Magazines

వ్రతం చెడ్డా ఫలం దక్కని ట్రంప్!

1 గంట క్రితం

Trump loses
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 3 నిమిషాల చదవడం

ప్రపంచంలో అమెరికాకు అగ్రస్థానం అన్నది అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నినాదం. ఇప్పుడు దేశం సంగతి తరువాత రిపబ్లికన్‌ పార్టీకి ప్రథమ స్థానం దక్కించాలని నానా పాట్లు పడుతున్నాడు. వ్రతం చెడ్డా ఫలం దక్కేట్లు లేదని పరిశీలకులు అంటున్నారు. తక్షణమే అమెరికా, ప్రపంచ మార్కెట్‌కు డీజిల్‌ సరఫరా చేయాలని రష్యాతో ఒప్పందం కుదుర్చు కున్నట్లు ట్రంప్‌ ప్రకటించటం అమెరికన్లనే కాదు, ఐరోపా నేతలను కూడా విస్మయానికి గురిచేసింది. అంతకుముందు మియామీలో ట్రంప్‌, జెలెన్‌స్కీ, ఐరోపా ప్రతినిధుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగిన తరువాతే ఈ ప్రకటన వెలువడినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఒప్పందం పెద్ద ముప్పుతో కూడుకున్నదని ఇటలీ ప్రధాని మెలోనీ స్పందించారు. రష్యా ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తుండగా దానితో ఒప్పందం కుదుర్చు కోవటం వల్ల ఆంక్షలు నీరుగారే ప్రమాదం ఉందని ఆమె ఆందో ళన వ్యక్తం చేశారు. ఒక గ్యాలన్‌ ధర ఆరున్నర డాలర్లు పలుకుతుండటంతో నవంబరు మూడవ తేదీన జరిగే ఎన్నికల్లో ట్రంప్‌ తమను ఓట్లు ఎలా అడుగుతాడో చూస్తామని రైతులు, పరిశ్రమల వారు, రవాణా రంగానికి చెందిన వారు అంటున్నారు. దీంతో డీజిల్‌ ఒప్పందానికి సిద్ధమైనట్లు విమర్శలు వస్తున్నాయి. అయితే ఎన్నికల తరువాతే డీజిల్‌ అందుబాటులోకి వస్తుందట! రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధించాలని గతంలో చట్టం చేయించిన ట్రంప్‌ ఇప్పుడు అదే దేశంతో ఒప్పందానికి రావటంపై విమర్శలు వెల్లువెత్తాయి.


దీనిపై స్పందిస్తూ అమెరికా కోసం కాకుండా ఇబ్బందులు పడుతున్న ప్రపంచం కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన సమర్థించుకున్నారు. గతంలో ఒక మాట చెప్పి ఇప్పుడు మరోలా వ్యవహరించటం ట్రంప్‌ నిలకడలేని వైఖరికి నిదర్శనమని విమర్శకులు చెబుతున్నారు. ఉక్రెయిన్‌తో ఇంధన వ్యవస్థలపై అరవై రోజుల పాటు పరస్పర దాడులు నిలిపివేసే ఒప్పందం కుదిరిందని ట్రంప్‌ ప్రకటించగా, రష్యా దాన్ని ఖండించింది. రష్యా ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగి స్తుండటంతో ఈ ప్రకటనపై అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. ఉక్రెయిన్‌కు సమాచార సహకారం అందిస్తున్న ఎలన్‌ మస్క్‌ స్టార్‌లింక్‌ సేవలను నిలిపివేసినట్లు ట్రంప్‌ చెప్పాడు. మాస్కో వైపు నుంచి వచ్చే క్షిపణులు, డ్రోన్ల సమాచారాన్ని స్టార్‌లింక్‌ వ్యవస్థ ద్వారా ఉక్రెయిన్‌కు అందిస్తు న్నారు. అమెరికా 2022లో చేసిన చట్టం ప్రకారం రష్యాపై ఆంక్షలను తొలగించే అధికారం అధ్యక్షుడికి లేదని, పార్లమెంటు మాత్రమే ఆ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుం దని విమర్శకులు గుర్తుచేస్తు న్నారు. రష్యా దాడులు కొనసాగుతున్న సమయంలో డీజిల్‌ కొనుగోలుకు అనుమతించటం చట్టబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఉక్రెయిన్‌, పశ్చిమాసియా సంక్షోభాల కారణంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి అమెరికా, ఐరోపాల్లో డీజిల్‌ టోకు ధరలు రెట్టింపుకంటే ఎక్కువగా పెరిగాయి. రష్యా నుంచి సరకు వచ్చినప్పటికీ సమీప భవిష్యత్తులో ధరలు తగ్గే అవకాశాలు లేవని అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనా వేసింది. ప్రస్తుతం రోజుకు పది లక్షల పీపాల డీజిల్‌ కొరత ఉండగా, ఈ ఒప్పందం ద్వారా లక్షన్నర పీపాలు మాత్రమే అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు.

అనేక ఇబ్బందుల్లో ఉన్న రష్యాకు ట్రంప్‌ పరోక్షంగా మేలు చేస్తున్నాడని చెప్పవచ్చు. పశ్చిమాసియా సంక్షోభంతో ముడిచమురు ధరలు పెరగటం రష్యాకు కలిసి వచ్చింది. ఇప్పుడు డీజిల్‌ ఒప్పందం అమలైతే 470 కోట్ల డాలర్ల మేర అదనపు ఆదాయం వస్తుందని అంచనా. అయితే ఒప్పందం అధికారికంగా అమల్లోకి వస్తుందా, దాని వల్ల మార్కెట్‌లో ఎంత మార్పు వస్తుందన్నది ఇంకా స్పష్టత లేని అంశంగా ఉంది. ట్రంప్‌-పుతిన్‌ ఒప్పందం భవిష్యత్తు ఎలా ఉన్నా తాత్కా లికంగా పుతిన్‌ పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది. అమెరికా నిలకడలేని వైఖరి మరోసారి ప్రపంచానికి వెల్లడైంది. ట్రంప్‌ను నమ్ముకుంటే నట్టేట ముంచి మధ్యలో వదిలేస్తాడనే ఆందోళన మిత్రదేశాల్లో పెరుగుతోంది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ బేరసారాల్లో బలహీనపడటంతో పాటు స్వదేశంలోనూ విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఉక్రెయిన్‌కు ఎంతకాలం, ఎన్ని బిలియన్‌ డాలర్లు సాయం చేయాలనే ప్రశ్నలు ఐరోపా దేశాల్లో తలెత్తుతున్నాయి. అమెరికా, ఐరోపా సమాఖ్య మధ్య దూరం మరింత పెరిగే ప్రమాదం ఉంది. మరోవైపు అమెరికా, ఐరోపా దేశాల బలహీనతలు బయటపడటంతో ఇరాన్‌ హార్ముజ్‌పై మరింతగా కేంద్రీకరిస్తున్నది. దాని మద్దతుదారులైన యెమెన్‌ హౌతీలు సౌదీపై దాడులతో తమ పట్టును పెంచుకుంటు న్నారు. బాబ్‌ ఎల్‌ మండాబ్‌ జలసంధిని దిగ్బంధిస్తే సూయజ్‌ కాలువ ద్వారా జరిగే ప్రపంచ రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడి రవాణా వ్యయాలు మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు. ఈ పరిణామాలన్నీ అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌తో పాటు ప్రపంచ వాణిజ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్