దోషులను కఠినంగా శిక్షించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ ప్రాంతంలో ఇద్దరు దళిత మహిళలపై ఆర్ఎస్ఎస్ మతోన్మాదులు దాడి చేయడం దారుణమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పేర్కొన్నారు. ఆ దాడిని తీవ్రంగా ఖండించారు. దోషులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అల్మాస్గూడలో ఒక క్రిస్టియన్ కుటుంబా న్ని కలిసి వస్తున్న ఇద్దరు దళిత మహిళలపై మత మార్పిడులకు పాల్పడుతున్నారనే నెపంతో ఆర్ఎస్ఎస్ మతోన్మాదులు అత్యంత దారుణంగా భౌతిక దాడులకు పాల్పడ్డారని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి బాధిత మహిళలకు న్యాయం చేయాలని కోరుతూ వివిధ సంఘాల నాయకులు మీర్పేట్ పోలీస్స్టేషన్ ముందు నిరసన తెలిపే సమయంలోనూ ఆర్ఎస్ఎస్కు చెందిన వాళ్లు అక్కడకు చేరుకుని దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ తక్షణమే స్పందించి, నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
భారత రాజ్యాంగం ప్రతి పౌరునికీ తమ మతాన్ని విశ్వసించే, ప్రచారం చేసుకునే హక్కును కల్పించిందనీ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ, ఆర్టికల్ 19 ప్రకారం ప్రచార స్వేచ్ఛ పౌరులకు ఉన్నాయని గుర్తుచేశారు.
రాజ్యాంగబద్ధంగా ఇటువంటి ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛలు ఉన్నప్పటికీ, కనీసం మహిళలని కూడా చూడకుండా విచక్షణారహితంగా దాడులకు పాల్పడటం రాజ్యాంగ హక్కులను బహిరంగంగా ఉల్లంఘించడమే నని స్పష్టం చేశారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చట్టబద్ధంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి తప్ప, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని గూండాల్లా వ్యవహరించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలనీ, బాధిత దళిత మహిళలకు పూర్తి రక్షణ కల్పించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.






కామెంట్లు (0)