రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జ్ఞానేష్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారిగా తీసుకున్న నిర్ణయాలు గతంలో ఎన్నోమార్లు వివాదాలకు కారణమయ్యాయి. ఏకంగా పార్లమెంటులోనే ఆయనకు వ్యతిరేకంగా ఏప్రిల్ 2026లో అభిశం సన తీర్మానం తీసుకురాబడింది. అధికార బీజేపీ ఆయనకు గట్టిగా అండగా నిలవడంతో ఆ తీర్మానం నుంచి గట్టెక్కి పదవిలో కొనసాగారు. తాజాగా పత్రికల్లో వచ్చిన పరిశోధనాత్మక కథనాలు మరోమారు ఆయన్ను ప్రజల ముందు నిలబెట్టాయి. ముఖ్యంగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 23 సంచికలో ప్రచురించిన పరిశోధనాత్మక కథనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రతిపక్షాలు మరోమారు అభిశంసన తీర్మానానికి సిద్ధమవుతుండగా, జ్ఞానేష్ కుమార్ పదవి నుంచి వైదొలగకపోతే జంతర్ మంతర్ రెండో దశ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరించింది.
కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు కమిషనర్ల ఆధ్వర్యంలో పనిచేసే రాజ్యాంగ సంస్థ. దాని నిర్ణయాలు ముగ్గురి సమ్మతితో లేదా మెజార్టీ నిర్ణయంతోనే జరగాలి. అయితే వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. మిగతా ఇద్దరు కమిషనర్లను పక్కనపెట్టి జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.
పది నెలల వ్యవధిలో 14 సందర్భాల్లో మిగతా ఇద్దరు కమిషనర్లు అసమ్మతి వ్యక్తం చేసినప్పటికీ నిర్ణయాలు అమలయ్యాయని వెల్లడైంది. ఎన్నికల సంఘం నిర్ణయాలను తాము కింది అధికారుల ద్వారా లేదా పత్రికల ద్వారా తెలుసుకోవాల్సి వచ్చిందని, ఆ నిర్ణయాల్లో తాము భాగస్వాములు కాదని ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి రాతపూర్వకంగా వెల్లడించారు. ఈ వ్యవహారంలో అత్యంత వివాదాస్పద అంశాల్లో ఒకటి కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం-6లో చేసిన మార్పులు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఫారం-6లో మార్పులు చేయాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు దాన్ని వ్యతిరేకించారు. ఓటర్ల నమోదు నియమావళి-1960 ప్రకారం ఫారం-6లో మార్పులు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని, న్యాయ నిపుణులతో సంప్రదింపుల అనంతరం మాత్రమే అలాంటి మార్పులు చేయవచ్చని వారి అభ్యంతరం. అయినప్పటికీ ఆ ప్రతిపాదన అమలులోకి వచ్చింది. సవరణలో భాగంగా.. ‘‘మీ తల్లిదండ్రులు లేదా తాత, అమ్మమ్మలు గత ఎస్‌ఐఆర్ తర్వాత వచ్చిన ఓటర్ల జాబితాలో నమోదై ఉన్నారా?’’ అనే ప్రశ్నను ఫారం-6లో చేర్చారు. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ఐచ్చికమని ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పేర్కొన్నప్పటికీ, ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్‌లో మాత్రం సమాధానం ఇవ్వకుండా ముందుకు వెళ్లలేని విధంగా రూపొందిం చారనే ఆరోపణలు వచ్చాయి. కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునేవారితో పాటు, ఎస్‌ఐఆర్‌లో వివిధ కారణాలతో ఓటు కోల్పోయినవారు తిరిగి నమోదు కావడానికి కూడా ఫారం-6 సమర్పించాల్సి రావడంతో ఈ మార్పు పెద్దఎత్తున ఓటర్ల తొలగింపుకు దారితీసింది.
ఇద్దరు ఎన్నికల అధికారులు క్యాబినెట్ కార్యదర్శి టీ.వీ. సోమనాథన్‌ను కలిసి ఈ మార్పులు చట్టవిరుద్ధమని ఫిర్యాదు చేసినప్పటికీ ప్రక్రియ కొనసాగింది. ఈ నిర్ణయాలన్నీ కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా, వారికి రాజకీయ ప్రయోజనం చేకూర్చే విధంగా జరిగాయని ప్రతిపక్షాల విమర్శలు. ఎన్నికల సంఘం సాఫ్ట్‌వేర్‌లో జరిగిన మార్పులు కూడా తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. రాజ్యాంగపరంగా ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చడం, తొలగించడం వంటి అధికారాలు స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారుల (ఈఆర్‌ఓ) పరిధిలో ఉంటాయి. సాధారణంగా రెవెన్యూ డివిజనల్ అధికారులు ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. అయితే కొత్త మార్పుల ద్వారా స్థానిక ఈఆర్‌ఓలకు స్వతంత్రంగా ఓటర్లను నమోదు చేసే అవకాశం లేకుండా, ఢిల్లీలోని ఐటీ విభాగం ఉన్నతాధికారుల చేతుల్లో కీలక అధికారాలు కేంద్రీకృత మయ్యేలా మార్పులు చేసినట్టు తెలుస్తోంది. అంటే ఓటర్లుగా ఎవరు ఉండాలో స్థానిక అధికారులు కాకుండా ఢిల్లీలోని అధికారులు నిర్ణయించే పరిస్థితి ఏర్పడింది. బెంగాల్ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో తొలగించిన లక్షలాది ఓట్లలో ఆధారాలు ఉన్నవారిని తిరిగి ఓటర్లుగా నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ ఎన్నికల సంఘం తరఫున 16 లక్షల పిటిషన్లు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. అయితే ఈ అప్పీల్లు ఎవరి ఆదేశాలతో దాఖలయ్యాయి, ఎన్నికల సంఘంలో వారికి ఎవరు అధికారం ఇచ్చారనే విషయం తమకు తెలియదని ఇద్దరు ఎన్నికల కమిషనర్లు రాతపూర్వకంగా వెల్లడించడం మరింత అనుమానాలకు తావిచ్చింది.
ఈ వివరాలు బయటకు వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం ఒక ఖండన ప్రకటన విడుదల చేసింది. మూడు రోజుల అనంతరం ముగ్గురు కమిషనర్లు సమావేశమై మరో ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే పరిశోధనలో వెల్లడైన ప్రధాన ఆరోపణలను వారు స్పష్టంగా ఖండించలేదు. ముగ్గురు కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు సహజమేనని మాత్రమే పేర్కొన్నారు. దీంతో ఏకపక్ష నిర్ణయాలపై వచ్చిన ఆరోపణలకు పూర్తి సమాధానం లభించలేదు. గతంలో ఎన్నికల కమిషనర్లుగా పనిచేసిన ఖురైషీ, రావత్, లావాసా వంటి నిపుణులు కూడా ఈ పరిణామాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇవన్నీ కలిపి చూస్తే.. ఓటర్లు తమకు నచ్చిన నాయకులను ఎన్నుకోవాల్సిన ప్రజాస్వామ్య వ్యవస్థలో, నాయకులే తమకు అనుకూలమైన ఓటర్లను ఎంపిక చేసుకునే పరిస్థితి ఏర్పడుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఓట్లు గల్లంతయ్యాయి. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు రాజకీయ ప్రయోజ నాలకు అనుగుణంగా వ్యవహరించడమే ఈ పరిస్థితికి కారణం. జ్ఞానేష్ కుమార్‌ను తక్షణం పదవి నుంచి తొలగించాలని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆయన ఏకపక్ష నిర్ణయాల వెనుక ఉన్న రాజకీయ శక్తులను దేశానికి వెల్లడించాలని, ఎన్నికల సంఘంలో సమూల ప్రక్షాళన చేపట్టాలని కోరు తున్నాయి.
ఎన్నికల సంఘం నుంచి వచ్చిన రెండు ప్రకటనలు కూడా ప్రజల్లో నెలకొన్న అనుమానాలను పూర్తిగా నివృత్తి చేయలేదు. ఎన్నికల సంఘంలో జరిగిన పరిణామాలు కేవలం అంతర్గత భిన్నాభిప్రాయాలుగా కాకుండా, రాజ్యాంగ వ్యవస్థను బలహీనపరిచే చర్యలుగా మారాయి.ఇది ప్రజాస్వామ్య హననానికి దారితీసే ప్రమాదకర పరిణామం. ఎన్నికల సంఘం స్వతంత్రత, పారదర్శకతపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపైనే ఉంది. ఓటర్ల జాబితా నుంచి నిర్ణయాల ప్రక్రియ వరకు ప్రతి అంశంపైనా సమగ్రంగా స్పష్టత ఇవ్వాలి. రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను కాపాడటం కోసం ఏకపక్ష నిర్ణయాలపై నిష్పక్షపాత దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ప్రజల ఓటు హక్కును కాపాడటమే ప్రజాస్వామ్యానికి అసలైన రక్షణగా నిలుస్తుంది.
ఆర్. రాజేశమ్, 9440443183
ఎన్నికల సంఘంలో ఏం జరుగుతోంది..?
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 4 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)