకారులకు నోటీసులు జారీ చేసి, వర్షా బంగ్లా వైపు వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఎఐకెఎస్‌ తెలిపింది. ప్రభుత్వ ఒత్తిళ్లకు వెరవకుండా ముంబయి వైపు వాహన లాంగ్‌ మార్చ్‌ ప్రారంభించినట్టు పేర్కొంది. ప్రజాస్వామ్యబద్ధంగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ప్రజల హక్కు అని స్పష్టం చేసింది. నోటీసులు జారీ చేయడం, ఒత్తిళ్లు తీసుకురావడం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించకుండా తప్పించుకోలేరని పేర్కొంది.

లిఖితపూర్వక హామీ ఇచ్చేవరకు పోరాటం

అఖోలే నుంచి ప్రారంభమైన వాహన లాంగ్‌ మార్చ్‌ సోమవారం రాత్రి ఇగత్‌పురి సమీపంలోని ఘటన్‌దేవి వద్ద బస చేసింది. మంగళవారం ఉదయం అక్కడి నుంచి కసారా ఘాట్‌ మీదుగా ముంబాయికి కొనసాగనుంది. ముఖ్యమంత్రి రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర కార్మికులు, మహిళల సమస్యలపై ఎఐకెఎస్ ప్రతినిధి బృందంతో సమగ్ర చర్చలు జరిపి, డిమాండ్ల పరిష్కారానికి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వం తమ డిమాండ్లను లిఖితపూర్వకంగా అంగీకరించి, అమలుకు హామీ ఇచ్చేవరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఎఐకెఎస్‌ నాయకత్వం స్పష్టం చేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్