పామాయిల్ దిగుమతి సుంకాలపై పున:సమీక్షించాలి
రైతుల విషయంలో వెనక్కి తగ్గం : కేంద్రానికి తుమ్మల లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
డి పామాయిల్ దిగుమతి సుంకాన్ని తగ్గించి ఆయిల్ పామ్ రైతులతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడటం సరిగాదనీ, దానిపై వెంటనే పున: సమీక్ష చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆయిల్‌పామ్ రైతుల ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గబోమనీ, కేంద్రంపై పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం ఈ మేరకు మంత్రి తుమ్మల ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్ర వినియోగదారుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఇటీవల కేంద్రం తీసుకున్న ముడి పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశీయ ఆయిల్ పామ్ రైతుల ధరల ప్రయోజనాలను కాపాడేలా తక్షణ చర్యలు తీసుకోవాలనీ, గతంలో ఉన్న రక్షణాత్మక దిగుమతి సుంకాన్ని పునరుద్ధరించాలని కోరారు. దేశంలో వంట నూనెల దిగుమతి ఆధారితతను తగ్గించి ఆత్మనిర్భరత సాధించాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు స్పందించి తెలంగాణ రైతులు ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున చేపట్టారని గుర్తుచేశారు. ఒకవైపు ఎన్‌ఎమ్‌ఈఓ-ఓపీ ద్వారా రైతులను ఆయిల్ పామ్ సాగు వైపు ప్రోత్సహిస్తూ, మరోవైపు దిగుమతి చేసుకునే పామాయిల్ చౌకగా వచ్చేలా దిగుమతి సుంకాన్ని తగ్గించడమేంటి? అని ప్రశ్నించారు. ఆయిల్ పామ్ వంటి దీర్ఘకాలిక పంట విషయంలో విధాన స్థిరత్వం అత్యంత ముఖ్యమని తెలిపారు. రైతును ఆయిల్ పామ్ వైపు తీసుకురావడం మాత్రమే కాదు.. ఆ రైతు భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం కూడా కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలో ఆయిల్ పామ్ రైతులు ఉన్నందున, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఆయిల్ పామ్ రైతుల సమస్యను కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశంగా కాకుండా, దేశీయ వంట నూనెల ఉత్పత్తి, రైతుల ఆదాయం, ఎన్‌ఎమ్‌ఈఓ-ఓపీ లక్ష్యాలు, దిగుమతులపై దేశ ఆధారపడటాన్ని తగ్గించే జాతీయ లక్ష్యంతో ముడిపడిన అంశంగా కేంద్రం చూడాలని విజ్ఞప్తి చేశారు.






కామెంట్‌లు (0)