పార్లమెంట్ ఎన్నికల్లో
పోటీకి సమాయత్తం
బెల్‌గ్రేడ్ : సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్ ఉచిచ్ తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే నెల 25న జరగనున్న పార్లమెంటరీ ఎన్నికలలో పోటీ చేసి ప్రధాని పదవిని చేపట్టేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగం ప్రకారం ఓ వ్యక్తి దేశాధ్యక్ష పదవికి మూడోసారి పోటీ చేసేందుకు అవకాశం లేదు. ఉచిచ్ రాజీనామా నేపథ్యంలో పార్లమెంట్ స్పీకర్ అనా బర్నా బిజ్‌కు తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. దేశంలో విద్యార్థుల నేతృత్వంలో ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా సుమారు రెండు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో ఉచిచ్ తన పదవికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఆయన సెర్బియన్ ప్రోగ్రెసివ్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. 2024 నవంబర్ 1వ తేదీన ఉత్తర సెర్బియాలోని నోవీ సాద్‌లో రైల్వే స్టేషన్ పైకప్పు కూలి 16 మంది మృతి చెందడంతో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ యూనివర్సిటీ విద్యార్థులు డిమాండ్ చేశారు. న్యాయం కోసం, అవినీతికి వ్యతిరేకంగా వారు చేపట్టిన ఆందోళన క్రమేపీ బలమైన ఉద్యమంగా రూపుదిద్దుకుంది. 14 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ఉచిచ్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఉద్యమకారులు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ప్రజల్లో తనపై తీవ్ర అసంతృప్తి నెలకొని ఉన్నప్పటికీ ఉచిచ్ నేతృత్వంలోని పార్టీ అధికారంలో కొనసాగేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. రాజీనామా పత్రంపై సంతకం చేయడానికి ముందు అధ్యక్షభవనం వెలుపల తన మద్దతుదారులను ఉద్దేశించి ఉచిచ్ ప్రసంగిస్తూ 'ఈ రాత్రి నాకు ఎంతో ప్రత్యేకం. ఈ అందమైన భవనంలో ఇదే నాకు చివరి రాత్రి. అయితే నేను భవిష్యత్తును చూస్తున్నాను. కొత్త విజయాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి' అని చెప్పారు. ప్రత్యర్థులను గతంలో ఎన్నడూ లేనంత మెజారిటీతో ఓడిద్దామని పిలుపునిచ్చారు.
విద్యార్థుల నిరసనలు...ప్రజాగ్రహంతో... సెర్బియా అధ్యక్షుడి రాజీనామా
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)