తాలిపేరు ప్రాజెక్టు 15 గేట్ల ఎత్తివేత
55,437 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల
నవతెలంగాణ–చర్ల
తుఫాన్ ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతం వర్షాలతో అతలాకుతలమైంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో భద్రాచలం మన్యంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రాజెక్టులోకి 56,365 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో అధికారులు మొత్తం 15 స్పిల్‌వే గేట్లను ఎత్తి 55,437 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోని 24 గేట్లకుగాను 10 గేట్లను పూర్తిగా ఎత్తి (ఫ్రీ ఫ్లో) నీటిని విడుదల చేస్తున్నారు. మరో ఐదు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తారు. అదనంగా ఎడమ ప్రధాన కాలువ (ఎల్‌ఎఫ్‌ఎంసీ) ద్వారా 20 క్యూసెక్కులు, కుడి ప్రధాన కాలువ (ఆర్‌ఎఫ్‌ఎంసీ) ద్వారా 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్) 74.00 మీటర్లు కాగా, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు 72.21 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టు క్రెస్ట్ లెవల్ 69.00 మీటర్లు. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 730 మిలియన్ క్యూబిక్ ఫీట్లు (ఎంసీఎఫ్‌టీ) కాగా, ప్రస్తుతం 432.962 ఎంసీఎఫ్‌టీ నీరు నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి వస్తున్న ఇన్‌ఫ్లో, దిగువకు విడుదల చేస్తున్న అవుట్‌ఫ్లోను అధికారులు ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నారు. వరద ఉధృతిని అంచనా వేస్తూ ప్రాజెక్టుకు చేరుతున్న అదనపు నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.
భారీ వర్షాలకు ఏజెన్సీ అతలాకుతలం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)