Magazines

అమల్లోకి ‘మక్కా ఒప్పందం’..సౌదీకి పాక్‌, తుర్కియే బలగాల తరలింపు

55 నిమిషాల క్రితం

'Mecca Agreement' comes into effect.. Pakistani and Turkish forces move to Saudi Arabia
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : సౌదీ అరేబియా, పాకిస్థాన్‌, తుర్కియే మధ్య కుదిరిన ‘మక్కా ఒప్పందం’ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పరస్పర రక్షణ కూటమి కింద సౌదీ అరేబియాకు సైనిక బలగాలు, రక్షణ సామర్థ్యాలను వేగంగా తరలించేందుకు పాకిస్థాన్‌, తుర్కియే అంగీకరించాయి. ఇరాన్‌ మద్దతున్న హౌతీల నుంచి ఎదురవుతున్న దాడులు, భద్రతా ముప్పుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

రియాద్‌లో అక్టోబర్‌ 5న ‘మక్కా అలయన్స్‌ ఫర్‌ డిఫెన్స్‌’ వ్యూహాత్మక-రాజకీయ, రక్షణ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. ఒప్పందంలోని సామూహిక రక్షణ హామీలను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని, సౌదీకి అంగీకరించిన సైనిక బలగాలను వేగంగా తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కమిటీ నిర్ణయించింది. మూడు దేశాల జాతీయ చట్టాలకు అనుగుణంగానే బలగాల మోహరింపు ఉంటుందని సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశారు.

మూడు దేశాల మధ్య సైనిక సన్నద్ధత, సమన్వయాన్ని బలోపేతం చేయడం, భద్రతా ముప్పులను సమష్టిగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచడమే ఈ కూటమి ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. మక్కా, మదీనాలతో పాటు సౌదీ నగరాలు, పౌర, ఆర్థిక కేంద్రాలపై జరుగుతున్న దాడులను మూడు దేశాలు తీవ్రంగా ఖండించాయి. సౌదీ భద్రత, ప్రాదేశిక సమగ్రత పరిరక్షణలో ఆ దేశ సాయుధ బలగాల అప్రమత్తత, సంసిద్ధతను ప్రశంసించాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్