‘దేశం కోసం’ పుస్తకావిష్కరణ సభలో వక్తలు
నవంబర్ 28న ఢిల్లీలో జాతీయ ఐక్యతా సదస్సు
నవతెలంగాణ – ముషీరాబాద్
కమ్యూనిస్టు పార్టీల ఐక్యతే ప్రజాస్వామ్య పరిరక్షణకు మార్గం అని పలువురు వక్తలు అన్నారు. ఆదివారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జస్టిస్ చంద్రకుమార్ రచించిన ‘దేశం కోసం – వామపక్ష ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలి’ అనే పుస్తక ఆవిష్కరణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జస్టిస్ చంద్రకుమార్, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, ప్రొఫెసర్ వెంకట దాస్, రేఖ చంద్రశేఖర రావు, సినీ కళాకారుడు మాదాల రవి, ఆంధ్రప్రదేశ్ యూఎల్డీఎఫ్ నాయకుడు వెంకయ్య, బొజ్జా భిక్షమయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. నేడు దేశంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. విద్యారంగం మొత్తం కార్పోరేట్ శక్తుల ఆధినంలోకి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయని, నిరుద్యోగం, పేదరికం, ధరల పెరుగుదల ఆర్థిక అసమానతలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయన్నారు. నేడు అధికారంలో కొనసాగుతున్న మనువాద శక్తులు ప్రజాస్వామ్యాన్ని విధ్వంసానికి గురిచేస్తున్నాయని అందులో భాగంగానే ‘సర్’ పేరుతో 13 కోట్ల మంది ఓట్లను తొలగించారని విమర్శించారు. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక విలువలను న్యాయవ్యవస్థ కాపాడుతుందనే నమ్మకం ప్రజల్లో సన్నగిల్లుతోందన్నారు. నేడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే కమ్యూనిస్ట్ పార్టీలన్నీ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ నెళికంటి సత్యం మాట్లాడుతూ..దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి సుదీర్ఘమైన పోరాట చరిత్ర ఉందని, కార్మికులు, రైతులు, పేదలు, అణగారిన వర్గాల హక్కుల సాధనలో కమ్యూనిస్టు పార్టీలు చారిత్రక పాత్ర పోషించాయని గుర్తుచేశారు. అయితే వివిధ కారణాలతో కమ్యూనిస్టు పార్టీలు విడిపోయి ఉండటం వల్ల ప్రజా ఉద్యమాల శక్తి బలహీనపడుతోందని అభిప్రాయపడ్డారు. గతంలో ఏర్పడిన విభేదాలను పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకొని, ఉమ్మడి లక్ష్యాల ప్రాతిపదికన కమ్యూనిస్టు పార్టీల పునరేకీకరణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర అసమానతలు ఎదుర్కొంటున్నారని, ప్రపంచవ్యాప్తంగా యువత, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు పౌర సమాజ సంస్థలు ప్రభుత్వాలపై ఉద్యమిస్తున్నాయని అన్నారు. విద్యా ప్రమాణాలు లోపించడం, అవినీతి, లాభాలే ధ్యేయంగా బీజేపీ పాలన కొనసాగుతుందన్నారు.మహిళలకు, ఆదివాసి, దళితులకు రక్షణ కరువైందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలు, సామాజిక ప్రజాసంఘాలు, ప్రజాతంత్రవాదులు ఐక్యం కావాల్సిన తక్షణ చారిత్రక అవసరం ఏర్పడిందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, సామాజిక న్యాయాన్ని కాపాడుకోవడానికి, ప్రజలు ఎదుర్కొంటున్న పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టు పార్టీలను, ప్రజాతంత్ర శక్తులను ఏకం చేయాలనే ప్రధాన లక్ష్యంతో వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యవేదిక ఏర్పడిందని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీల ఐక్యత అనేది కేవలం ఎన్నికల పొత్తులకు పరిమితం కాకూడదని, ప్రజల జీవన సమస్యలపై ఉమ్మడి పోరాటాలు నిర్వహించే శాశ్వత ఐక్యతగా అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. ప్రజల్లో వామపక్ష ఉద్యమంపై విశ్వాసాన్ని తిరిగి పెంపొందించాలంటే కమ్యూనిస్టు పార్టీల మధ్య ఐక్యత అత్యంత అవసరమని స్పష్టం చేశారు. వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీల ఐక్యత కోసం చర్చలు, సంప్రదింపులు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల నవంబర్ 28న న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో భారీ జాతీయ ఐక్యతా సదస్సును ఏర్పాటు చేశామని, ఈ సదస్సులో వివిధ కమ్యూనిస్టు పార్టీల ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీల మధ్య ఐక్యత సాధనకు ఈ సదస్సు ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వక్తలు సభ నిర్వహణ కమిటీ సభ్యులు కోలా జనార్దన్, ప్రొఫెసర్ గోళ్ల రమేష్, బండారు లక్ష్మయ్య, డాక్టర్.నాగేశ్వరరావ్, ప్రొఫెసర్ మొయినొద్దీన్, నైనాల గోవర్ధన్, మునీరుద్దీన్ ముజాహిద్, జక్కుల నాగయ్య, డాక్టర్.శ్రీనివాస్, విజయ్ కుమార్, కమ్యూనిస్టు నాయకులు గాదగోని రవి, ఎంసీపీ(యూ) రాష్ట్ర కార్యదర్శి, కె.రమ (సీపీఐఎంఎల్ మాస్ లైన్), కె.గోవర్ధన్ (సీపీఐఎం ఎల్ న్యూడెమోక్రసీ), జానకి రాములు (ఆర్ఎస్పీ), మామిండ్ల రమేష్ రాజా (సీపీఐఎంఎల్ లిబరేషన్), సీతా రాములు, వామపక్ష ప్రజాస్వామ్య మేధావులు కందిమల్ల ప్రతాప్ రెడ్డి, ప్రొఫెసర్ కొండా నాగేశ్వరావ్, ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి, అబ్దుల్ హక్ ఖమర్, మహ్మద్ అబ్దుల్ అజీజ్, పల్లాటి మల్లేష్, డా.మార్క శంకరనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)