Magazines

కరువు కోరల్లో గ్రామీణ భారత్

2 గంటల క్రితం

కరువు విలయతాండవం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 2 నిమిషాల చదవడం

ఉపాధికి రూ.2 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి

మోడీ ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి

రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక‌ కార్యాచరణ చేపట్టాలి
పట్టణ పేదలకూ ఉపాధి హామీ అమలు చేయాలి
అక్టోబర్ 2న దేశవ్యాప్త ఆందోళనలు

వ్య‌వ‌సాయ, గ్రామీణ‌ కార్మిక సంఘాల జాతీయ వేదిక స‌మావేశంలో నిర్ణ‌యం


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలోని గ్రామీణ ప్రాంతాలను కరువు విలయతాండవం చేస్తోందనీ, గ్రామీణ కూలీలు వ్యవసాయ పనులు, ఉపాధి లేక పస్తులతో అల్లాడుతున్నారని వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘాల జాతీయ వేదిక ఆందోళన వ్యక్తం చేసింది. కరువు, వర్షాభావం, ప్రకృతి వైపరీత్యాలతో ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్న గ్రామీణ ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించింది. శుక్ర‌వారం నాడిక్క‌డ వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘాల జాతీయ వేదిక సమావేశం జ‌రిగింది. ఈ సమావేశంలో బి. వెంకట్, విక్రమ్ సింగ్, వి. శివదాసన్, సాహిల్ (ఏఐఏడ‌బ్ల్యూయూ), గోరియా, నిర్మల్ (బీకేఎంయూ), దేవేంద్ర ఝా (ఏఐఏఆర్ఎల్ఏ), ఇతర వ్యవసాయ కార్మిక సంఘాల నుంచి ఈకలోహ సింగ్, ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.


ప్రచార ఆర్భాటంలో మోడీ సర్కారు

గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించాల‌నీ, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కోసం అదనంగా రూ.2 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని వెంటనే ప్రకటించి, దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉపాధి పనులు చేపట్టాలని నేత‌లు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు, నిధులు మంజూరు చేయాలన్నారు. అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని స‌మావేశంలో నిర్ణ‌యించిన‌ట్టు బి.వెంక‌ట్ తెలిపారు. కరువుతో గ్రామీణ భారత్ అల్లాడుతుంటే మోడీ ప్రచారానికి మాత్రం కొదవ లేద‌ని విమ‌ర్శించారు. ప్రకృతి వైపరీత్యాలు, కరువు పరిస్థితులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేసి గ్రామీణ పేదలకు తక్షణ ఉపాధి కల్పించాల్సి ఉంద‌నీ, కానీ మోడీ ప్రభుత్వం మాత్రం గ్రామీణ పేదల ఆకలి కేకలను పట్టించుకోకుండా ప్రచార ఆర్భాటంలో మునిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం ప్రచార పిలాన్ ఊదుతోంద‌నీ, పేదల ఇండ్లలో మాత్రం పొయ్యి వెలగడం లేదని ఎద్దేవా చేశారు. దేశం అభివృద్ధి చెందుతోందని, పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని కేంద్రం చెప్పుకుంటుంద‌ని, అయితే గ్రామాల్లో వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఆరోపించారు. పేదల చేతిలో పని లేకపోతే అభివృద్ధి ఎక్కడుంది? కూలీ కుటుంబంలో పొయ్యి వెలగకపోతే వికసిత్ భారత్ ఎవరి కోసం? అని ప్ర‌శ్నించారు.

ఉపాధి హామీని బలహీనపరిచి పేదలపై మరో దెబ్బ

గ్రామీణ పేదలకు చట్టబద్ధమైన ఉపాధి హక్కును కల్పించిన ఉపాధి హామీ-2005ను రద్దు చేసి, దాని స్థానంలో కేంద్ర ప్ర‌భుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింద‌ని విమ‌ర్శించారు. ఉపాధి హామీని మరింత బలోపేతం చేయాల్సిన సమయంలో కొత్త పరిమితులు, నిబంధనలతో పేదల హక్కులను కుదించకూడదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 100 లేదా 125 రోజుల ఉపాధి ఏ కుటుంబానికీ సరిపోదని, ఏడాదికి కనీసం 200 రోజుల పని, రోజుకు రూ.700 వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావం, కరువు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా వ్యవసాయ పనులు తీవ్రంగా తగ్గిపోయిన ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు వెంటనే అదనపు ఉపాధి కల్పించాల‌ని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్