క్వింటాకు రూ.1000 వరకు తగ్గింపు ఆగ్రహించిన రైతులు
తిరుమలగిరి ప్రధాన రహదారిపై బైటాయింపు..రాస్తారాకో
వ్యాపారులకు వ్యతిరేకంగా నినాదాలు
నవతెలంగాణ- తిరుమలగిరి
రాత్రికి రాత్రే ధాన్యం ధర పడిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు క్వింటాలుకు రూ. 3,600 పలికిన ధర... సోమవారం రూ. 2,500 కు తగ్గించి కొనుగోలు చేయడంతో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ ముందు ప్రధాన రహదారిపై బైటాయించి రాస్తారోకో చేపట్టారు. వ్యాపారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కష్టపడి పండించిన పంటను మార్కెట్‌కు తెస్తే వ్యాపారులు సిండికేట్‌గా మారి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. రాత్రికి రాత్రే ధర తగ్గించి తమ పొట్ట కొడుతున్నారని వాపోయారు. పెరిగిన పెట్టుబడి ఖర్చులకు అనుగుణంగా ధాన్యానికి క్వింటాకు రూ. 4,000 మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధర ప్రకారమే కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరారు. రైతుల రాస్తారోకో సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపే ప్రయత్నం చేశారు. అయితే, జిల్లా ఉన్నతాధికారులు, మార్కెట్ కమిటీ అధికారులు వెంటనే స్పందించి గిట్టుబాటు ధర దక్కేలా స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తమ ఆందోళనను విరమించేది లేదని రైతులు తెగేసి చెప్పారు. రైతుల ఆందోళనపై రైతుసంఘం నాయకులు కడారి లింగయ్య మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు పండించిన వరి ధాన్యానికి క్వింటాకు రూ.3800 నుంచి రూ.3900 ఇవ్వాలన్నారు. వరి సీజన్ స్టార్ట్ అయి నేటికి నెలరోజులు కావొస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వం ఐకేపీ సెంటర్‌లో ధాన్యం కొనుగోలు చేయకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఐకేపీ సెంటర్‌లో రైతుల ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం మండల కార్యదర్శి కడారి లింగయ్య, చిత్తలూరి సోమయ్య, రైతులు నరసయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)