Magazines

అడవి బిడ్డలకు ఆదాయ మార్గం ‘ది ఓపెన్‌ ‌ఫీల్డ్‌’

03 సెప్టెంబర్, 2026

Children of the Forest
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 04, 2026 | 4 నిమిషాల చదవడం

డాక్టర్‌‌గా లక్షలు సంపాదిస్తూ హాయిగా బతికే అవకాశం ఉంది. పట్టణంలో ఆమె వృత్తికి మంచి ఆదరణ వుంది. కానీ తాను మాత్రం తన సమాజానికి సేవ చేయాలని నిర్ణయించుకుంది. పరోక్ష ఫౌండేషన్‌ ‌ద్వారా వారికి వైద్యం అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం లడఖ్‌, జార్ఖండ్‌ అడవుల వరకు అత్యంత కష్టమైన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అయితే ఆరోగ్య శిబిరాలతో పాటు వ్యవసాయంలో కూడా వారికి ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించింది. ఆమే డాక్టర్‌ మనీషా ఒరాన్.. ‘ది ఓపెన్ ఫీల్డ్’ అనే సంస్థను స్థాపించి అటవీ ఉత్పత్తులు వినియోగదా రులకు చేరవేస్తూ అడవి బిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్న ఆమె కృషి గురించి మరిన్ని విశేషాలు నేటి మానవిలో...


గిరిజన సమాజానికి చెందిన మనీషాకు అక్కడి పరిస్థితులు, సమస్యల గురించి బాగా తెలుసు. ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ప్రతి విషయంతో పాటు వారి భూమి, జీవనోపాధి, మార్కెట్‌పై ఆమెకు అవగాహన కలిగింది. 2018లో ఆ గ్రహింపు ఆమెను రాంచీకి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుంటిలోని తన పూర్వీకుల భూమికి తిరిగి తీసుకువచ్చింది. అక్కడ ఆమె ప్రస్తుతం ‘ది ఓపెన్ ఫీల్డ్’లో ఆమె సహ-వ్యవస్థాపకుడైన కుమార్ అభిషేక్‌తో కలిసి తన పనిని ప్రాంభించింది. ఒక పాలీ హౌస్‌లో గులాబీలను వాణిజ్య పంటగా వేసింది. అది ఘోరంగా విఫలమైంది. కానీ ఆ గులాబీలు వారిని దేశీయ ఆహార వ్యవస్థల గురించి మరింత లోతుగా అర్థం చేసుకునేలా చేశాయి. అటవీ ఆర్థిక వ్యవస్థ కోసం భౌతిక, డిజిటల్, మార్కెట్ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి 2023లో ‘ది ఓపెన్ ఫీల్డ్’ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ సంస్థ గిరిజనులతో పాటు అడవులపై ఆధారపడిన ప్రజలతో కలిసి పనిచేస్తూ,అటవీ ఉత్పత్తుల విలువలో వారికి సరైన వాటా లభించేలా సహాయ పడుతుంది.

సమస్యలకు పరిష్కారంగా...
‘జార్ఖండ్ అడవుల్లో ముడి పదార్థాలు సమృద్ధిగా ఉన్నాయి. కానీ వీరు మార్కెట్‌లో కనిపించడం లేదు. వనరులకు అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ, తుది విలువలో వారికి కనీసం చిన్న వాటా కూడా ఎందుకు అందడం లేదు?’ అని మనీషా అంటుంది. దీనికి ఆమె చెప్పే స్పష్టమైన ఉదాహరణ మహువా (మహువా విత్తనాలను నూనె తీయడానికి ఉపయోగిస్తారు, పువ్వును సహజమైన తీపి పదార్థంగా వాడతారు). ఇది సుస్థిరంగా పండే ఒక రకమైన పంట. దీన్ని చెట్టు నుండి కోయరు. నేల మీద నుండి సేకరిస్తారు. అంటే దీన్ని సేకరించిన ప్రదేశానికి సమీపంలో గ్రేడింగ్ చేయడానికి, ఎండబెట్టడానికి లేదా ప్రాసెస్ చేయడానికి ప్రస్తుతం సరైన ప్రదేశం లేదు. దాంతో పంట కోత తర్వాత అవగాహన లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అప్పుల బాధ భరించలేక వచ్చిన ధరకు మధ్యవర్తులకు అమ్మేసుకుంటున్నారు. ఇక కొనుగోలుదారులు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటికి పరిష్కారంగా ఏర్పడిన ఓపెన్ ఫీల్డ్ సంస్థ కార్యక్రమాలు ప్రస్తుతం రాంచీ కేంద్రంగా అటవీ ఆర్థిక వ్యవస్థలోని వివిధ స్థాయిలలో విస్తరించి ఉన్నాయి. ‘మేము అడవి అంతటా మైక్రో-ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం. అటవీ ఉత్పత్తులను మరింత విలువైనవిగా, నమ్మదగినవిగా, ట్రేస్ చేయగలిగేవిగా మార్చడం, పండించిన వారికి మంచి ధర అందేలా చూడడం మా లక్ష్యం’ అని మనీషా అంటుంది.

అయాన్ హబ్
ఇవి ప్రాథమిక వికేంద్రీకృత ప్రాసెసింగ్ యూనిట్లు. వీటిలో సెన్సార్లతో కూడిన సోలార్ డీహైడ్రేటర్ ఉంటుంది. ఇవి డేటా సేకరణ కేంద్రంగా కూడా పనిచేస్తాయి. ఇది గతంలో రాళ్లపైనా, రోడ్ల పక్కనా జరిగే ఎండబెట్టే ప్రక్రియను, ఒక అధికారిక సరఫరా గొలుసులో మొదటి డేటా పాయింట్‌గా మారుస్తుంది. ఈ యూనిట్లు ఐఐటి ఖరగ్‌పూర్ సహాయంతో మెరుగుపరచబడి ప్రస్తుతం పేటెంట్ దిశగా పయనిస్తున్నాయి. ప్రస్తుతం మహిళా స్వయం సహాయక బృందాలు, ది ఓపెన్ ఫీల్డ్ ద్వారా శిక్షణ తీసుకున్న సూక్ష్మ పారిశ్రామికవేత్తలు వీటిని ఎక్కువగా నడుపుతున్నారు. ఈ హబ్‌లపైన ‘ఫారెస్ట్ ఓఎస్’ అని పిలిచే ఒక వ్యవస్థ ఉంది. ఇది ఫీల్డ్ కోఆర్డినేటర్లు, రైతుల కోసం రూపొందించిన యాప్‌ల పొర. ఇది ప్రతి చెట్టును కంటికి కనిపించే, ట్రాక్ చేయగల ఆస్తులుగా మారుస్తుంది. ఒక్కో చెట్టు 100–200 కిలోల మహువా లేదా చింతపండును ఉత్పత్తి చేస్తుంది. 10 చెట్లు ఉన్న రైతుకు మార్కెట్ సమాచారం అందుబాటులో ఉంది.

లోపాన్ని పూరించడం
‘ది ఓపెన్ ఫీల్డ్’ ప్రస్తుతం 278 మంది రైతులతో నేరుగా పనిచేస్తోంది. తన ప్రాజెక్టులు, భాగస్వామ్యాల ద్వారా జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లలో 4,500 మందికి పైగా అటవీ ఉత్పత్తిదారులను భాగస్వాములను చేసింది. ఇది సేకరణ, ప్రాసెసింగ్, మార్కెట్ అనుసంధానంలో 75 మంది స్థానిక సూక్ష్మ-పారిశ్రామికవేత్తలను సృష్టించింది. డిజిటల్ రంగంలో ఇది సుమారు 200 హెక్టార్లలో 500కు పైగా అటవీ వృక్షాలను మ్యాప్ చేసింది. దీని బృందం వ్యవస్థాపకుల నుండి క్షేత్ర సమన్వయకర్తలకు మద్దతునిచ్చే 11 మంది సభ్యుల ప్రధాన బృందంగా ఎదిగింది. ‘కొనుగోలుదారుల వైపు చూస్తే, హోటల్, రెస్టారెంట్, కేటరింగ్ మా కీలక విభాగాలలో ఒకటి. మేము మొదట చెఫ్ కమ్యూనిటీని సంప్రదించాం. ఝార్ఖండ్ ఆహార సంస్కృతి గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు. అందుకే అక్కడ చెఫ్ యాత్రలను నిర్వహించాం. ఇక్కడ 32 గిరిజన సమూహాలు ఉన్నాయి. మా భాషలు కొంతవరకు అర్థమవుతున్నా, మా ఆహారం గురించి మాత్రం పెద్దగా అవగాహనలేదు’ అని మనీషా అంటున్నారు.

ముందుకు సాగే మార్గం
మనీషాకు వ్యవస్థాగతంతో పాటు వ్యక్తిగతమైన సవాళ్లు కూడా ఉన్నాయి. మొదటిది భూమిని, చెట్లను విలువైన ఆస్తులుగా గిరిజన వర్గాలు గుర్తించేలా చేయడం, అలాగే డబ్బు సంపాదించడానికి భూమిని విడిచి వెళ్లడమే ఏకైక మార్గం అనే నమ్మకంలో మార్పు తీసుకురావడం. మరొక సవాలు, మొదటి నుండి ఒక వ్యాపారాన్ని నిర్మించడం, దానికి నిధులు సమకూర్చడం. జార్ఖండ్ సీఎన్‌‌టీ చట్టాల ప్రకారం గిరిజన భూమిని తాకట్టు పెట్టలేదు. అలాగే రుణాలు నాలుగేండ్ల 11 నెలలకు పరిమితం చేయబడ్డాయి. ఇది వ్యాపారాన్ని విస్తరించడాన్ని కష్టతరం చేసింది. వీటన్నింటినీ అధిగమిస్తూ ముందుకు వెళ్లేందుకు మనీషా కృషి చేస్తుంది. ఇప్పటికే ఆదరణ పొందిన తమ క్లస్టర్ నమూనాను మరింతగా విస్తరించడంపై తక్షణ దృష్టి పెట్టారు. అటవీ ఆస్తులు, ఉత్పత్తిదారుల డేటా, ప్రాసెసింగ్ సామర్థ్యం, కొనుగోలుదారుల డిమాండ్‌ను అనుసంధానిస్తూ, అటవీ ఆర్థిక వ్యవస్థ కోసం ది ఓపెన్ ఫీల్డ్‌ను ఒక ఇంటెలిజెన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీగా నిర్మించాలనేది దీర్ఘకాలిక లక్ష్యం.


ముందు వరుసలో మహిళలు
‘ది ఓపెన్ ఫీల్డ్’ సంస్థలోని రైతులు చాలామంది స్థానిక సమాజం నుండే వచ్చారు. ఈ ప్రయత్నాలకు మహిళలే ప్రధానంగా నాయకత్వం వహిస్తున్నారు. జార్ఖండ్‌లోని కుంతి జిల్లా, రానియాలో నివసించే ఇద్దరు పిల్లల తల్లి సుమన్ ఖండుల్నా కథను మనీషా వివరిస్తుంది. ఆమె తన ఇంటి వ్యవసాయ పనులతో పాటు, తన అత్తమామల భూమిని కూడా చూసుకుంటున్నారు. ‘ది ఓపెన్ ఫీల్డ్’ ఆ ప్రాంతంలో అవగాహన కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు సుమన్ వద్ద సుమారు 150 మామిడి చెట్లు ఉండేవి. కానీ వాటి దిగుబడిలో అధిక భాగం అమ్ముడుపోకుండా మిగిలిపోయేది. వాటిని బంధువులకు ఇచ్చివేసేది. మెరుగైన ప్రాసెసింగ్, నాణ్యతతో కూడిన నిర్వహణ, బలమైన మార్కెట్ అనుసంధానాలతో సుమన్ ఇప్పుడు అవే అటవీ వనరుల నుండి మెరుగైన ఆదాయాన్ని సంపాదించగలుగుతుంది. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లలో వలసలు చాలాకాలంగా ఒక సవాలుగా ఉన్నాయి. దీనివల్ల మహిళలు భూమిని, ఇంటి ఆర్థిక వ్యవహారాలను, తమ పిల్లల చదువును చూసుకోవలసి వస్తోంది. అందుకే ఈ మార్పుకు మహిళలే నాయకత్వం వహించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్