నవతెలంగాణ - హైదరాబాద్ : తాను ఇష్టపడిన మరదలిని వేరే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారనే కోపంతో మేనమామల ఇళ్లలో చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు శుక్రవారం సీఐ నవీన్, ఎస్సై భూమేష్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. బెల్లంపల్లి కాంట్రాక్టర్‌బస్తీకి చెందిన మహ్మద్ మగ్దూం వెల్డింగ్ పనిచేస్తుంటాడు. అతడికి సబ్బని లక్ష్మీనారాయణ స్నేహితుడు. మద్యం సేవించే సమయంలో మగ్దూం.. జైపూర్ మండలం ఇందారం అనుబంధ గ్రామమైన కాసీంపల్లికి చెందిన తన చిన్న మేనమామ షేక్ సలీం కుమార్తెను ఇష్టపడినప్పటికీ, ఆమెను వేరే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారని స్నేహితుడితో చెప్పేవాడు. ఈ విషయంపై వారికి బుద్ధి చెప్పాలని లక్ష్మీనారాయణతో చెప్పేవాడు.
ఈ క్రమంలో షేక్ సలీం కుటుంబం గత నెల 28న కుమారుడి వివాహం కోసం దుస్తులు కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ వెళ్లినట్లు మగ్దూం తెలుసుకున్నాడు. అదే రోజు రాత్రి లక్ష్మీనారాయణతో కలిసి ద్విచక్రవాహనంపై కాసీంపల్లికి వెళ్లాడు. షేక్ సలీం ఇంటి తాళం పగులగొట్టి రూ.60 వేల నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేశారు. అనంతరం పక్కనే ఉన్న పెద్ద మేనమామ ఖాజాపాషా ఇంట్లోనూ చొరబడి బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
అదే రాత్రి బెల్లంపల్లికి చేరుకున్న నిందితులు నగదును పంచుకున్నారు. మగ్దూం రూ.35 వేలు, లక్ష్మీనారాయణ రూ.25 వేలు తీసుకుని హైదరాబాద్‌లో ఖర్చు చేశారు. మిగిలిన బంగారం, వెండిని తీసుకుని హైదరాబాద్ వెళ్తుండగా ఇందారం ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసులు మగ్దూను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 6 తులాల బంగారం, 45 తులాల వెండి, రూ.13,300 నగదు, ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు లక్ష్మీనారాయణ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలిస్తున్నారు.







కామెంట్‌లు (0)