Magazines

సిఫారసుంటేనే నిమ్స్ లో వైద్యం

1 గంట క్రితం

Medical treatment at NIMS available
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 3 నిమిషాల చదవడం

బెడ్లు, స్కానింగ్‌లకు రోజుల తరబడి రోగుల నిరీక్షణ

‘అత్యవసర’ గోస అందని ప్రాథమిక వైద్యం

ఆర్టీఐ దరఖాస్తుకూ సమాధానం కరువు

రోగులకు చుక్కలు చూపిస్తున్న కొందరు సిబ్బంది

సర్కారు చొరవ తీసుకోవాలంటున్న పేషెంట్లు


నవతెలంగాణ-సిటీబ్యూరో
నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలందించాల్సిన నిజామ్స్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్).. రెఫరల్‌ ‌కేసులకు ప్రాధాన్యం ఇస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పేద రోగులకు వైద్య సేవలందించడంలో నిర్లక్ష్యం, ఆలస్యానికి ఈ ఆస్పత్రి కేరాఫ్‌‌గా మారుతోంది. సిఫారసు ఉంటేనే సకాలంలో వైద్యం అందుతుండటంతో ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు ప్రతి నిత్యం నిరీక్షణ తప్పడం లేదు. ఓపీ మొదలు ఐపీ, ఎమర్జెన్సీ వరకు.. ఉదయం వరుసలో నిలబటడం మొదలు పెడితే.. ఇంటికి వెనుదిరిగి వెళ్లే వరకు పెద్ద పరీక్షే. ఎమర్జెన్సీ కేసులు సైతం ఆలస్యమవుతుండటంతో రోగులు గంటల తరబడి ట్రాలీలపైనే ఉండాల్సి వస్తోంది. ఆర్టీఏ దరఖాస్తులకూ స్పందన కరువైంది. దీనికితోడు కొందరు సిబ్బంది బెదిరింపులు, వారి ప్రవర్తన రోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నిమ్స్ ఆస్పత్రికి నగరంతోపాటు రాష్ట్ర నలుమూలల నుంచి వైద్యం కోసం వస్తూ ఉంటారు. ఇక్కడ 1,500 బెడ్ల సామర్థ్యం ఉండగా.. ప్రతిరోజూ సుమారు 3వేలకుపైగా ఓపీ నమోదవుతోంది.

ఇక్కడ వైద్యం అందించే కేసుల్లో దాదాపు 70శాతం వరకు రెఫరల్ కేసులే ఉంటున్నాయి. అత్యవసర కేసులను సైతం చేర్చుకోవడానికి రోజుల తరబడి ఎదురు చూడా ల్సిన సందర్భాలు అనేకం ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో రోగికి బెడ్, స్కానింగ్‌‌కు రెండు, మూడు రోజులు ఆగాల్సి వస్తోందని రోగులు చెబుతున్నారు. చాలా దూరం నుంచి వచ్చామనీ అడిగితే..చిరాకుపడుతున్నారని రోగుల సహాయకులు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల సిఫార్సు ఉన్న వారికి మాత్రం వెంటనే అన్ని రకాల సేవలు లభిస్తున్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక కొందరు రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.


ఎమర్జెన్సీలోనూ ఆలస్యమే..! ​
ఎమర్జెన్సీ వార్డులో రోగికి కనీస ప్రాథమిక చికిత్స కూడా అందే పరిస్థితుల్లేవని బాధితులు వాపోతున్నారు. గంటల తరబడి రోగులు ట్రాలీలపైనే నరకయాతన అనుభవిస్తూ నిరీక్షించాల్సి వస్తోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి సైతం సకాలంలో ఫస్ట్ ఎయిడ్, ఆక్సిజన్ అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో ఇక్కడ తరచూ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటోంది. దీంతో సహనం కోల్పోయిన రోగుల సహాయకులు, వైద్య సిబ్బంది భౌతిక దాడులు చేసుకునే పరిస్థితులకు దారి తీస్తోంది. ఇందుకు ఉదాహరణే ఇటీవల సాయంత్రం సమయంలో విధుల్లో ఉన్న రెసిడెంట్ డాక్టర్‌‌పై రోగి బంధువులు దుర్భాషలాడుతూ.. బెదిరింపులకు పాల్పడిన ఘటన. విధుల్లో ఉన్న జూనియర్ రెసిడెంట్ డాక్టర్ అదే సమయంలో మరో అత్యవసర కేసుకు అటెండ్ కావాల్సి రావడంతో జాప్యం నెలకొనడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్పత్రిలో విభాగాల మధ్య సమన్వయ లోపం, వైద్య సిబ్బంది బాధ్యతారాహిత్యం, సీనియర్ వైద్యుల అజమాయిషీ కొరవడం వల్లే తరచూ ఘర్షణ వాతావరణం నెలకొంటుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


​నిజాలు చెప్పడంలోనూ వెనుకడుగు​

నిమ్స్ ఆస్పత్రిలో సిబ్బంది, రోగులు, సహాయకుల అవసరాలకు అనుగుణంగా ఆహార క్యాంటీన్, వాహనాల పార్కింగ్, మెడికల్ దుకాణాలకు అనుమతులు ఇచ్చారు. అనుమతులు పొందిన గుత్తేదారులు గడువు సమయం, ఆస్పత్రి యాజమాన్యం నిర్ణయించిన ధరల వివరాలు, గడిచిన రెండేండ్లలో ఆస్పత్రికి చెల్లింపుల (ఆదాయం) సమాచారం ఇవ్వాలని సమాచారం హక్కు చట్టం ప్రకారం గతేడాది డిసెంబర్‌ 27వ తేదీన దరఖాస్తు చేయగా నేటికీ సమాచారం రాలేదు. ఆస్పత్రికి క్యాంటీన్ నుంచి ఎంత ఆదాయం వస్తుందనే సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచాల్సి వస్తుండటంతో.. వివిధ స్థాయిల్లో పని చేస్తున్న అధికారులకు మామూళ్ల రూపంలో ఏటా రూ.కోట్లు చేతులు మారుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచార హక్కు చట్టం ప్రకారం అధికారిక సమాచారం కోసం దరఖాస్తు చేయగా.. నెల రోజుల్లో ఇవ్వాల్సిన సమాచారం 10 నెలలు కావస్తున్నా నేటికీ రాలేదు. ‘మీ లేఖ అందింది.. సంబంధిత విభాగానికి పంపించాం, సమాధానం రాగానే పంపిస్తాం’ అంటూ ఇప్పటి వరకు ఐదుసార్లు లేఖలు పంపించారు తప్పితే అడిగిన సమాచారం మాత్రం స్సష్టంగా ఇవ్వడం లేదు. అంతా సవ్యంగా ఉంటే నిజాలు చెప్పడంలో ‘నిమ్స్‌’ ఎందుకు వెనుకడుగు వేస్తోందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్