సౌదీ విమానాశ్రయంపై హౌతీల క్షిపణి దాడి
రియాద్ : సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఆదివారం హౌతీలు జరిపిన క్షిపణి దాడిలో 12 మంది చనిపోగా 309 మంది గాయపడ్డారు. మృతులలో సౌదీ జాతీయులు, ఇద్దరు బంగ్లాదేశీయులతో పాటు అమెరికా, ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, పాలస్తీనా, సూడాన్ దేశాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ దాడిలో ప్రాణనష్టంతో పాటు ఆస్తినష్టం కూడా జరిగింది. తూర్పు ప్రాంతంలో సౌదీ అరేబియాకు చెందిన ప్రధాన విమానాశ్రయాలలో ఇది ఒకటి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ దళాలు దాడి ప్రారంభించిన తర్వాత కింగ్ ఖలీద్ విమానాశ్రయంపై దాడి జరగడం ఇదే మొదటిసారి. విమానాశ్రయాన్ని మూసివేయడంతో రియాద్‌కు రాకపోకలు సాగించే తన విమాన సర్వీసులన్నింటినీ కువైట్ ఎయిర్వేస్ రద్దు చేసింది. ఈ ఘటన నేపథ్యంలో సౌదీ వ్యాప్తంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 580 విమాన సర్వీసులను రద్దు చేశారు.తాజా దాడికి ముందే ఎయిర్ ఇండియా, ఫ్లైదుబారు, లుఫ్తాన్సా గ్రూప్, పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ సంస్థలు రియాద్‌కు, ఇతర సౌదీ విమానాశ్రయాలకు రాకపోకలు సాగించే సర్వీసులను రద్దు చేశాయి. కాగా ఇటీవలి కాలంలో సౌదీ విమానాశ్రయాలపై హౌతీలు తీవ్రమైన దాడులు జరుపుతున్నారు. అంతేకాక రియాద్, అబ్హా, ఖమిస్ ముష్యత్, జజన్, నజ్రాన్‌లోని లక్ష్యాలపై కూడా దాడులను ముమ్మరం చేశారు.
ప్రతీకారం తీర్చుకుంటాం
రియాద్ విమానాశ్రయం మీద హౌతీలు జరిపిన దాడిపై సౌదీ అరేబియా నేతృత్వంలోని సైనిక కూటమి తీవ్రంగా స్పందించింది. తగిన ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలపై సౌదీ జరుపుతున్న దాడులలో భాగస్వాములమయ్యే అవకాశాలను పరిశీలిస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డర్ లెయాన్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, కెనడా ప్రధాని మార్క్ కార్నే తదితరులు హౌతీల దాడిని ఖండించారు. పాకిస్తాన్, ఖతార్, పాలస్తీనా, జోర్డాన్, మలేసియా దేశాలు సౌదీ అరేబియాకు సంఘీభావం తెలియజేశాయి.







కామెంట్లు (0)