నవతెలంగాణ - హైదరాబాద్: గాంధీ జయంతి సందర్భంగా నగరంలోని మాంసం దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌కు తెలంగాణ హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. పాత కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.
తార్నాకకు చెందిన న్యాయ విద్యార్థి వడ్ల శ్రీకాంత్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఇలాంటి ఉత్తర్వులపై శ్రీకాంత్ కోర్టును ఆశ్రయించగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్లాటర్‌హౌస్‌లు, మాంసం దుకాణాల మూసివేతకు సంబంధించిన ఉత్తర్వులు జీహెచ్‌ఎంసీ చట్టం-1955 నిబంధనలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది విజయ్ గోపాల్ కోర్టుకు తెలిపారు.
అయితే, కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా స్లాటర్‌హౌస్‌లు, రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలను మూసివేయాలని సెప్టెంబర్ 30న జీహెచ్‌ఎంసీ పత్రికా ప్రకటన విడుదల చేసిందని ఆయన వాదించారు. నిబంధనలను గెజిట్‌లో ప్రచురించకుండానే ఈ నిర్ణయం తీసుకోవడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. దుకాణాల మూసివేత వ్యాపారుల ప్రాథమిక హక్కులను, ముఖ్యంగా ఆర్టికల్ 19(1)(g)ను ఉల్లంఘిస్తుందని తెలిపారు.
కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిన కమిషనర్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు రూ.50 వేల జరిమానా విధించాలని పిటిషన్‌లో కోరారు. వాదనలు విన్న హైకోర్టు కమిషనర్‌కు నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను వాయిదా వేసింది.






కామెంట్‌లు (0)