Magazines

జనాగ్రహ జ్వాలలు

2 గంటల క్రితం

Flames of Public Outrage
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 3 నిమిషాల చదవడం

దేశ రాజకీయాలు సంపూర్ణంగా మారిపోతున్నాయి. ఎన్నికలలో అక్రమాలకు, ఓటర్ల జాబితాను బీజేపీ విజయానికి అనుకూలంగా రూపొందించిన ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం జులై 20న జంతర్ మంతర్‌లో ప్రారంభమైన ఉద్యమం ఇప్పుడు మరింత విస్తృతమైంది. ఈ మార్పు క్రమంగా మోడీ సర్కారు మెడకు చుట్టుకుంటోంది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన బ్రహ్మాం డమైన నిరసన ప్రదర్శనల్లో వామపక్ష పార్టీలో, కాక్రోచ్ జనతా పార్టీనో, ఇతర ప్రతిపక్షాలో మాత్రమే కాకుండా రైతులు, విద్యార్థులు, యువత, కార్మికులు, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ఉద్యమం గతంలో జరిగిన రైతు ఉద్యమానికన్నా విస్తృతమైందని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఉద్యమానికి దిగిన వారి మీద కేంద్ర ప్రభుత్వ పోలీసులు, ఇతర భద్రతా దళాల వారు కొనసాగించిన దాష్టీకాన్ని గమనించిన రైతులు తామే స్వయంగా రంగంలోకి దిగారు. ఈ ఉద్యమం రానురాను సకల వర్గాలనూ ఏకం చేస్తోంది. ఇప్పుడు వారందరిది ఒకటే మాట...‘‘దేశం కోసం ఈ పోరాటం’’.

‘‘ప్రతి చేతిలో త్రివర్ణ పతాకం, ప్రతి గల్లీ జంతర్ మంతరే’’ అన్న నినాదంతో తాజా ఉద్యమం సాగింది. ఈ ఉద్యమంలో రైతులే కాక మహిళలు, దళితులు, వెనుకబడిన తరగతులకు ప్రాతినిధ్యం వహించే ప్రతి ఒక్కరు ‘‘మేము సైతం..’’ అంటూ కదిలివచ్చారు. షరా మామూలుగా కేంద్ర ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించి సాయుధ బలగాలను రంగంలోకి దింపింది. సెంట్రల్ ఢిల్లీ మొత్తం రాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో నిండి పోయింది. అయినా, ‘‘నదీనదాలు,/అడవులు, కొండలు /ఎడారులా మనకడ్డంకి?’’ అంటూ ‘‘త్రాచులవలెనూ రేచులవలెనూ ధనుంజయునిలా’’ కదులుతున్న వారిని కట్టడి చేయడం ఎలా సాధ్యం? అడ్డంకులను అధిగమించి, బారికేడ్లను బద్దలుకొట్టి జనం వీధుల్లో ప్రదర్శనలు చేశారు. భద్రతా దళాలు ఎక్కడ అడ్డగిస్తే అక్కడే వారు ‘‘ప్రజా పార్లమెంటు” నిర్వహిస్తున్నారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ మొదలైన ఉద్యమం ఇప్పుడు ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణ మహోద్యమంగా మారిపోయింది. నిరసన స్థలంగా జంతర్ మంతర్ తొలగిస్తే ప్రతీ వీధిని జంతర్ మంతర్ చేయాలన్న సంకల్పం నిరసనకారుల్లో ప్రస్ఫుటంగా వ్యక్తం అయింది. నవంబర్ ఒకటిన మరింత పెద్ద ఉద్యమం నిర్వహించాలని సంకల్పించారు.

ఇన్నాళ్లుగా నరేంద్ర మోడీ నేతృత్వంలోని నిరంకుశ సర్కారు సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను అక్రమంగా ఉపయోగిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తూ, ప్రతిపక్షాలను చీల్చి తన స్వార్థ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అలవాటుపడింది. కానీ, నేడు అదే మోడీ సర్కారు ప్రజాగ్రహ జ్వాలలను చూసి తీవ్ర భయాందోళనలకు గురవుతోంది. వీధుల్లో వెల్లువెత్తుతున్న చైతన్యవంతమైన శ్రామిక, పీడిత వర్గాల ప్రజా ఉద్యమం సంధిస్తున్న పదునైన ప్రశ్నలు నేరుగా ప్రధానమంత్రి పీఠాన్ని కంపింపజేస్తున్నాయి.

దేశంలో ఆర్థిక సంక్షోభంతో ప్రజలు అల్లాడుతుంటే, మోడీ ప్రభుత్వం స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ), ముద్ర పథకం, పేదరిక నిర్మూలనపై దొంగలెక్కలతో జనాన్ని మభ్యపెడుతోంది. నిరుద్యోగం, ఆకలి పెరిగిపోతున్నా అబద్ధపు గణాంకాలతో బుకాయిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ వంటి అమెరికన్ సామ్రాజ్యవాద శక్తుల ఎదుట మోకాళ్లూని లొంగిపోయిన మోడీ విదేశాంగ నీతి దేశానికి తలవంపులు తెస్తుంటే, ప్రపంచంలో మన ప్రతిష్ట పెరిగిందని పచ్చి అబద్ధాలు చెప్తోంది. ‘మేక్ ఇన్ ఇండియా’ఆర్భాటాలు కార్పొరేట్లకు లాభాలు పంచడానికే తప్ప, ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూర్చలేదని స్పష్టమవుతోంది.

అయితే, ఈ మహా ప్రజాందోళన అభ్యుదయ శక్తులకు నూతనోత్తేజాన్ని ఇచ్చింది. దేశంలోని యువతలోను, శ్రామిక వర్గాలలోను విప్లవాత్మక చైతన్యాన్ని రగిలించింది. ఒకప్పుడు ఉద్యమాల్లో పాల్గొని పౌర సమాజంలో మౌనంగా ఉండిపోయిన శక్తులను సైతం ఇది మళ్లీ జాగృతం చేసింది. భారత సమగ్రత, ప్రజాస్వామ్య వ్యవస్థలు కార్పొరేట్ -సామ్రాజ్యవాద శక్తుల చేతిలో బానిసగా మారిపోతున్నాయనే నిజాన్ని దేశవాసులు గ్రహిస్తున్నారు. అన్నింటికన్నా మించి, మోడీ ప్రభుత్వ అహంకార, ప్రజావ్యతిరేక ధోరణిని సహించే స్థితి నుండి దేశ ప్రజానీకం బయటపడడం నేర్చుకుంది. నేడు ఢిల్లీ వీధుల్లో దద్దరిల్లుతున్న ఐక్య శ్రామిక-ప్రజాతంత్ర ఉద్యమాలే అందకు సజీవ సాక్ష్యం.


ఎ.మోహన్‌ కృష్ణ

8897765417

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్