Magazines

మోడీ సర్కార్‌ వల్ల బలహీనపడిన దుకాణాలు, సంస్థల చట్టం

6 గంటల క్రితం

sattupally
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

- గుమస్తాల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చంద్రశేఖర్

నవతెలంగాణ-సత్తుపల్లి 

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్‌లను తెచ్చి దుకాణాలు, సంస్థల చట్టాన్ని బలహీనపరిచిందని, కార్పొరేట్ మాల్స్ యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ గుమస్తాలకు ద్రోహం చేస్తోందని జిల్లా గుమస్తాల సంఘం సహాయ కార్యదర్శి మల్లూరు చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సత్తుపల్లిలోని రావి వీర వెంకయ్య భవనంలో జరిగిన గుమస్తాల సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర విధానాల వల్ల 8 గంటల పనివేళలు 12 గంటలకు పెరిగాయని, శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


సెలవులు లేవని, దుకాణాలను తనిఖీ చేసి కార్మికుల బాగోగులు తెలుసుకునే హక్కును కార్మిక అధికారులు కోల్పోయారని తెలిపారు. షాపుల లైసెన్సుల రెన్యువల్స్ నిలిచిపోవడం వల్ల పెళ్లిళ్లు, ప్రసూతి సహాయం, పిల్లల స్కాలర్‌షిప్‌లు వంటి సంక్షేమ ఫలాలు గుమస్తాలకు అందడం లేదన్నారు. యజమానులు గుమస్తాల సంఖ్యను "సున్నా"గా చూపుతూ వెల్ఫేర్ ఫండ్ ఎగవేస్తున్నారని, ఈ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పెషల్ డ్రైవ్ చేపట్టి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు కొలికపోగు సర్వేశ్వరరావు మాట్లాడుతూ... గుమస్తాల పోరాటాలకు సీఐటీయూ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అర్హులైన గుమస్తాలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ గుమస్తాల సంఘం అధ్యక్షుడు అల్లంశెట్టి రాంబాబు, ఓలేటి రమాదేవి, జాన్ బీ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్