Magazines

ఓయ్...

6 రోజుల క్రితం

ఆమె నాతో గొడవ పడటం చాలా అరుదు. పడినా ఎక్కువసేపు నిలవదు.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 20, 2026 | 4 నిమిషాల చదవడం

ఆమె నాతో గొడవ పడటం చాలా అరుదు. పడినా ఎక్కువసేపు నిలవదు. ఎందుకంటే మేమిద్దరం కోపంగా ఉండటం కంటే మాట్లాడకుండా ఉండటం ఇంకా కష్టం. అయితే.. అది అంత పెద్ద గొడవ అవుతుందని నాకు తెలియదు. ఆ రోజు ఆమె కవితా పఠనం. చిన్న కార్యక్రమమే. ఒక కేఫ్‌లో ఇరవై, ముప్పై మందితో కవి సమ్మేళనం. కానీ ఆమెకు మాత్రం అది చాలా పెద్ద విషయం. మూడు రోజులుగా దాని గురించే మాట్లాడుతోంది. “నువ్వు వస్తావు కదా?” అమె అలా అడగడం అప్పటికి మూడోసారి. “వస్తాను.” ‘‘మిస్ చేయొద్దు.’’ “నువ్వు స్టేజ్‌ మీదికి వెళ్లే ముందు మొదటి వరుసలో నేనే ఉంటాను.” “నాకు అదే కావాలి.” ఆ రోజు సాయంత్రం నేను వెళ్లాల్సిందే. కానీ మధ్యాహ్నం ఒక స్నేహితుడికి అనుకోకుండా సమస్య వచ్చింది. అతన్ని ఆ పరిస్థితిలో ఒంటరిగా వదిలి రావడం సాధ్యం కాలేదు. మధ్యలో ఆమెకు ఫోన్‌ చేయాలనిపించింది. అప్పటికే నా ఫోన్‌ బ్యాటరీ అయిపోయింది. ఫోన్‌ ఆఫయ్యే ముందు ఆమె నుంచి వచ్చిన చివరి మెసేజ్‌ మాత్రం గుర్తుంది. “ఎక్కడున్నావ్?” దానికి సమాధానం ఇవ్వలేకపోయాను. ఆ తర్వాత సమయం ఎలా గడిచిపోయిందో తెలియదు. బయటపడగానే కార్లో ఫోన్‌ చార్జింగ్‌ పెట్టి ఆన్‌ చేశాను. పదకొండు మిస్డ్‌ కాల్స్‌. అన్నీ ఆమెవే. వెంటనే బయలుదేరాను. వచ్చేసరికి కేఫ్‌ దాదాపు ఖాళీ అయిపోయింది. లోపల కుర్చీలు సర్దుతున్నారు. వేదిక మీద మైక్‌ తీసి పక్కకు పెట్టారు. ఆమె కనిపించలేదు. బయటికి వచ్చాను. ఫుట్‌పాత్‌ మీద ఒంటరిగా నిలబడి ఉంది. చేతిలో ఆ రోజు చదివిన కవితల పేపర్లు. నన్ను చూసింది. ఏమీ అనలేదు. నేనే దగ్గరికి వెళ్లాను. “సారీ.” ఆమె నెమ్మదిగా నవ్వింది. “ఎందుకు?” “ఒక స్నేహితుడికి సమస్య వచ్చింది. అతన్ని వదిలి రాలేకపోయాను.” ఆమె కాసేపు నన్నే చూసింది. “ఎన్ని సార్లు ఫోన్‌ చేశానో తెలుసా?” “ఫోన్‌ ఆఫ్‌ అయిపోయింది.” “నీది?” “అవును.” “నాది కాదు కదా.” నేను మౌనంగా ఉన్నాను. “ఒక్క మెసేజ్‌ కూడా పంపలేకపోయావా?” ఆ ఒక్క మాటలో నాలుగు గంటల ఎదురుచూపు ఉంది.
“నేను నిజంగా రావాలనే అనుకున్నాను. కానీ..” “నువ్వు రావాలని అనుకున్నావు.. నేను మాత్రం నువ్వు వస్తావని ఎదురు చూశాను.” నేను ఏమీ చెప్పలేకపోయాను. “మొదటి వరుసలో ఒక కుర్చీ ఖాళీగా పెట్టుకున్నాను.” నేను ఏమీ అనలేదు. “అందరూ వచ్చారు. ఆ కుర్చీ మాత్రం ఖాళీగానే ఉంది.” ఆమె గొంతు ఒక్కసారిగా వణికింది. “నేను చదవడానికి లేచినప్పుడు ఒక్కసారి దాని వైపు చూశాను.. అప్పుడు అనిపించింది.” ‘‘ఏమని’’ “నువ్వు రాకపోవడం కంటే..” ఆమె కళ్లలో నీళ్లు చేరాయి. “నువ్వు వస్తావని నమ్మడం ఎక్కువ బాధేసింది.” “సారీ.” ఆమె తల అడ్డంగా ఊపింది. “ఇప్పుడే చెప్పకు.” “ఎందుకు?” “ఇప్పుడది వింటే మళ్లీ ఏడుస్తాను.” అంతే.. ఆ మాట చెప్పి వేగంగా వెళ్లిపోయింది. కానీ ఆ బాధ మాత్రం నన్ను వదల్లేదు. ఆ రాత్రి ఇంటికి వెళ్లే దారంతా అదే ఆలోచన. నేను రాలేకపోయిన నాలుగు గంటల గురించి కాదు. ఆ నాలుగు గంటల్లో ఆమె నా కోసం చూసిన క్షణాల గురించి. ఆ రాత్రి నేను ఎన్నిసార్లు ఫోన్‌ తీసుకున్నానో నాకు గుర్తులేదు. “ఇంకోసారి ఇలా జరగదు.” మెసేజ్ టైప్ చేశాను. డిలీట్ చేశాను. “నన్ను క్షమించు” మళ్లీ టైప్‌ చేశాను. అదీ పంపలేదు. ఆ రెండు మాటలు ఆ నాలుగు గంటల బాధకు చాలా చిన్నవిగా అనిపించాయి. మరుసటి రోజు ఆమె నుంచి ఏమీ రాలేదు. రెండో రోజు.. మూడో రోజు కూడా. నాలుగో రోజు సాయంత్రం మాత్రం ఆగలేకపోయాను. ఆమె డాన్స్‌ ప్రాక్టీస్‌ చేసే స్టూడియోకు వెళ్లాను.
క్లాస్‌ అప్పుడే అయిపోయింది. లోపలికి వెళ్లేసరికి పెద్ద అద్దం ముందు ఆమె ఒంటరిగా నేలపై కూర్చుని వుంది. నన్ను అద్దంలో చూసింది. తర్వాత లేచి నేరుగా నావైపు తిరిగింది. ఆమె ముఖంలో ఆశ్చర్యం లేదు. “ఎందుకు వచ్చావు?” అంది. “నిన్ను కలవడానికి.” “నాలుగు రోజుల తర్వాత గుర్తొచ్చిందా?” “నువ్వు కొంచెం సమయం కావాలనుకున్నావనుకున్నాను.” “నాకు సమయం కాదు రామ్‌.. నువ్వు కావాలి.” “అందుకే వచ్చాను.” “వచ్చావు.. ఎందుకంటే ఇప్పుడు నీకు నేను కావాలి” “అవును.” “ఆ రోజు నాకు నువ్వు కావాల్సినప్పుడు?” నేను తలదించుకున్నాను. ఆమె తిరిగి అద్దం ముందు నిలబడింది. ఆమె అద్దంలో నా ప్రతిబింబాన్ని చూసింది. “నువ్వు ఉన్నా లేకపోయినా నా జీవితం ఆగదు. గుర్తుంచుకో.” ఆ మాట నాలో ఎక్కడో గట్టిగా తగిలింది. ఆమె జీవితంలో నేను ఒక అవసరం కాదు.. ఒక అలవాటు మాత్రమేనేమో అనిపించింది. కొద్దిసేపు అక్కడే నిలబడ్డాను. ఆమె మాత్రం నా వైపు చూడలేదు. “సరే.. వెళ్తాను.” అన్నాను ఆమె అద్దంలోనే నన్ను చూసింది. ఏదో చెప్పబోయినట్టుగా పెదవులు కదిలాయి. కానీ మాట బయటికి రాలేదు. నేను బయటికి నడిచాను. మెట్ల దగ్గరికి వచ్చాను. ఒక మెట్టు దిగాను. రెండో మెట్టు.. ఆమె పిలుస్తుందని అనిపించింది. పిలవలేదు. మరో మెట్టు దిగాను. అప్పుడు... “రామ్‌..” నేను ఆగలేదు. “రామ్‌.. ఆగు.” ఈసారి కూడా నా అడుగు ఆగలేదు. “ఓయ్‌..” నా అడుగు ఆగిపోయింది. తిరిగి చూశాను. ఆమె మెట్ల పైభాగంలో నిలబడి ఉంది. కళ్లలో నీళ్లు. “అలా వెళ్లిపోకు” అంది. నేనేమీ మాట్లాడలేదు. ఆమె మెట్లు దిగి నా దగ్గరికి వచ్చింది. “ఆ మాట నేను కోపంలో అన్నాను” “కానీ నాకు నిజంగానే అనిపించింది” ఆమె కాసేపు నన్నే చూసింది. “నువ్వు లేకపోతే నా జీవితం ఆగదు రామ్‌.. కానీ ఆ జీవితం బాగుండదు.” ఆమె కళ్లలోంచి నీళ్లు జారాయి. నేను ఏమీ అనలేదు. కన్నీళ్లు తుడుచుని నా చేతిని పట్టుకుంది. “ఇకపై వెళ్లిపోవాలనిపిస్తే.. ముందు నాకు చెప్పు” “ఎందుకు?” “నేను ఆపుతాను.” “ఎలా?” “ఓయ్‌ అని” అంటూనే ఒక్కసారిగా నన్ను కౌగిలించుకుంది. ఆ రోజు నుంచి ఆమెకు నా పేరు రామ్‌ కాదు. “ఓయ్‌.”

రామ్‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్