Magazines

భగత్‌సింగ్‌ ఆశయ బాటలో యువత పయనం

1 గంట క్రితం

Youth walking the path of Bhagat Singh's ideals
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 2 నిమిషాల చదవడం

స్వాతంత్ర్యం వచ్చినా.. వారి ఆశయాలు నెరవేరలేదు
పాలకులే మారారు.. సామాన్యుల జీవితాల్లో మార్పు రాలే..
భగత్‌‌సింగ్‌ జయంతిని అధికారికంగా నిర్వహించాలి
ఎస్‌ఎఫ్‌‌ఐ హిమాయత్‌నగర్‌ నుంచి ఎస్వీకే వరకు భారీ ర్యాలీ
నవతెలంగాణ-సిటీబ్యూరో ​
దేశ స్వాతంత్ర్యం కోసం చిరునవ్వుతో ఉరికొయ్యలను ముద్దాడిన అమరవీరుడు భగత్‌సింగ్‌ ఆశయ బాటలో నేటి యువతరం పయనించాలని ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చింది. భగత్‌సింగ్‌ 119వ జయంతిని పురస్కరించుకుని ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌‌లో హిమాయత్‌నగర్‌ నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే) వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె. అశోక్‌ ‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ర్యాలీని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భరతమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు, తెల్లదొరల పాలనను అంతమొందించేందుకు నూనూగు మీసాల ప్రాయంలోనే భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ పోరాట బాట పట్టారని కొనియాడారు. బ్రిటిష్‌ పార్లమెంట్‌పై బాంబుల వర్షం కురిపించి, ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ నినాదంతో యావత్‌ దేశ యువతలో విప్లవ చైతన్యాన్ని రగిలించిన వీర కిశోరం భగత్‌సింగ్‌ అని చెప్పారు. ఆయన చూపిన బాట.. స్వాతంత్ర్య సంగ్రామంలో ఎందరో విప్లవకారులను ముందుకు నడిపించిందన్నారు. ఆనాడు అమరులు చేసిన ప్రాణత్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించినప్పటికీ, వారి ఆశయాలు మాత్రం నేటికీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పాలకుల మార్పు మాత్రమే జరిగిందని, తెల్లదొరల స్థానంలో నల్లదొరల పాలన వచ్చిందే తప్ప సామాన్య ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పూ రాలేదన్నారు. సమాజంలో దోపిడీ, పేదరికం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని, విద్య, వైద్యం, ఉపాధి, రైతులకు గిట్టుబాటు ధరలు, ఆడబిడ్డలకు రక్షణ వంటి కనీస సమస్యలకు నేటికీ పరిష్కారం లభించకపోవడం దురదృష్టకరమన్నారు. సమస్యల పరిష్కారం కోసం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం భగత్‌సింగ్‌ స్ఫూర్తితో యువతరం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే భగత్‌సింగ్‌ జయంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు లెనిన్, ఉపాధ్యక్షులు శ్రీమన్, నాగేందర్, రజనీకాంత్, జిల్లా సహాయ కార్యదర్శులు ఆంజనేయులు, ప్రవీణ్, జిల్లా నాయకులు భరత్, కార్తీక్, అశ్వక్, సాయి, మనోజ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్