తెలంగాణలో పీఆర్సీ నివేదిక సమర్పణలో జరుగుతున్న అంతులేని జాప్యం ఉద్యోగులు, పెన్షనర్లలో ఆందోళన కలిగిస్తున్నది. ఆరునెలల్లో పూర్తి కావాల్సిన నివేదిక మూడేండ్లు కావస్తున్నా ప్రభుత్వానికి చేరకపోవడం కమిటీ పనితీరుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తున్నది. ఇప్పటికే వేతన సవరణ గడువు దాటిపోయినా, ఉద్యోగులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హామీలు అమలుకు నోచుకోకపోగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ అదే పరిస్థితి కొనసాగడం ఉద్యోగుల పట్ల పాలకుల నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తున్నది.
పీఆర్సీ (Pay Revision Commission) అంటే వేతన సవరణ సంఘం. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాలు, పెన్షనర్ల పింఛన్లు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను సమీక్షించి, వాటిని ఎంతమేరకు పెంచాలనే అంశంపై ప్రభు త్వానికి సిఫారసులు చేయడం దీని ప్రధాన ఉద్దేశం.
పెరుగుతున్న ధరలు, జీవన వ్యయానికి అనుగుణంగా ఉద్యోగుల ఆదాయాన్ని సవరించేందుకు ఈ కమిషన్ కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా ఐదేళ్లకోసారి జరగాల్సిన వేతన సవరణ ప్రక్రియ తెలంగాణలో తీవ్ర జాప్యానికి గురవుతున్నది. వేతన సవరణ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు, పెన్షనర్ల ఆశలు మాత్రం రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు శాతం మధ్యంతర భృతి ప్రకటించి, ఎన్నికల తర్వాత పీఆర్సీ నివేదిక వస్తుందని హామీ ఇచ్చింది. అయితే ఆ హామీ నెరవేరలేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యోగుల సమస్యను పరిష్కరించడంలో ఆశించిన వేగం ప్రదర్శించడం లేదు. ప్రభుత్వం మారినా పరిస్థితి మారకపోవడం గమనార్హం. ఉద్యోగుల సంక్షేమంపై హామీలివ్వడంలో చూపుతున్న శ్రద్ధను, వాటి అమలులోనూ ప్రభుత్వం చూపించాల్సిన అవసరం ఉంది. 2023 అక్టోబర్ 2న విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎన్. శివశంకర్‌ను చైర్మన్‌గా, బి. రామయ్యను సభ్యునిగా నియమించిన ప్రభుత్వం ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని గడువు విధించింది. 2024 ఏప్రిల్ నాటికి అందాల్సిన నివేదిక ఇప్పటికీ పెండింగ్ లోనే ఉంది.
ఇప్పటికే ఐదుసార్లు గడువు పొడిగించినా ఫలితం లేకపోవడం కమిటీ పనితీరుపై అనేక ప్రశ్నలను లేవనెత్తు తున్నది. సెప్టెంబర్ 20న నివేదిక సిద్ధమైం దని ప్రచారం జరిగినా, అది ప్రభుత్వానికి ఎందుకు చేరలేదన్నది స్పష్టత లేని అంశంగా మిగిలింది. 2026 మే 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివేదికను తక్షణమే అందించాలని ఆదేశించినట్లు సమాచారం. సెప్టెంబర్ 18న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా కమిటీకి లేఖ రాశారు. అయినా నివేదిక అందకపోవ డం ప్రభుత్వ ఆదేశాల అమలుపై సందేహాలను పెంచుతున్నది. ఆదేశాలు జారీ చేయడం మాత్రమే కాకుండా, వాటి అమలును పర్యవేక్షించి ఫలితాలు సాధించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశించినా నివేదిక జాప్యం వెనుక ఉన్న కారణాలను ప్రభుత్వం సమీక్షించాలి. కమిటీ జాప్యానికి బాధ్యులెవరో గుర్తించి, ఉద్యోగులకు సమాధానం చెప్పాలి.
ఎలాంటి సదుపాయాలు, సౌకర్యాలు లేని కాలంలో భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రెండేండ్ల 11 నెలల 18 రోజుల్లో రూపొందించారు.
అలాంటిది ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న ఈ కాలంలో ఉద్యోగుల వేతన సవరణ నివేదికకు ఇంత సమయం ఎందుకు పడుతున్నదన్నది పాలకులు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. పది లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్ల ప్రయోజనాలతో ముడిపడిన అంశాన్ని ఇంతకాలం సాగదీయడం చిన్న విషయం కాదు. ఉద్యోగుల శ్రమతోనే ప్రభుత్వ యంత్రాంగం నడుస్తున్నదన్న విషయాన్ని పాలకులు గుర్తించాలి. ఉద్యోగ సంఘాలు యాభై శాతం ఫిట్‌మెంట్‌ను డిమాండ్ చేస్తున్నా, కమిటీ సిఫారసులు ఏమిటన్నది బయటకు రావడం లేదు. ఉద్యోగుల జేఏసీ ప్రతిసారీ ఈ అంశాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నా, నివేదిక త్వరలోనే వస్తుందన్న హామీలకే పరిమితమ వుతున్నది. నివేదికలో ఏముందో, ఉద్యోగులకు ఎంతమేరకు ప్రయోజనం కలగనుందో తెలియక ఉద్యోగులు, పెన్షనర్లు అయోమయానికి గురవుతు న్నారు.
ఎన్నికల కోడ్, పాలనాపరమైన అంశాలను సాకులుగా చూపుతూ నివేదికను ఆలస్యం చేయడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.
‘రైజింగ్ తెలంగాణ’ నినాదంతో అభివృద్ధి గురించి మాట్లాడుతున్న ప్రభుత్వం, రాష్ట్ర పాలనలో కీలకమైన ఉద్యోగుల సమస్యను మాత్రం ఎందుకు పరిష్కరించడం లేదు? నివేదికను వెంటనే తెప్పించి, సిఫారసులను బహిర్గతం చేసి, ఫిట్‌మెంట్‌పై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలి. ఉద్యోగులు మరో ఎన్నికల వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి రాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. లేకపోతే గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ జాప్యానికీ తేడా లేదన్న విమర్శ మరింత బలపడుతుంది.
కె.వెంకటేశ్వర్లు, 9440854149







కామెంట్లు (0)