Magazines

ఆర్టీసీ ఎన్నికలు ఆషామాషీ కావు

53 నిమిషాల క్రితం

RTC elections are no trivial matter.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 2 నిమిషాల చదవడం

ప్రభుత్వంలో విలీనం.. 
ఒప్పందం..
సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండా : ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్‌ రావు
నాటి నుండి నేటి వరకు సమస్యలపై పోరాడిన బాణం గుర్తుకే ఓటు వేయండి : టీడబ్ల్యూయూ రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి
నవతెలంగాణ-జహీరాబాద్

రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు, సంక్షేమం, వారి కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం, హక్కుల సాధన కోసం జరుగుతున్న ఎన్నికలు.. ఆర్టీసీ సంఘం గుర్తింపు ఎన్నికలని, ఇవి ఆషామాషీ ఎన్నికలు కావని ఎస్‌డబ్ల్యుఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వీరాంజ నేయులు, వీఎస్‌రావు అన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆదివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని షెట్కార్ కళ్యాణ మండపంలో రాష్ట్రస్థాయి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 97 డిపోల్లో 36వేల మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆ కార్మికులందరి కుటుంబాల సంక్షేమం, కార్మికుల ఉద్యోగ భద్రతతో కూడిన విలీనం లాంటి అనేక సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పోరాడి సాధించుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయని అన్నారు. గత బీఆర్‌ఎస్ పాలనలో ఆర్టీసీని నియంతలా పాలించి కార్మికులను చీమల్లా తొక్కి వేశారని, వారి హక్కులను కాల రాశారని విమర్శించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. ముఖ్యమంత్రి ఆర్టీసీ సంస్థలో ఉన్న యూనియన్లు అన్నింటితో చర్చించి గుర్తింపు ఎన్నికలు జరుపుకునేందుకు అనుమతివ్వడం, కార్మికుల సమస్యలపై చర్చించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయడం, రెండు సంవత్సరాల్లో రెండుసార్లు పీఆర్సీని అమలు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. చర్చల సమయంలో ఆర్టీసీ సంస్థలోని యూనియన్లలలో ఐకమత్యం లేకపోవడంతో కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని తెలిపారు. గుర్తింపు ఎన్నికల్లో గెలుపొందిన యూనియన్లకు విలీన కమిటీలో సభ్యులుగా చేర్చనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పడం హర్షించదగ్గ విషయమన్నారు. కాబట్టి కార్మికులు ఆలోచించి వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎస్‌డబ్ల్యుఎఫ్ బలపరిచిన టీడబ్ల్యూయూ గుర్తు బాణంపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు యూనియన్‌లో చీలికలు తెచ్చేందుకు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని, అలాంటి వారికి నమ్మకూడదని విజ్ఞప్తి చేశారు. విధులు నిర్వహిస్తూ మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల రూపాయల ఎక్స్‌‌గ్రేషియో ఇప్పించడంతోపాటు గతంలో ఆర్టీసీ కార్మికులకు పర్మినెంట్ చేయించడం, వారికి హక్కులు, సౌకర్యాలను ఇప్పించిన ఘనత కూడా తమకే దక్కుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు తనపై పెట్టి యూనియన్లను రద్దు చేసి రకరకాల వేధింపులకు గురిచేసినా తాము బెదరకుండా కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. కార్మికులందరూ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు అలర్ట్‌గా ఉండాలని విజ్ఞప్తి చేశారు. టీడబ్ల్యూయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి మాట్లాడుతూ.. నాటి నుంచి నేటి వరకు సమస్యలపై పోరాడిన బాణం గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ఇప్పటివరకు ఆర్టీసీ కార్మికులకు వివిధ హోదాల్లో ద్రోహం చేసిన వారు సైతం వచ్చి కార్మికులను మభ్య పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తారని, అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అనంతరం సంఘం గౌరవ అధ్యక్షులు బొంతు రామ్మోహన్, మాజీ ఎంపీ వేణుగోపాల చారి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఆయా నాయకులు మాట్లా డారు. ఈ సమావేశంలో సీఐటీయూ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జి.సాయిలు, ఎస్‌డబ్ల్యుఎఫ్ నాయకులు తుల్జాయ, అంజా గౌడ్, సంగప్ప టీడబ్ల్యూయూ నాయకులు నర్సింలు, స్వామి, చంద్రప్ప, రాజు, నర్సింగ్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కార్మికులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్