నా బౌద్ధ సోదర సోదరీ మణులారా!
మనిషికి ఆహారం మాత్రమే సరిపోదు. మనిషికి మనసు ఉంది. ఆ మనసుకు ఆలోచనలున్నాయి -
మతమనేది మనుషుల్లో ఆశలు రేకెత్తిస్తుంది. అలా చేయకపోతే, అది మతమే కాదు. హిందూ మతంలో జరిగిన అన్యాయమేమంటే- అది ఆత్యధికుల్ని అణగదొక్కడం జరిగింది. భవిషత్తుపై ఆశ లేకుండా వారిని నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయేట్లు చేసింది-
నేను, నా సహచరులతో కలిసి, ఆ మతాన్ని వదిలివేయడానికి ప్రధాన కారణం అదే!
బౌద్ధం- ఒక కాలానికి పరిమితమైంది కాదు. ఒకప్పుడు ఇది భారత దేశమంతా విస్తరించింది. అమోఘంగా వర్థిల్లింది. విదేశాల్లో కూడా విస్తృతంగా వ్యాపించింది. ఆ బౌద్ధమే మళ్లీ ఇప్పుడు పునరుజ్జీవనం పొందాల్సి ఉంది.
కేవలం ఆహారం దొరికితే చాలు అనుకునే మానవ సమాజాలలో ప్రగతి ఉండదు. మనిషయిన వాడికి అంతకుమించి ఇంకా కావాల్సి ఉంటుంది.
బౌద్ధ ద్ధమ్మం ప్రత్యేకతను మీరు గ్రహించి, దాన్ని పూర్తిగా అనుసరించి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది!
ఈ బాధ్యతను మీరు విజయవంతంగా నిర్వర్తించలేకపోతే- దాన్ని అవకాశంగా తీసుకుని, మనల్ని అంటే- మహర్లను, మాంగ్లను తీవ్రంగా విమర్శిస్తారు. బౌద్ధాన్ని మనమే అప్రతిష్టపాలు చేశామని నిందలు మోపుతారు. అందువల్ల, ఆ అవకాశం మనం ఎవరికీ ఇవ్వగూడదు. మనం మరింత జాగ్రత్తగా మసలుకోవాల్సి ఉంటుంది!
బౌద్ధాన్ని మనమంతా సంపూర్ణంగా ఆచరిస్తూ ఉండాలి!
ఈ నాటి మన ద్ధమ్మ దీక్ష యొక్క ప్రవాహపు అలలు దేశవ్యాప్తంగా విస్తరించగలవని ఆశిస్తున్నాను !!
ఇది మళ్లీ బౌద్ధ దేశం కాగలదని విశ్వసిస్తున్నాను-
మన భారతదేశానికి బౌద్ధం తప్ప- మరో ప్రత్యామ్నాయం లేదు. మన భారతదేశపు స్వాతంత్ర్యాన్ని పరిరక్షించుకోవాలన్నా, ఉనికిని నిలుపుకోవాలన్నా, దేశ గౌరవం కాపాడుకోవాలన్నా ఇక బౌద్ధమే శరణ్యం!!
14 అక్టోబర్, 1956 : దీక్షాభూమి, నాగపూర్ (మరాఠీ ప్రసంగానికి స్వేచ్ఛానువాదం)
ప్రియమైన నా సోదర సోదరీ మణులారా!
నేను హిందూ ధర్మాన్ని త్యజించి, భగవాన్ బుద్ధుడి శరణుజొచ్చాను. బౌద్ధ ద్ధమ్మాన్ని స్వీకరించాను-
ఇది, జ్ఞానం, సమానత్వం, కరుణ, సదాచారాల మీద ఆధారపడి ఉంది!
సోదర సోదరీ మణులారా! వినండి. ఇప్పుడు నేను హిందువును కాదు. అస్పృశ్యుణ్ణి కూడా కాదు. నేనొక విముక్త మానవుణ్ణి !!ఒక స్వేచ్ఛా జీవిని!! హాని కలిగించే ఈ దుష్ట వ్యవస్థకు బానిసను కాదు. నేనిప్పుడు ద్ధమ్మ దీక్ష తీసుకున్నాను గనక, నా శేష జీవితం బౌద్ధ ద్ధమ్మాన్ని ప్రచారం చేయడానికి వినియోగిస్తాను. బుద్ధుడి వెలుగులు మానవాళికి అందించడానికి నిబద్ధుడనై ఉంటానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను.
సోదర సోదరీ మణులారా!
నాతో పాటు బౌద్ధద్ధమ్మాన్ని స్వీకరించాలనుకున్నవారు నిలబడి నాతో పాటుగా ప్రమాణం చేయండి!
- అని డా.బి.ఆర్. అంబేద్కర్ కోరగానే మైదానంలో కూర్చుని ఉన్న వారంతా లేచి నిలబడి, అంబేద్కర్ చెప్పిన మాటలు వారు కూడా ఉచ్ఛరించి ప్రమాణం చేశారు.
1. నేను బుద్ధ భగవానుడు చెప్పిన నీతి సూత్రాల్ని అనుసరిస్తాను.
2. నేను మనుషులందరినీ సమానులుగా భావిస్తాను.
3. నేను అన్ని జంతువుల పట్ల కరుణతో వ్యవహరిస్తాను.
4. జన్మతా నాకు వచ్చిన మతాన్నీ, ధర్మాన్నీ తజిస్తున్నాను. అది, ప్రగతి నిరోధకంగా ఉండి, నా జీవితాన్ని దుఃఖమయం చేసిందని గ్రహించాను.
అందుకే బౌద్ధం స్వీకరించి బుద్ధుడి శరణు జొచ్చాను.
5. మనుషుల్ని హీన దృష్టితో చూసే ధర్మాన్ని త్యజించి, మానవీయ విలువల్ని నిలిపే బౌద్ధం స్వీకరించి- స్వేచ్ఛా మానవుణ్ణి అవుతున్నాను.
6. దీనితో నాకు కొత్త జన్మ సంతరించినట్లుగా భావిస్తున్నాను.
7.ఇక నుండి హిందూ దేవీ దేవతల్ని పూజించను. హిందూ కర్మకాండను అనుసరించను. మూఢ నమ్మకాల్ని నమ్మను. వ్యాప్తి చేయను.
8. ఈ రోజు నుంచి బుద్ధుడు చెప్పిన మూడు సూత్రాలు
ప్రజ్ఞ - సన్మార్గం - కరుణలను జీవితాంతం తప్పక పాటిస్తాను.
అవే నాకు మార్గదర్శనం చేస్తాయి.
సాహో ... బుద్ధం శరణం గచ్ఛామి
ద్ధమ్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్చామి.
బర్మా బౌద్ధ భిక్షువు మహాస్తవిర చంద్రమణి ద్వారా అంబేద్కర్ తన రెండవ భార్య డాక్టర్ సవితతో సహా బౌద్ధం స్వీకరిం చారు. ఇప్పటికి అంటే 2026 నాటికి డెబ్బయేండ్ల క్రితం! తనంతో పాటు కొన్ని లక్షల మంది అనుయాయుల్ని, అనుచరుల్ని బౌద్ధులుగా మార్చారు. వారంతా ఇప్పుడు ‘నియో బుద్ధిస్ట్’లుగా గుర్తింపు పొందారు. ఈ ఆధునిక కాలానికి చెందిన ఈ బౌద్ధ శాఖకు అంబేద్కర్ ‘‘నవయానం” అని పేరు పెట్టారు.
- భారత రాజ్యాంగంలో బౌద్ధం ఉంది.
- బౌద్ధ చిహ్నాలయిన అశోక చక్రం, సారనాథ్ స్థూపం ఈ దేశానికి అధికారిక చిహ్నలయ్యాయి.
- దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, దర్బార్ హాలులో నిలువెత్తు బుద్ధ విగ్రహం ఉంది.
దేశ నాయకులంతా ప్రమాణ స్వీకారం చేసేది అక్కడే.
- ప్రపంచ వైజ్ఞానిక పరిశోధనల్లో బౌద్ధం ఉంది. బుద్ధుడు చెప్పిన కార్యకారణ సంబంధం గురించి పూర్తిగా తెలుసుకుంటే, విషయం అర్థమవుతుంది.
- గాంధీ అహింసా సిద్ధాంతం ఎక్కడిదో..
- నెహ్రూ-పంచశీల ఎక్కడిదో విశ్లేషించుకుంటే విషయాలు అవగతమవుతాయి.
- పండిత అయోతీ థాస్, తమిళ బౌద్ధ ఉద్యమకారుడు, అంబేద్కర్నే ప్రభావితం చేసినవాడు ముందే ఎప్పుడో చెప్పాడు ‘‘పీడిత కులస్తులు అస్తిత్వ పోరాటాలు చేయాలే తప్ప, అగ్రకులాల వారికి సేవలు చేస్తూ బానిసలుగా బతకగూడదు’’ అని!
- ప్రొఫెసర్ లక్ష్మీ నరసు రచన- ద ఎస్సెన్స్ అఫ్ బుద్ధిజం (ESSENCE OF BUDDHISM) కు అంబేద్కర్ ముందుమాట రాసి, ఆ గ్రంథాన్ని 1948 లో పునర్ముద్రణ చేయించారు. ఇది బ్రాహ్మణేతర దృక్పథం నుంచి వెలువడ్డ అద్భుత రచన!
BUDDHA AND HIS DHAMMA - BUDDA OR KARL MARX డా.బి.ఆర్. అంబేద్కర్ రచించిన ఈ రెండు గ్రంథాలు అందరూ తప్పక చదవాల్సినవి. ఇతర మతాలు, ధర్మాలు ప్రవేశ పెట్టినవారు, తాము దేవతలమనో, దేవదూతలమనో చెప్పుకున్నారు.
కేవలం బుద్ధుడు మాత్రమే అలా చెప్పుకోలేదు. కనీసం తన వారసుణ్ణి ప్రకటించమని కోరినప్పుడు కూడా ప్రకటించలేదు- ‘‘ద్ధమ్మమే తన వారసుణ్ణి నిర్ణయించుకుంటుందని’’- అన్నాడు. తను చెప్పిన విషయాలు కూడా నిశితంగా ఆలోచించి, పరిశీలించి, విశ్లేషించుకున్న తర్వాతే అర్థం చేసుకుని ఆచరించమన్నాడు. తను చెప్పిన విషయాలైనా సరే గుడ్డిగా నమ్మగూడదన్నాడు.
హిందూ మతం అసమానతలపై ఆధారపడి ఉంటే, బౌద్ధ ద్ధమ్మం సమానత్వం పై ఆధారపడి ఉంది-
బౌద్ధం నైతికత మీద ఆధారపడి ఉంది. శీల ప్రధానమైంది.
ఇందులో దైవ భావన లేదు-
మనిషికీ మనిషికి ఉండే సంబంధం, హిందూ ధర్మంలో కృత్రిమమైంది. ధనవంతుడిగా ఉన్నప్పటి సంబంధాలు - పేదవాడైనప్పటి సంబంధాలకు తేడా ఉంది.
ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు సంబంధాలు వేరు వేరుగా ఉంటున్నాయి.
బౌద్ధం దాన్ని ఒప్పుకోదు-
బౌద్ధంలో అంతర్గతంగా ఉన్న గుణాల్ని, అంబేద్కర్ వెలికి తీసి ఈ దేశ ప్రజల అంతరంగాన్ని వెలిగించారు-
‘నలిపే చేతికి కూడా సువాసన ఇచ్చే పువ్వులా ఉండు’ ఇతరులలో వంద లోపాలు ఎత్తి చూపడం కన్నా, మీ లోపాలలో కనీసం ఒక దానిని సరిదిద్దుకున్నా సమాజానికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని చెపుతుంది బౌద్ధం!
- నేషనల్ బుక్ ట్రస్ట్ పూర్వ సలహా సంఘ సభ్యులు, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్.
ప్రొ. దేవరాజు మహారాజు






కామెంట్లు (0)