2,400 ఎకరాలు రికవరీ చేసిన
వివరాలు బయటపెట్టాలి : బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సిరిసిల్లలో బీఆర్‌ఎస్ నాయకులు ఎనిమిది వేల ఎకరాల ప్రభుత్వ భూమిని దోచుకోగా అందులో 2,400 ఎకరాలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుందని అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆరోపణల్ని రుజువు చేయలేక పోతే సిరిసిల్ల ప్రజలకు సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మూడేండ్ల పాలనలో తొలిసారి సిరిసిల్లకు వస్తున్న ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డిని స్వాగతిస్తున్నామని తెలిపారు. రాజకీయ విమర్శలు, వ్యక్తిగత దూషణలకు దిగకుండా ప్రజల సమస్యలకు సమాధానం చెప్పాలని కోరారు. 420 హామీల్లో ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసిందని విమర్శించారు. తమ పాలనలో సిరిసిల్ల నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించామనీ, ప్రతి నెలా రూ.15 వేల నుంచి 20 వేల వరకు వేతనం లభించేలా చూశామని గుర్తుచేశారు. నేతన్నల రూ.60 కోట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించారు. 10 శాతం యార్న్ సబ్సిడీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపేసిందని విమర్శించారు. సిరిసిల్లలో యార్న్ డిపో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. యువతకు ఉపాధి కల్పించేందుకు అపెరల్ పార్కులో ఎన్ని పరిశ్రమలను ఏర్పాటు చేయిస్తారు? ఎంత మందికి ఉపాధి కల్పిస్తారు? అనే దాన్ని వెంటనే ప్రకటించాలని కోరారు. సిరిసిల్ల పద్మశాలి బిడ్డను చైర్మెన్‌గా ఎప్పుడు నియమిస్తారో తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను ఎప్పటిలోగా నెరవేరుస్తారని ప్రశ్నించారు. సిరిసిల్లకు అదనంగా ఎన్ని టన్నుల మార్కెట్ గోదాములను మంజూరు చేస్తారో సీఎం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మల్కపేట నుంచి అప్పర్ మానేరు వరకు నీరు ఎప్పుడు అందిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. యువతకు ఉపాధి కల్పించేందుకు సిరిసిల్లలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఎన్ని కోట్లు కేటాయిస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. సిరిసిల్ల నియోజకవర్గానికి ఎన్ని రోడ్లు, ఎన్ని భవనాలు మంజూరు చేస్తారు? వెంటనే ఎన్ని నిధులు విడుదల చేస్తారు? ప్రకటించాలని డిమాండ్ చేశారు. సర్దాపూర్‌లోని సిరిసిల్ల బెటాలియన్ పోలీసు కుటుంబాలు ఎన్నికల్లో ఇచ్చిన ‘ఏక్ పోలీసు’ హామీని అమలు చేయాలని కోరారు. సిరిసిల్ల వైద్యరంగానికి మరిన్ని నిధులు ఇవ్వాలని విన్నవించారు. సిరిసిల్ల వైద్యరంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే చర్యలు, కేటాయించే నిధుల వివరాలను సీఎం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బాండ్ పేపర్లపై ఇచ్చిన హామీలకు దిక్కేలేదని విమర్శించారు.
8 వేల ఎకరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
50 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 2 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)