అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ఖమ్మం జిల్లాలో రెండో విడత ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ
నవతెలంగాణ-నేలకొండపల్లి
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫైనల్ బిల్లులన్నింటినీ రాబోయే 10 రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో ఎలాంటి లంచాలకు తావులేకుండా జమ చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రైతు వేదికలో మండలానికి చెందిన లబ్ధిదారులకు రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని అనాసాగరం నుంచి పమ్మి వరకు 2.5 కిలోమీటర్ల మేర రూ.2.80 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేయగా, రెండో విడతలో 2.5 లక్షల ఇండ్లు ఇస్తున్నామని తెలిపారు. అలాగే, హైదరాబాద్ నగరానికి అదనంగా లక్ష ఇండ్లు మంజూరు చేసి మొత్తం 8 లక్షల ఇండ్లను పేదలకు అందిస్తున్నామని తెలిపారు. మండలంలో మొదటి విడత కింద మంజూరైన 648 ఇండ్లలో సుమారు 620 ఇండ్లు పూర్తయ్యాయని, వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న మిగిలిన ఇండ్లను కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే అభివృద్ధిని జోడెడ్ల మాదిరిగా సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. రైతాంగానికి భరోసా కల్పిస్తూ, మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు రూ.72 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలు అందించామని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని విద్యుత్, నీటి సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో రెండో పంట వేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, పీఆర్ ఎస్ఈ వెంకట్‌రెడ్డి, ఖమ్మం ఆర్డీవో ఎన్.శ్రీనివాస్, నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ వెన్నపూసల సీతారాములు, ఎంపీడీవో ఎర్రయ్య, తహసీల్దార్ రాంప్రసాద్, స్థానిక సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)