నవతెలంగాణ-హైదరాబాద్ : హాలీవుడ్ నటి సెల్మా బ్లెయిర్ విమాన ప్రయాణంలో వీరంగం సృష్టించడం చర్చనీయాంశమవుతోంది. లాస్ ఏంజెలెస్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో నటి హడావుడి చేశారు. విమాన సిబ్బందిని కొట్టడంతో పాటు కొరికినట్లు ఆరోపణలు వచ్చాయి. విమానం దిగిన తర్వాత ఓ పోలీసు అధికారి, ఆసుపత్రి నర్సుపైనా ఆమె దాడికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఈ ఘటనలో ఇద్దరు విమాన సిబ్బంది గాయపడ్డారు.
మరోవైపు నాడీ సంబంధిత సమస్యలకు వాడే మందులు తీసుకోకపోవడం, విమానంలో తలకు గాయం కావడం వల్ల ఆమె అయోమయానికి గురయ్యారని సెల్మా బ్లెయిర్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఆ సమయంలో ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తెలిపారు. విరామం లేకుండా ఎక్కువ గంటలు పనిచేయడం, అలసట, విమానంలో తలకు తగిలిన గాయం కూడా ఆమె పరిస్థితిపై ప్రభావం చూపి ఉండవచ్చని వివరించారు. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని వాదించారు. దీనిపై తదుపరి విచారణ జనవరి 19న జరగనుంది. ‘క్రూయల్ ఇంటెన్షన్స్’, ‘లీగల్లీ బ్లాండ్’, ‘హెల్‌బాయ్’ వంటి చిత్రాలతో సెల్మా బ్లెయిర్ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.
ఇక గతంలోనూ పలువురు సెలబ్రిటీలను కొరికినట్లు స్వయంగా సెల్మా బ్లెయిర్ రాసిన పుస్తకంలో వెల్లడించారు. పబ్లిక్ ప్రదేశాల్లో విపరీతమైన ఒత్తిడి ఉన్నప్పుడు తాను ఆ విధంగా ప్రవర్తిస్తానని అందులో రాసుకొచ్చారు.






కామెంట్‌లు (0)