ఒకప్పుడు మనిషి తన వృత్తిని తానే చేసుకునేవాడు. రైతు వ్యవసాయం చేసేవాడు, నేత చీరలు నేసేవాడు, కమ్మరి పనిముట్లు తయారు చేసేవాడు. గ్రామం తన అవసరాలను తానే తీర్చుకునేది. అంటే అప్పట్లో స్వయం ఆధారిత జీవనం ప్రధానంగా ఉండేది.
కాలం మారింది. పరిశ్రమలు వచ్చాయి. ఉద్యోగాలు పెరిగాయి. మనిషి తన నైపుణ్యాన్ని ఒక సంస్థకు ఇచ్చి, దానికి ప్రతిఫలంగా జీతం తీసుకునే విధానం బలపడింది. ఉద్యోగం అంటే భద్రత, జీతం అంటే జీవితం అనే ఆలోచన కూడా పెరిగింది. కానీ ఇప్పుడు మరోసారి పరిస్థితి మారుతోంది. టెక్నాలజీ, కంప్యూటర్లు, ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ మార్కెట్ వల్ల ఒక వ్యక్తి తన నైపుణ్యంతో ప్రపంచంలోని ఎక్కడి నుంచైనా పని చేయగల పరిస్థితి వచ్చింది. అందుకే నేటి యువతకు ఒక ముఖ్యమైన ప్రశ్న.. “నాకు ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది?” అనేది మాత్రమే కాదు.. “నా నైపుణ్యంతో నేను ఏ అవకాశాన్ని సృష్టించగలను?” అనేది కూడా కావాలి.
అవకాశాన్ని సృష్టించాలి
ఎంట్రప్రెన్యూర్ అంటే.. పెద్ద కంపెనీ పెట్టిన వ్యక్తి మాత్రమే కాదు. తనలోని నైపుణ్యాన్ని గుర్తించి, దాన్ని ఒక సేవగా లేదా ఉత్పత్తిగా మార్చుకుని ఆదాయ మార్గాన్ని సృష్టించుకునే వ్యక్తి కూడా ఒక ఎంట్రప్రెన్యూరే. ఉదాహరణకు.. ఒక యువకుడికి గ్రాఫిక్ డిజైన్ వచ్చిందనుకుందాం. ఉద్యోగం కోసం నెలల తరబడి ఎదురు చూడటానికి బదులుగా చిన్న వ్యాపార సంస్థలకు పోస్టర్లు, సోషల్ మీడియా డిజైన్లు తయారు చేసి ఆదాయం సంపాదించవచ్చు. మరొకరికి వంట బాగా వచ్చిందను కుందాం. ఇంటి నుంచే ఫుడ్ బిజినెస్ ప్రారంభించవచ్చు. ఒకరికి బోధించడం బాగా వచ్చిందంటే ఆన్లైన్ క్లాసులు నిర్వహించవచ్చు. అంటే నైపుణ్యం + ఆలోచన + శ్రమ = స్వయం ఉపాధికి అవకాశం.
పెట్టుబడి డబ్బు కాదు ఆలోచన
చాలామంది “వ్యాపారం చేయాలంటే పెద్ద పెట్టుబడి కావాలి” అనుకుంటారు. కానీ ప్రతి వ్యాపారానికి మొదటి పెట్టుబడి డబ్బు కాదు. మొదటి పెట్టుబడి ఆలోచన. రెండవది నైపుణ్యం. మూడవది క్రమశిక్షణ. నాలుగవది పట్టుదల. సమస్యను చూసి భయపడే వ్యక్తి ఉద్యోగం కోసం చూస్తాడు. అదే సమస్యలో ఒక అవకాశాన్ని చూసే వ్యక్తి ఎంట్రప్రెన్యూర్‌గా మారుతాడు.
ఎంట్రప్రెన్యూర్ అంటే ఎవరు?
ఎంట్రప్రెన్యూర్ అంటే “నేనే బాస్” అని చెప్పుకునే వ్యక్తి కాదు. “నేను బాధ్యత తీసుకుంటాను” అని చెప్పగలిగే వ్యక్తి. విజయం వస్తే తనదే అని, అపజయం వస్తే ఇతరులను నిందించడం కాదు. ఏం తప్పు జరిగిందో విశ్లేషించుకుని మళ్లీ ప్రయత్నించడం అతని లక్షణం. ఒక మంచి ఎంట్రప్రెన్యూర్‌కు కొన్ని ముఖ్యమైన లక్షణాలు అవసరం.
కొత్తగా ఆలోచించడం
సమస్యను గుర్తించడం
పరిష్కారం వెతకడం
రిస్క్‌ను అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవడం
సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం
ఇతరులతో కలిసి పనిచేయడం
నిరంతరం కొత్తది నేర్చుకోవడం
అపజయం వచ్చినప్పుడు మళ్లీ ప్రారంభించే ధైర్యం
“నేనే బాస్” అనే ఆలోచన సరిపోదు
స్వయం వృత్తిలో స్వేచ్ఛ ఉంటుంది. మన నిర్ణయాలు మనమే తీసుకోవచ్చు. కానీ దానితో పాటు బాధ్యత కూడా ఉంటుంది. ఉద్యోగంలో జీతం ఆలస్యమైతే యజమానిని అడగవచ్చు. స్వయం ఉపాధిలో ఆదాయం తగ్గితే మన వ్యూహాన్ని మనమే మార్చుకోవాలి. కస్టమర్లు, సరఫరాదారులు, ఉద్యోగులు, మార్కెట్.. అందరితో సమన్వయం చేసుకోవాలి. అందుకే మంచి ఎంట్రప్రెన్యూర్ అంటే అందరినీ ఆదేశించే వ్యక్తి కాదు. అందరినీ కలుపుకుని నడిపించగల వ్యక్తి. ఉద్యోగులను చిన్నచూపు చూడటం, “నేనే యజమాని” అనే అహంకారంతో వ్యవహరించడం సంస్థను బలపరచదు. మంచి నాయకత్వం అంటే ఇతరుల ప్రతిభను గుర్తించి, సరైన బాధ్యతను అప్పగించి, వారితో కలిసి ముందుకు సాగడం.
నేటి అసలు అవసరం ఏమిటి?
డిగ్రీ అవసరం. విద్య అవసరం. ఉద్యోగం కూడా అవసరమే. కానీ ఇవి మాత్రమే సరిపోవు. నైపుణ్యం కావాలి. సృజనాత్మకత కావాలి. టెక్నాలజీపై అవగాహన కావాలి. మారుతున్న మార్కెట్‌ను అర్థం చేసుకోవాలి. తనను తాను నిరంతరం అభివృద్ధి చేసుకోవాలి. “నేను ఏ ఉద్యోగం పొందగలను?” అనే ప్రశ్నతో పాటు.. “నా వల్ల ఏ విలువ సృష్టించబడుతుంది?” అనే ప్రశ్న కూడా వేసుకోవాలి. ప్రపంచం మారుతోంది. ఉద్యోగాల స్వరూపం మారుతోంది. టెక్నాలజీ మారుతోంది. అందుకే కెరీర్ గురించి మన ఆలోచనా విధానం కూడా మారాలి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వ్యక్తి ఒక అవకాశాన్ని పొందవచ్చు. అవకాశాన్ని సృష్టించే వ్యక్తి మరెందరికో అవకాశాలు ఇవ్వగలడు. అందుకే స్వయం వృత్తి అంటే కేవలం వ్యాపారం కాదు. తన సామర్థ్యాన్ని గుర్తించుకోవడం, తన కాళ్లపై తాను నిలబడటం, తన ఆలోచనకు విలువ తీసుకురావడం, తనతో పాటు మరికొందరికి అవకాశాలు కల్పించడం. ఇదే నేటి ఆధునిక కెరీర్ ప్రపంచం మనకు చెబుతున్న ముఖ్యమైన సందేశం.
“ఉద్యోగం కోసం మాత్రమే ఎదురు చూడకండి.. మీలోని నైపుణ్యాన్ని అవకాశంగా మార్చుకోండి.”
డా.హిప్నో పద్మా కమలాకర్
9390044031
కౌన్సెలింగ్ సైకో థెరపిస్ట్,
హిప్నో థెరపిస్ట్






కామెంట్లు (0)