Magazines

మదురోపై చిత్రహింసల అస్త్రం

1 గంట క్రితం

A weapon of torture against Maduro
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 2 నిమిషాల చదవడం


అరుదైన ఫెడరల్ చట్టం ప్రయోగించిన అమెరికా

దేశాధినేతపై ఇదే తొలి కేసు

న్యూయార్క్: వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోపై అమెరికా ప్రాసిక్యూటర్లు విదేశాల్లో జరిగే చిత్రహింసలను నేరంగా పరిగణించే అరుదైన ఫెడరల్ చట్టాన్ని ప్రయోగించారు. ఈ చట్టం కింద అభియోగాలు ఎదుర్కొన్నవారు చాలా కొద్దిమందే కావడం గమనార్హం. మదురో (63), ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ (70) గత వారం తాము నిర్దోషులమని కోర్టులో స్పష్టం చేశారు. రాజకీయ ప్రత్యర్థులను చిత్రహింసలు పెట్టేందుకు కుట్ర పన్నారని, దీనికోసమే అధికారంలో కొనసాగారనే అభియోగాన్ని ఇప్పుడు చేర్చారు. ఇప్పటికే ఉన్న మాదకద్రవ్యాల అక్రమ రవాణా అభియోగాలకు ఇది అదనం. కాగా, దీనిపై విచారణ 2027 జూన్‌లో జరగనుంది.

మదురో దంపతులపై అరుదైన చట్టం..

ఈ ఏడాది జనవరిలో కారకాస్‌లో అధ్యక్షుడు ట్రంప్ ఆదేశంతో అమెరికా సైన్యం దాడి చేసి ఈ ఇద్దరినీ కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ హయాంలోని, 1994 నాటి చిత్రహింసల నిరోధక చట్టాన్ని తెరపై తీసుకువచ్చారు. ఈ అభియోగాలు ఎదుర్కొంటున్న ఏడో వ్యక్తులు వీరే కావడం గమనార్హం. కస్టడీలో ఉన్న వ్యక్తికి తీవ్రమైన శారీరక లేదా మానసిక బాధ కలిగించే చర్యలను ఈ చట్టం నేరంగా పరిగ ణిస్తుంది. ఇప్పటివరకు నలుగురికి ఈ శిక్షలు పడ్డాయి. వారిలో లైబీరియా, గాంబియా పారామిలటరీ దళాల సభ్యులు, సిరియా మాజీ జైలు అధిపతి, ఇరాక్‌లో అక్రమ ఆయుధ కర్మాగారం నడిపిన ఓ అమెరికా పౌరుడు ఉన్నారు. ఒక్కో అభియోగానికి గరిష్ఠంగా 20 ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది. యావజ్జీవం లేదా మరణశిక్ష కూడా విధించవచ్చు. ఇప్పటివరకు ఈ చట్టం కింద దోషులైనవారికి 60 నుంచి 97 ఏళ్ల వరకు శిక్షలు పడ్డాయి. మదురో, ఫ్లోర్స్‌ల పై చిత్రహింసలకు కుట్ర అభియోగం మాత్రమే ఉన్నందున వారికి మరణశిక్ష విధించే వీలులేదని పలువురు విశ్లేషిస్తున్నారు. ఒక దేశాధినేతను చిత్ర హింసలకు అనుమతించారన్న ఆరోపణపై అమెరికా విచారణ జరపడం ఇదే తొలిసారని స్టెప్టో న్యాయ సంస్థ భాగస్వామి మైఖేల్ పారడిస్ తెలిపారు. ‘‘ఇది నిజంగా ఒక చారిత్రక కేసు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. గ్వాంటనామో బే నిర్బంధితుల తరఫున గతంలో మైఖేల్‌ ‌న్యాయపోరాటం చేశారు.

ఈ కొత్త అభియోగాలతో కేసు తీవ్రత మారిపోయింది. అధికారాన్ని దుర్వినియోగం చేసి డ్రగ్ స్మగ్లర్లకు సహకరించారని, సొంత ప్రయోజనాలు పొందారన్న ఆరోపణలకు తోడు, మదురో 13 ఏళ్ల పాలనలో మానవ హక్కుల ఉల్లంఘనలను విచారించడానికి అమెరికాకు వీలుకలిగింది. అధికారంలో కొనసాగేందుకు మదురో అనేక నేరాలకు పాల్పడ్డారనే కల్పిత కథనాన్ని ప్రాసిక్యూటర్లు చెప్పడానికి, దీనికి సంబంధించిన సాక్షులను తీసుకు రావడానికి ఈ చట్టాన్ని ఉపయోగిస్తారని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మదురో భార్య ఫ్లోర్స్ తరుపు న్యాయవాదులు మార్క్ డాన్నెల్లీ, ఆండ్రెస్ సాంచెజ్‌‌లు మాట్లాడుతూ వారు పూర్తిగా నిర్దోషులని చెప్పారు. దేశాధినేతగా ఉన్నందున ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ ఉంటుందన్న వాదనతో అభియోగ పత్రం కొట్టివేయాలని గతంలో వేసిన పిటిషన్‌ను కొత్త అభియోగా లకు అనుగుణంగా సవరిస్తామన్నారు. ఈ అభియోగాలు నమోదు చేసిన మాన్‌ హాటన్ యుఎస్ అటార్నీ కార్యాలయం స్పందించేందుకు నిరాకరించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్