టీడబ్యూజేఎఫ్ ఏర్పడి 20 ఏండ్లైన సందర్భంగా ద్వి దశాబ్ది ఉత్సవాలు
జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్య్లూజేఎఫ్) ఏర్పడి 20 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ద్విదశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ఫెడరేషన్ నిర్ణయించింది. అదే విధంగా జనవరి 3న టీడబ్య్లూజేఎఫ్ రాష్ట్ర మూడో మహాసభలను హైదరాబాద్‌లో నిర్వహించాలని తీర్మానించింది. మహాసభలను విజయవంతం చేయాలని ఫెడరేషన్ యాక్టిగ్ అధ్యక్షులు పిల్లి రాంచందర్, ప్రధానకార్యదర్శి బసవపున్నయ్య జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం హైదారబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీడబ్య్లూజేఎఫ్ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పలు తీర్మానాలను ఆమోదించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజహితం కోసం పని చేస్తున్నారని తెలిపారు. అనేక కష్టాలకొర్చి వార్తలు సేకరిస్తున్నారని చెప్పారు. అలాంటి జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ఇండ్లస్థలాలకోసం మంత్రి ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినా అది పని చేస్తుందా? లేదా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్‌తోపాటు ఇతర జిల్లాల్లో ఉన్న జర్నలిస్టు సోసైటీలకు ఇండ్లస్థలాలు వెంటనే కేటాయించాలనికోరారు. ఖమ్మం జర్నలిస్టులకు కేటాయించిన స్థలాన్ని అప్పగించాలని డిమాండ్ చేశారు. కొన్ని జిల్లాల్లో అక్రిడేషన్ కార్డు జారీచేయాలంటే పోలీస్ ఎంక్వాయిరీ చేస్తున్నారని, అటువంటి పద్దతులను మానుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికీ అర్హులైన జర్నలిస్టులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ప్రశ్నించే జర్నలిస్టులపై అకారణంగా కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలపక్షాన గొంతెత్తే జర్నలిస్టులకు రక్షణ లేకుండాపోయిందన్నారు. ముఖ్యంగా ఆరోగ్య భద్రత విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోయిందని చెప్పారు. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఎంతో మంది జర్నలిస్టులకు జర్నలిస్టు హెల్త్‌కార్డులు ఉపయోగపడటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని, లేనిచో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటకొండ కృష్ణ, గుడిగ రఘు, మాణిక్ ప్రభు, రాజశేఖర్, రాష్ట కార్యదర్శులు దయాసాగర్, సలీమా, ఈ చంద్రశేఖర్, గండ్ర నవీన్, జగదీష్, నిరంజన్, వెంకటేష్, బిక్షపతి, విజయానంద్రావుతోపాటు రాష్ట్ర కమిటీ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు, జాతీయ కౌన్సిల్‌సభ్యులు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)