Magazines

నోయిడా కార్మికులపై కేసులు..

1 గంట క్రితం

Cases filed against Noida workers...
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 4 నిమిషాల చదవడం

ఛిన్నాభిన్నమైన బతుకులు
ఉద్యమం తర్వాత జైలు జీవితం

ఆగిన చదువులు.. ఊడిన ఉద్యోగాలు
ఇటు కోర్టుల్లో యోగి సర్కారుకు మొట్టికాయలు
పోలీసులు సమర్పించే ఆధారాలపై ప్రశ్నలు
ఎన్‌ఎస్‌ఏ కింద నిర్బంధంపై తీవ్ర వ్యాఖ్యలు

యూపీలోని కార్మికుల పట్ల యోగి సర్కారు వ్యవహరించిన కఠిన తీరు వారిని ఇప్పటికీ వెంటాడుతోంది. తక్కువ వేతనాలు, పెరుగుతున్న జీవన వ్యయాలకు వ్యతిరేకంగా యూపీలోని నోయిడాలో కార్మికులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన తర్వాత పోలీసుల చర్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. వందలాది మందిపై కేసులు, అరెస్టులు, నెలల తరబడి జైలు జీవితం.. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాలు కోల్పోయి, చదువులు మధ్యలోనే ఆగిపోయి అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. మరోవైపు, కొన్ని కేసుల్లో పోలీసులు సమర్పించిన ఆధారాలపై న్యాయస్థానాలు ప్రశ్నలు లేవనెత్తాయి.

న్యూఢిల్లీ : నోయిడాలో ఏప్రిల్‌లో జరిగిన కార్మికుల ఆందోళన ఒక నిరసనగా మొదలై.. అనంతరం పోలీసు కేసులు, అరెస్టులు, జైలు జీవితంగా మారింది. తక్కువ వేతనాలు, పెరుగుతున్న ఖర్చులకు వ్యతిరేకంగా రిచా గ్లోబల్‌ గ్రూప్‌ కార్మికులు ఏప్రిల్‌ 8 నుంచి ఆందోళన చేపట్టారు. రోజుకు వచ్చే ఆదాయం జీవన ఖర్చులకు సరిపోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు సంపాదిస్తున్న తమకు కుటుంబాన్ని నడపడం కష్టంగా మారిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఏప్రిల్‌ 13-14 తేదీల్లో ఆందోళన హింసాత్మకంగా మారింది. రహదారుల దిగ్బంధం, రాళ్లదాడి, వాహనాల దహనం, పోలీసులతో ఘర్షణల వరకు దారి తీశాయి. ఈ ఘటనలపై పలు పోలీస్‌ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదయ్యాయి. పోలీసులు వందల మందిని అరెస్టు చేశారు. అయితే ఈ అరెస్టుల సంఖ్య పోలీసులు చెప్పిన దాని కంటే ఎక్కువగా ఉందని ఆందోళనకారులు ఆరోపించారు. వర్గాలు కార్మికులు ఆరోపించినట్టుగానే పలు నివేదికల్లో అరెస్టులు, నిర్బంధాల సంఖ్యలో తేడాలు కనిపిస్తున్నాయి. పోలీసుల వాదన ప్రకారం.. కార్మికుల నిరసనలోకి బయటి వ్యక్తులు ప్రవేశించి హింసను ప్రేరేపించారు. వాట్సాప్‌ గ్రూపులను ఉపయోగించి ముందస్తు కుట్రకు పాల్పడ్డారని ఛార్జ్‌షీట్లలో పేర్కొన్నారు. రహదారులను దిగ్బంధించడం, ప్రభుత్వ సిబ్బందిపై దాడి, ఆస్తుల ధ్వంసం, రాళ్లు రువ్వడం వంటి ఆరోపణలను పోలీసులు నమోదు చేశారు. అయితే ఈ ఆరోపణలను నిందితుల కుటుంబాలు, వారి తరఫు న్యాయవాదులు ఇప్పటికే ఖండించారు.

ఉపాధి కోల్పోయి ఒకరు.. ఉద్యోగం, చదువు దెబ్బతిని ఇంకొకరు
ఈ కేసుల ప్రభావం మాత్రం జైలు గోడలకే పరిమితం కాలేదు. పంకజ్‌ అనే బార్బర్‌ సుమారు 45 రోజులు జైలులో ఉన్న తర్వాత తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. తనపై కేసు ఉందనే కారణంతో స్థానికంగా పని దొరకలేదని ఆయన చెప్పాడు. చివరకు గుజరాత్‌లోని మరో నగరానికి వెళ్లి ఉద్యోగం వెతుక్కోవాల్సి వచ్చిందని వాపోయాడు. 19 ఏండ్ల ఆశిష్‌ కుమార్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తూనే డిగ్రీ చదువుతున్నాడు. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో అరెస్టు కావడంతో ఉద్యోగం, చదువు రెండూ దెబ్బతిన్నాయని ఆయన తెలిపాడు. పోలీసు కేసు కారణంగా భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం పొందడం కష్టమవుతుందనే భయం ఇప్పుడు ఆయనను వెంటాడుతోంది. మరో యువకుడు ముఖేష్‌ బి.ఫార్మసీ చదువుతున్నాడు. జైలుకు వెళ్లడం, తరచూ కోర్టుకు హాజరు కావాల్సి రావడంతో చదువు, ఉపాధి రెండూ ప్రభావితమ య్యాయి. రోజువారీ కూలీగా పనిచేసేవారికి ప్రతి కోర్టు హాజరు అంటే ఒక రోజు కూలి కోల్పోవడమేనని ఆయన చెప్పాడు.

నోయిడా ఘటనతో అనేక ప్రశ్నలు ముందుకు
అయితే ఈ వ్యవహారం ఇక్కడితో ముగియలేదు. హైకోర్టు ఆదేశాన్ని సవాలు చేస్తామని కేంద్ర ప్రభుత్వ తరఫు సొలిసిటర్‌ జనరల్‌ సుప్రీంకోర్టుకు తెలిపారు. 23న సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశంలోని కొన్ని అంశాల అమలుపై స్టే విధించింది. మరో నిందితుడు, మాజీ జర్నలిస్టు సత్యం వర్మ కూడా ఎన్‌ఎస్‌ఏ కింద తన నిర్బంధా న్ని సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నోయిడా ఘటన కార్మికుల ఆర్థిక సమస్యలు, నిరసన హక్కు, పోలీసు దర్యాప్తు, కఠిన చట్టాల విని యోగం, న్యాయపరమైన పర్యవేక్షణపై అనేక ప్రశ్న లను ముందుకు తెచ్చింది. ఆందోళనలో హింసకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు అవసరమే అయినప్పటికీ.. ప్రతి అరెస్టుకు స్పష్టమైన ఆధారాలు ఉండాలనే అంశాన్ని ఈ కేసుల్లో కోర్టుల వ్యాఖ్యలు మరోసారి గుర్తుచేస్తున్నాయని సామాజిక కార్యకర్త లు, కార్మిక సంఘాల నాయకులు చెప్తున్నారు.

ఇవేం ఆధారాలు..?: కోర్టుల్లో దర్యాప్తు అధికారులకు ప్రశ్నలు

ఈ కేసుల్లో పోలీసుల దర్యాప్తు, ఆధారాలపై కోర్టులు కూడా ప్రశ్నలు లేవనెత్తాయి. నోయిడా సెషన్స్‌ కోర్టు కొన్ని కేసుల్లో కేవలం గుంపులో ఉండటం మాత్రమే నేరపూరిత ఉద్దేశానికి ఆధారం కాదని పేర్కొంది. నిందితులపై నిర్దిష్టమైన, వారి పాత్రను చూపించే ఆధారాలు సమర్పించారా అని ప్రశ్నించింది. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన ఆరోపణలకు తగిన దృశ్య ఆధారాలు లేవని కూడా కోర్టు పేర్కొంది. మరో కీలక పరిణామం ఏంటంటే.. ఢిల్లీ విశ్వవిద్యాలయ చరిత్ర పట్టభద్రురాలు, విద్యార్థి కార్యకర్త ఆకృతి చౌధరిని జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద నిర్బంధించడాన్ని సెప్టెంబర్‌ 2న అలహాబాద్‌ హైకోర్టు తప్పు పట్టి, దానిని రద్దు చేసింది. ఐదు నెలల నిర్బంధానికి సరైన ఆధారాలు లేవని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆమెపై హింసను ప్రేరేపించినట్టు చూపించే వాట్సాప్‌ సందేశం, వీడియో ఆధారం చూపలేకపోయారని కోర్టు పేర్కొంది. ఆకృతిని నిర్బంధించిన తీరుపై హైకోర్టు అధికారులపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆమెకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలనీ, సంబంధిత అధికారుల వేతనాల నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేయాలని ఆదేశించింది.


యోగి సర్కారు చర్యలతో నష్టపోయిన కార్మిక కుటుంబాలు

ఒకవైపు కార్మికుల జీవన వ్యయం, వేతనాల సమస్యలు కొనసాగుతుండగా.. మరోవైపు కేసుల్లో చిక్కుకున్న వారి కుటుంబాలు ఉద్యోగాలు, చదువులు, ఆదాయాన్ని కోల్పోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి. న్యాయస్థానాల్లో కేసుల తుది పరిష్కారం ఇంకా లభించాల్సి ఉంది. కానీ యూపీలోని బీజేపీ సర్కారు కార్మిక వ్యతిరేక విధానాలు, పోలీసు చర్యలతో ఇప్పటికే అనేక కుటుంబాల జీవితాల్లో మిగిల్చిన నష్టం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్