Magazines

ఢిల్లీలో మహిళలకు భద్రత ఎక్కడ?

1 గంట క్రితం

Where is the safety for women in Delhi?
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 2 నిమిషాల చదవడం

నిర్భయ ఘటనతో పోలికలు ఉన్నాయన్న సుప్రీంకోర్టు

రెండు వారాల్లో మైనర్లపై నాలుగు లైంగికదాడి ఘటనలు

సానుభూతి కాదు.. స్పష్టమైన చర్యలు కావాలని స్పష్టీకరణ
పార్కులు, బస్సులు ప్రమాదకర ప్రాంతాలుగా మారకూడదని హెచ్చరిక
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మహిళలు, బాలికల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. వరుస లైంగికదాడి ఘటనలను సుమోటోగా గమనించిన సుప్రీంకోర్టు.. 2012 నాటి నిర్భయ ఘటనతో తాజా పరిస్థితులకు బాధాకరమైన పోలికలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీసు వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత రెండు వారాల్లో మైనర్లపై నాలుగు లైంగికదాడి ఘటనలు చోటుచేసుకోవడాన్ని ప్రస్తావించిన కోర్టు.. ప్రజలు స్వేచ్ఛగా, భయంలేకుండా జీవించే హక్కు ప్రాథమిక హక్కుల్లో భాగమని గుర్తుచేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దీవాలా నేతృత్వంలోని ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నించింది. పార్కులు, బస్సులు వంటి బహిరంగ ప్రదేశాలు సరైన వెలుతురు, నిఘా, ఇతర మౌలిక సదుపాయాల కొరతతో ప్రమాదకర ప్రాంతాలుగా మారకూడదని స్పష్టం చేసింది. ఇటువంటి ఘటనలు చట్ట అమలులో వైఫల్యాన్ని స్పష్టంగా చూపుతున్నాయని వివరించింది. 2012లో దేశాన్ని కుదిపేసిన నిర్భయ ఘటనను తాజా పరిస్థితులు గుర్తుకు తెస్తున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే సర్వోన్నత న్యాయస్థానం ప్రధానంగా ఒక కీలక ప్రశ్నను ముందుకు తెచ్చింది. ఘటన జరిగిన తర్వాత ఆందోళన వ్యక్తం చేయడం, బాధితులకు సంఘీభావం ప్రకటించడం మాత్రమే సరిపోదని వివరించింది. ‘సానుభూతి పరిష్కారం కాదు.. స్పష్టమైన చర్యలు అవసరం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. అంటే భద్రతా చర్యలు కాగితాలపై కాకుండా ప్రజలకు వాస్తవంగా కనిపించేలా ఉండాలని కోర్టు సూచించింది. ఢిల్లీలో చోటు చేసుకున్న తాజా ఘటనల్లో సెప్టెంబర్ 10న 17 ఏండ్ల బాలికపై సామూహిక లైంగికదాడి చేసిన దుండగులు హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 14న ఆరేండ్ల బాలికపై లైంగికదాడి జరిగింది. సెప్టెంబర్ 17న 11 ఏండ్ల బాలికపై సదర్‌బజార్‌లో దారుణం చోటు చేసుకుంది. సెప్టెంబర్ 21న కల్కాజీ సమీపంలోని ఆస్తా కుంజ్ పార్కులో పోలీసులమని చెప్పుకున్న ముగ్గురు వ్యక్తులు 17 ఏండ్ల బాలికపై సామూహిక లైంగికదాడికి తెగబడినట్టు కేసు నమోదైంది. ఈ కేసుల్లో నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనల నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నగరంలోని అన్ని పార్కుల్లో భద్రతా ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. వెలుతురు, భద్రత, పోలీసు గస్తీ, పరిశుభ్రత వంటి అంశాలను పరిశీలించాలని సూచించారు. పార్కుల చుట్టూ పింక్ పోలీసు సిబ్బందిని మోహరించ నున్నట్టు కూడా తెలిపారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు అని ప్రకటనలు చేసే బీజేపీ.. ఢిల్లీలో అధికారంలో ఉండి మహిళలకు కనీస భద్రతనూ కల్పించలేకపోతోంది. ఢిల్లీ వంటి దేశ రాజధాని లోనే బాలికలు, మహిళలు బస్సుల్లో, పార్కుల్లో సురక్షితంగా ఉండలేని పరిస్థితి ఏర్పడ టంతో పాలనలోని భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తు తున్నాయి. మహిళా భద్రతపై ప్రకటనలు, హామీ లకు మించి పోలీసు గస్తీ, వీధి దీపాలు, సీసీటీవీ నిఘా, వేగవంతమైన స్పందన, బాధితు లకు రక్షణ వంటి చర్యలు ఎంత సమర్థంగా పనిచే స్తున్నాయో ప్రజలకు స్పష్టంగా తెలి యాల్సిన అవసరం ఉందని మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్