Magazines

తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి

1 గంట క్రితం

Telangana should be declared a drought-hit state.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 2 నిమిషాల చదవడం

నవంబర్‌ 3,4 తేదీల్లో 
క్షేత్రస్థాయిలో పర్యటన

సీఈసీ జ్ఞానేశ్‌‌కుమార్‌‌ తప్పుకోవాలని 1న ఢిల్లీలో నిరసన

డిసెంబర్‌ 2,3,4 తేదీల్లో జైల్‌‌భరో : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు నెలకొన్న నేపథ్యంలో కొన్ని మండలాలకే పరిమితం చేయకుండా తెలంగాణ మొత్తాన్ని కరువు ప్రభావిత రాష్ట్రంగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. కరువు నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సమగ్ర కార్యాచరణను చేపట్టాలని కోరారు. బుధవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు విఎస్‌ బోస్‌. ఎం బాలనర్సింహ్మాలతో కలిసి కూనంనేని విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కరువు పరిస్థితులను ఆసరాగా చేసుకుని ఎవ్వరైనా నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వచేసి బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. గోదాముల్లో సరుకులను దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి ఆ సరుకులను పేదలకు పంచుతామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో కరువు నేపథ్యంలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంతోపాటు వ్యవసాయ కూలీలకు ఉపాధి, పశుగ్రాసం, తాగునీరు, నిత్యావసర వస్తువుల కోసం ప్రత్యేక సహాయం అందించాలని సూచించారు. రాబోయే ఏడాది కాలంలో కరువు ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన నిధులు, సహాయక చర్యలపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర అంచనాలు రూపొందించాలని అన్నారు. కరువు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు వచ్చేనెల మూడు, నాలుగు తేదీల్లో జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని నిర్ణయించామన్నారు. కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ అదేనెల 10న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

​అసంఘటిత కార్మికులకు నెలకు రూ.15 వేల భృతి ఇవ్వాలి

కరువు ప్రభావం వ్యవసాయ రంగానికే పరిమితం కాదనీ, పట్టణాల్లోని అసంఘటిత రంగ కార్మికుల ఉపాధిపైనా పడుతుందని కూనంనేని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్మాణ రంగం మందగిస్తే భవన నిర్మాణ కార్మికులు, కూలీలు ఉపాధి కోల్పోతారని అన్నారు. ఆటో కార్మికులు, ఇతర రోజువారీ కూలీలు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పారు. ఈ నేపథ్యంలో పట్టణాల్లో ఉపాధి కోల్పోయిన అసంఘటిత రంగ కార్మికులకు నెలకు కనీసం రూ.15 వేల కరువు భృతి అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. పేదలకు ఇండ్ల కేటాయింపులో పారదర్శకత ఉండాలని సూచించారు. 58, 59 జీవోల కింద అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణను పూర్తిచేయాలనీ, ఇండ్లు లేని జర్నలిస్టులకు స్థలాలు కేటాయించి గృహ నిర్మాణానికి అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

​సీఎంతో చర్చించాకే ఎమ్మెల్సీ ఎన్నికలపై నిర్ణయం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ తరఫున పోటీ చేసే అంశంపై పార్టీ నాయకత్వం చర్చిస్తోందని కూనంనేని అన్నారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డితో సమావేశం అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ పేరుతో ఓటర్ల తొలగింపుపై తమకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు. ఎన్నికల సంఘం తీరుపై విచారణ జరిపించాలనీ, సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. అవసరమైతే అభిశంసన ప్రక్రియ ద్వారా తొలగించే అంశాన్ని పరిశీలించాలని అన్నారు. ఈ డిమాండ్లపై వచ్చేనెల ఒకటిన ఢిల్లీలో నిరసన ప్రదర్శన, డిసెంబర్‌ రెండు, మూడు, నాలుగు తేదీల్లో జైల్‌భరో కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వివరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్