జైపూర్ నుంచి ముంబైకి తరలిస్తుండగా యువకుని అరెస్టు
సికింద్రాబాద్ జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ సంయుక్త ఆపరేషన్
నవతెలంగాణ-బేగంపేట్
జైపూర్ నుంచి ముంబైకి తరలిస్తున్న రూ.60 లక్షల విలువైన నకిలీ భారతీయ కరెన్సీ నోట్లను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో రాజస్థాన్‌కు చెందిన 19 ఏండ్ల శివరతన్ మహియాను అరెస్టు చేశారు. మరో నిందితుడు ఓం ప్రకాశ్ పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. అక్టో బర్ 31న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని 10వ నంబర్ ప్లాట్ ఫామ్‌పై ముంబై ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 18519) జనరల్ కోచ్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు నిందితుడిని గుర్తించారు. అతడి వద్ద ఉన్న నల్లరంగు బ్యాక్‌ప్యాక్‌లో రూ.500 ముఖ విలువ కలిగిన నకిలీ నోట్లు 12 కట్టలుగా ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.60 లక్షలుగా నిర్ధారించారు. నిందితుని నుంచి ఐఫోన్ 14 మొబైల్, రైలు ప్రయాణ టికెట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. రైల్వే డీఎస్పీ జావేద్, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లా శ్రీడూంగర్‌గఢ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కల్యాణ్‌సర్ గ్రామానికి చెందిన శివరతన్ మహియాకు కొన్ని నెలల కిందట అదే ప్రాంతానికి చెందిన ఓం ప్రకాశ్‌తో పరిచయం ఏర్పడింది. నకిలీ కరెన్సీ నోట్లను సమకూర్చి, తన అనుచరుల సహాయంతో ముంబైలో చలామణి చేస్తున్నట్టు ఓం ప్రకాశ్ అతడికి తెలిపాడు. గతంలోనూ నేర కేసుల్లో చిక్కుకుని జైలుకు వెళ్లారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న శివరతన్‌కు నకిలీ నోట్లను తరలిస్తే రూ.2 లక్షల పారితోషికం ఇస్తానని ఓం ప్రకాశ్ ఆశ చూపాడు. ఇందుకు అంగీకరించిన శివరతన్‌కు అక్టోబర్ 28న జైపూర్ రైల్వే స్టేషన్‌లో రూ.60 లక్షల విలువైన నకిలీ నోట్లతో కూడిన బ్యాగును అప్పగించాడు. తొలుత కాచిగూడకు, అనంతరం ముంబైకి వాటిని తీసుకెళ్లాలని సూచించాడు.
వరదలతో రైలు రద్దు.. మారిన ప్రయాణ మార్గం
ఓం ప్రకాశ్ సూచన మేరకు శివరతన్ మైసూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 12976)లో ప్రయాణించి అక్టోబర్ 30న అర్ధరాత్రి 12.10 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడికే ఇన్ లాడ్జిలో రాత్రి బస చేసి మరుసటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. వరదల కారణంగా కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రద్దు కావడంతో ముంబై ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లాలని ఓం ప్రకాశ్ సూచించాడు. దీంతో అక్టోబర్ 31న మధ్యాహ్నం 1.20 గంటలకు ముంబై ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ జనరల్ కోచ్‌లో బ్యాగుతో ఎక్కాడు. పది నిమిషాల వ్యవధిలోనే అంటే మధ్యాహ్నం 1.30 గంటలకు తనిఖీలు నిర్వహిస్తున్న జీఆర్‌పీ పోలీసులు, ఆర్‌పీఎఫ్ బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ బృందం అతడిని అదుపులోకి తీసుకుంది. విచారణలో ఓం ప్రకాశ్ సూచన మేరకు రూ.60 లక్షల నకిలీ నోట్లను ముంబైలోని మరో వ్యక్తికి అందించేందుకు తీసుకెళ్తున్నట్టు శివరతన్ వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఓం ప్రకాశ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సికింద్రాబాద్ రైల్వే పోలీస్ ఇన్‌స్పెక్టర్ బి. సాయి ఈశ్వర్ గౌడ్ తన సిబ్బందితో పాటు, ఆర్‌పీఎఫ్‌ఐపీఎఫ్ భవానీ శంకర్ సరస్వత్ నేతృత్వంలోని బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఆర్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుళ్లు మెట్ట గోవిందరాజులు, ఆర్‌ఎస్‌టీటీవీ రమణ, ఎస్.కె. వర్మ, పి. వెంకటేశ్వర్లు కీలకంగా వ్యవహరించారు.







కామెంట్‌లు (0)