Magazines

దాహం.. దాహం..

1 గంట క్రితం

Thirst.. thirst..
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 3 నిమిషాల చదవడం

ఎండిపోతున్న బోర్లు, 
అడుగంటిన నీళ్లు!

ఇప్పుడే ఇలా.. ఎండాకాలం గడిచేదేలా..?

ట్యాంకర్లపై ఆధారపడుతున్న ప్రజలు

నవతెలంగాణ-బోడుప్పల్

వేసవి రావడానికి ఇంకా నాలుగైదు నెలల సమయముంది. అయినా ప్రజలకు ఇప్పటికే నీటి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఎండాకాలంలో ఏం జరుగుతుందోనని ప్రజల్లో ఆందోళన నెలకొంది. సాధారణంగా నీటి సమస్య వేసవిలో కొన్ని నెలలు మాత్రమే కనిపిస్తుంది. కానీ ఈసారి సెప్టెంబరు, అక్టోబరు నెలల్లోనే సమస్య మొదలైంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోగా ఇంటి అవసరాలకు వేసుకున్న బోర్లూ ఎండిపోతున్నాయి. దాంతో ప్రజలు ప్రయివేటు ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. దాంతో కుటుంబ జీవన ఖర్చు భారంగా మారే పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం, వర్షాలు తక్కువగా ఉండటం, భూగర్భ జలాల క్షీణత కారణంగా పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉంది.

గతంలోఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో భూగర్భ జలాలు క్రమంగా తగ్గిపోయాయి. ఫలితంగా మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌, చెంగిచెర్ల, పీర్జాదిగూడ, మేడిపల్లి పరిధిలోని అనేక కాలనీల్లో బోర్లు ఎండిపోతున్నాయి. ఇంటి అవసరాలకు సరిపడా నీరు అందకపోవడంతో ప్రయివేటు ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఒక్క ట్యాంకర్‌కు రూ.800 నుంచి రూ.1,000 వరకు చెల్లించాల్సి వస్తోందని ప్రజలు చెబుతున్నారు.

దీంతో నెలకు రూ.5 వేలకు పైగా ట్యాంకర్లపైనే ఖర్చవుతోంది. ఇంటి అద్దె, ఇతర ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ట్యాంకర్ల ఖర్చు అదనపు భారంగా మారింది. రోజువిడిచి రోజు ట్యాంకర్‌ తెప్పించుకోవాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి నీటి సరఫరాను పెంచాలని కోరుతున్నారు.

వాషింగ్‌ సెంటర్లపై నిఘా పెట్టాలి

కార్లు, ద్విచక్ర వాహనాలను కడిగే వాషింగ్‌ సెంటర్లు పెద్ద మొత్తంలో నీటిని వినియోగిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. నీటి ఎద్దడి నేపథ్యంలో ఈ కేంద్రాలపై అధికారులు నిఘా పెట్టి, అవసరమైన నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిర్మాణంలో ఉన్న ఇండ్లకు ఇచ్చిన తాత్కాలిక మంచినీటి కనెక్షన్లను సమీక్షించి, నీటి వృథాను అరికట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

నవంబర్‌ 1 నుంచి గ్రీన్‌ ట్యాంకర్లు

నీటి సమస్యను తగ్గించేందుకు నవంబర్‌ 1 నుంచి ‘గ్రీన్‌ వాటర్‌ ట్యాంకర్‌’ సేవలను ప్రారంభించనున్నట్టు జలమండలి ప్రకటించింది. శుద్ధి చేసిన మురుగునీటిని నిర్మాణ రంగం, పరిశ్రమలు, పార్కులు, తోటల నిర్వహణ, రోడ్ల శుభ్రత, ధూళీ నియంత్రణ వంటి తాగునీటితో సంబంధం లేని అవసరాలకు సరఫరా చేయనున్నారు.

ఈ ట్యాంకర్లకు ప్రత్యేక గుర్తింపు, జీపీఎస్‌ ట్రాకింగ్‌ సదుపాయాలు ఉంటాయి. ఆన్‌లైన్‌ బుకింగ్‌, డిజిటల్‌ చెల్లింపులు, నీటి నాణ్యత పరీక్షల సదుపాయాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ విధానం ద్వారా తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించడం తగ్గి, భూగర్భ జలాలపై ఒత్తిడి కొంత మేర తగ్గుతుందని భావిస్తున్నారు.

ట్యాంకర్లపైనే ప్రజల ఆధారం

బోడుప్పల్ సర్కిల్ పరిధిలో 90 వేలకు పైగా ఇండ్లు, అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. అయితే జలమండలి అధికారులు అందించిన సమాచారం ప్రకారం సర్కిల్ పరిధిలో మొత్తం 47,802 నీటి కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి.

ఇండ్ల సంఖ్యతో పోలిస్తే కనెక్షన్ల సంఖ్య తక్కువగా ఉండటం దృష్టిలో పెట్టుకుని అధికారులు కనెక్షన్ల సర్వే నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిజమైన కనెక్షన్లు, బిల్లులు చెల్లించేవారి సంఖ్య, సరఫరా అయ్యే నీటి పరిమాణం, వాస్తవ వినియోగం తేల్చడం ద్వారా నీటి నిర్వహణను మెరుగు పరచవచ్చని వారి కోరిక.

పొదుపు పాటించకుంటే భవిష్యత్తు కష్టమే..!

నీటి ఎద్దడి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించాలని జలమండలి అధికారులు సూచిస్తున్నారు. ఇంటి వాకిళ్లు శుభ్రం చేయడానికి పైపులతో నీటిని వృథా చేయకుండా బకెట్లను ఉపయోగించాలని, వాహనాలను పైపులతో కడగడం మానుకోవాలని చెబుతున్నారు. రోడ్లపై నీటి పైపులు పగిలి నీరు వృథాగా ప్రవహిస్తే వెంటనే జలమండలి అధికారులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. ఇండ్ల నుంచి నీరు వృథాగా బయటకు వస్తే సంబంధిత ఇంటికి జరిమానా విధిస్తామని జలమండలి బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం.ఎల్. సరిత హెచ్చరించారు.


ప్రయివేటు ట్యాంకర్ల దందాపై చర్యలుంటాయా?

ప్రజల నీటి అవసరాలను ఆసరాగా తీసుకుని కొందరు నీటి వ్యాపారం చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. బోడుప్పల్ సర్కిల్‌తో పాటు సమీప ప్రాంతాల్లో వ్యవసాయ అవసరాలకు వేసిన బోర్ల ద్వారా ప్రయివేటు ట్యాంకర్లు నీటిని అమ్ముతున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి అక్రమ బోర్లను గుర్తించి, రెవెన్యూ అధికారులు సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మేడిపల్లి తహసీల్దార్‌ ఎంవీ రెడ్డి తెలిపారు. అదే వి‌ధంగా ఎక్కడైనా అనుమతులు లేకుండా బోర్లు వేస్తే కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్