ఒకవైపు ఎల్‌నినో, వర్షాభావ ముప్పుతో కరువు పరిస్థితులు.. మరోవైపు అర్నబ్ తుఫానుతో భారీ వర్షాల ప్రమాదం! ప్రకృతి రెండు రకాల సవాళ్లను విసురుతున్న వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సూచనలు, హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఆదేశాలతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. కానీ, రెండు రకాల ముప్పులను ఎదుర్కొ నేందుకు క్షేత్రస్థాయిలో చేపడుతున్న చర్యలేవి? పంటలను కాపాడేందుకు, నష్టపోయే రైతులను ఆదుకునేందుకు నిధులెక్కడ? నీటిని పొదుపుగా వాడాలని, పంటల సాగులో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించే ప్రభుత్వాలు.. రైతు పెట్టుబడికి, కుటుంబ జీవనానికి భరోసా ఏదీ? సమస్య తీవ్రతను ప్రజలకు చెప్పి అవగాహన చేయించడంలోనూ నిర్లక్ష్యంగా ఉండటం సరైంది కాదు. ప్రజలకు ప్రమాదాలను వివరించడం ఎంత ముఖ్యమో, ఆపద సమయంలో తాము అండగా ఉన్నా మనే భరోసా కల్పించడం కూడా అంతే ముఖ్యం.
ఖరీఫ్ ప్రారంభం నుంచే వర్షా భావ పరిస్థితులు ఉంటాయని భారత వాతావరణశాఖ హెచ్చరికలు చేస్తూ వచ్చింది. పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. తాత్కాలికంగా కురిసే వర్షాలతో పెద్దగా ప్రయోజ నం ఉండదని శాస్త్రవేత్తలు సైతం హెచ్చరించారు.
అయినా కేంద్రం, రాష్ట్ర పాలకులు పెడచెవిన పెట్టారు.ఖరీఫ్ మధ్యలో కొద్దిరోజులు పడిన వర్షాలతో సంతోషించినా.. ఆ తర్వాత మళ్లీ వర్షాలు ముఖం చాటేశాయి. ఫలితంగా భూగర్భ జలాలు అడు గంటాయి. పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసిన రైతాంగం, పనుల్లేక కూలీలు, కార్మికులు, ఉపాధి కరువై నిరుద్యోగులు లబోదిబోమంటున్నారు. ఎల్‌నినో ప్రభావం ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. ఎల్‌నినోతో పాటు వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే హైదరాబాద్‌తో పాటు మరో ఆరు జిల్లాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. పందొమ్మిది జిల్లాల్లో ఐదు నుంచి పది మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయినట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. పదిహేను లక్షల పంపుసెట్లు ఎండినట్టు అంచనా లున్నాయి. 350కి పైగా మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయనేది రాష్ట్ర ప్రభు త్వం గుర్తించింది. దాదాపు రూ. 20 వేల కోట్ల రూపాయల నష్టం ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీనికి తోడు యాసంగిలో పంటల సాగు విస్తీర్ణం డెబ్భయి లక్షలకు పడిపోయింది. మరో వైపు ఇప్పటికే ఖరీఫ్‌లో సాగుచేసిన పంటలు నీరందక ఎండిపో తున్నాయి.
వ్యవసాయ రంగానికే కాదు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకూ తీవ్ర నష్టమే. ఇంతటి సంక్షోభంలోనూ పాలకులు సమీక్షలకే పరిమితమయ్యారు తప్ప క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యను గుర్తించ డానికి సిద్ధపడటం లేదు. ఏ ఒక్క మంత్రి పంట పొలాలను పరిశీలించిన దాఖలాలు లేవు. ఆదుకోవాలంటూ కేంద్రానికి లేఖలతో సరిపుచ్చింది.
ఇంత జరుగుతున్నా కేంద్రం చూస్తోంది తప్ప రాష్ట్ర రైతాంగాన్ని, ప్రజలను ఆదుకునేందుకు ఇప్పటివరకు ముందస్తుగా నిధులివ్వలేదు. గతంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల కేంద్రబృందం వచ్చి పర్యటించింది, నివేదికలు సమర్పించింది. అయినా రాష్ట్రానికి చిల్లిగవ్వ ఇవ్వలేదు. వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరిని ఆదుకుంటామని చెప్పి డబ్బులివ్వలేదు. ఈ సమయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అఖిలపక్షాన్ని పిలిచి ఢిల్లీకి తీసుకెళ్లాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపై ఉంది.
రైతులకు పంటల సాగుపై సూచనలు ఇవ్వడం మాత్రమే ప్రభుత్వాల బాధ్యత కాదు. తక్కువ నీటితో పండే పంటలు సాగు చేయాలని చెబితే, వాటికి అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలి. పంట మార్పిడితో ఎదురయ్యే అదనపు పెట్టుబడి భారాన్ని తగ్గించాలి.
సాగు చేయవద్దని సూచించే పరిస్థితి వస్తే రైతు కుటుంబానికి ప్రత్యామ్నాయ ఆదాయం ఎలా సమకూరుతుందో చెప్పాలి. తుఫాను వల్ల పంటలు దెబ్బతింటే నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించే వ్యవస్థ సిద్ధంగా ఉండాలి. ఇప్పటికే అప్పులు చేసి సాగు చేస్తున్న రైతుకు మరో నష్టం ఎదురైతే అతడి పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నలకు ప్రభుత్వాల నుంచి భరోసా రావాలి. అర్నబ్ తుఫానుపై కేంద్రం హెచ్చరికలు జారీ చేయడం, ప్రభావిత ప్రాంతాలను అప్రమత్తం చేయడం అవసరమే. అయితే అధికారిక సన్నద్ధత ప్రకటనలకు తోడు, ప్రజలకు అందే సహాయక చర్యలు ఎంత వేగంగా అమలవుతున్నాయన్నదే ముఖ్యం. అదే సమయంలో ఎల్‌నినో ముప్పును ఎదుర్కొనేం దుకు సాగునీటి నిర్వహణ, ప్రత్యామ్నాయ పంటలు, గ్రామీణ ఉపాధిపై దృష్టి పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలపై రాష్ట్రాలను అప్రమత్తం చేయడంతోపాటు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహకారం అందించాలి.పంటల బీమా క్లెయిముల పరిష్కారం, నష్టపరిహారం, అత్యవసర సహాయక చర్యలకు నిధుల లభ్యతపై స్పష్టత ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం సైతం తన పరిధిలో అందుబాటులో ఉన్న వనరులతో తక్షణ చర్యలు చేపట్టాలి. రెండు ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోతే చివరకు నష్టపోయేది రైతులు, వ్యవసాయ కూలీలు, సామాన్య ప్రజలే.





కామెంట్లు (0)