ఈసీపై మిత్రపక్షాల ప్రశ్నలు
జ్ఞానేశ్ కుమార్ వివరణ ఇవ్వాలంటూ డిమాండ్
ఓటర్ల జాబితా సవరణపై అనుమానాలు నివృత్తి చేయాలని సూచన
ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసం దెబ్బతినకూడదన్న చిరాగ్ పాశ్వాన్.. పారదర్శకతతోనే అనుమానాలకు తెరపడుతుందన్న టీడీపీ, ఆర్‌ఎల్‌ఎం
న్యూఢిల్లీ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) వ్యవహారంలో ఎన్నికల సంఘం పనితీరుపై వివాదం కొనసాగుతున్న వేళ.. అధికార ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. కూటమిలోని మూడు కీలక మిత్రపక్షాలు కూడా ఎన్నికల సంఘం నుంచి స్పష్టత కోరడం చర్చనీయాంశంగా మారింది. లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్), టీడీపీ, రాష్ట్రీయ లోక్ మోర్చా నేతలు ఎన్నికల సంఘం, ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు.
ఇటీవల వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం.. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత పది నెలల్లో ఎన్నికల సంఘం తీసుకున్న కొన్ని నిర్ణయాలపై 14 సార్లు లిఖితపూర్వక అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు వెల్లడైంది. ఓటర్ల పేర్ల చేర్పులు, తొలగింపులు, పునరుద్ధరణ, సర్‌కు సంబంధించిన నిర్ణయాలు, ఓటర్ల డేటాబేస్ నిర్వహణ, ఫారమ్-6లో మార్పులు వంటి అంశాలు ఈ అభ్యంతరాల్లో ఉన్నట్టు నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఎన్నికల సంఘం మాత్రం ఈ అభ్యంతరాలను అంతర్గత చర్చల్లో భాగమైన సాధారణ ప్రక్రియగా పేర్కొంది. వివిధ అభిప్రాయాలు వ్యక్తం కావడం సంస్థాగత నిర్ణయ ప్రక్రియలో సహజమేనని, గత పది నెలల్లో తీసుకున్న కీలక నిర్ణయాలన్నీ ముగ్గురు కమిషనర్ల ఏకాభిప్రాయంతోనే జరిగాయని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో ఎన్డీఏ మిత్రపక్షాల స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ (రామ్‌విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు పెరగడం మంచిది కాదని అన్నారు. ఎన్నికల సంఘం స్వతంత్ర రాజ్యాంగ సంస్థ అయినందున, దానిపై ప్రశ్నలు వస్తే ప్రధాన ఎన్నికల కమిషనర్ స్వయంగా తన వైఖరిని స్పష్టంగా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందని వివరించారు. ప్రతిపక్షానికి సమాధానం ఇవ్వడం కంటే ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయడమే ముఖ్యమని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికల సంఘం నుంచి స్పష్టత రావాలని కోరింది. ఏపీలో సర్ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని టీడీపీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణ దేవరాయలు అంటూనే.. ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యంలో కీలక రాజ్యాంగ సంస్థ కాబట్టి, ఎవరైనా ప్రశ్నలు లేవనెత్తినప్పుడు తగిన వివరణ ఇవ్వడం ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు.
రాష్ట్రీయ లోక్ మోర్చా అధినేత ఉపేంద్ర కుశ్వాహా కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. సర్‌పై ప్రజల్లో గందరగోళం నెలకొందనీ, వాస్తవ పరిస్థితిని ఎన్నికల సంఘం వెంటనే స్పష్టం చేయాలని కోరారు.
మరోవైపు, ఈ పరిణామాలను ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల సంఘం అంతర్గతంగా అభ్యంతరాలు వ్యక్తమైన అంశాలపై పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలనీ, సంస్థ నిర్ణయ ప్రక్రియలో పారదర్శకత ఉండాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, తొలగింపునకు సంబంధించిన డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. సర్ చుట్టూ మొదలైన వివాదం ఇప్పుడు ఎన్నికల సంఘం అంతర్గత నిర్ణయ ప్రక్రియ, పారదర్శకత, ప్రజల విశ్వాసం వంటి విస్తృత అంశాలపై చర్చకు దారితీసింది. ముఖ్యంగా అధికార కూటమిలోని మిత్రపక్షాలే వివరణ కోరడం ఈ వ్యవహారానికి మరింత రాజకీయ ప్రాధాన్యం తెచ్చింది. ఎన్నికల సంఘం ఇప్పటికే ‘నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే జరిగాయి’ అని చెప్తున్న నేపథ్యంలో.. అంతర్గతంగా నమోదైన 14 అభ్యంతరాల పూర్తి నేపథ్యాన్ని, వాటిపై తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు ఎంత స్పష్టంగా వివరిస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.






కామెంట్‌లు (0)