Magazines

వామ్మో.. ట్రంప్‌!

3 గంటల క్రితం

Oh my God... Trump!
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 3 నిమిషాల చదవడం

అధ్యక్షుడి పేరు చెబితేనే హడలిపోతున్న రిపబ్లికన్‌ అభ్యర్థులు
వెబ్‌సైట్ల నుంచి ఆయన పేరు, ఫొటోలు, ప్రస్తావనల తొలగింపు
పడిపోతున్న ట్రంప్‌ రేటింగ్‌ విజయావకాశాలను దెబ్బతీస్తుందని అనుమానం


వాషింగ్టన్‌ : వచ్చే నెలలో అమెరికాలో జరిగే మధ్యంతర ఎన్నికలలో పోటీ చేస్తున్న రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థులు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేరు చెబితేనే హడలి పోతున్నారు. ట్రంప్‌ రేటింగ్‌ దారుణంగా పడిపోతుండడంతో ఆ ప్రభావం తమ విజయావకాశాలపై ఎక్కడ పడుతుందోనని వారంతా భయపడుతూ ఆయనతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతినిధులసభ, సెనెట్‌ స్థానాలకు పోటీ పడుతున్న రిపబ్లికన్‌ అభ్యర్థులలో మూడింట రెండు వంతుల మంది ట్రంప్‌తో సంబంధాలను తగ్గించుకున్నారని రాయిటర్స్‌ వార్తా సంస్థ జరిపిన పరిశీలనలో తేలింది. ట్రంప్‌ ప్రజాదరణను కోల్పోవడంతో కాంగ్రెస్‌పై రిపబ్లికన్‌ పార్టీ పట్టు సడలిపోతోంది. దీంతో ఆయన నుంచి దూరం జరగడానికి ఆ పార్టీ అభ్యర్థులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.


విధాన నిర్ణయాలపై వ్యతిరేకత
రిపబ్లికన్‌ అభ్యర్థుల ఓటింగ్‌ రికార్డులు, బహిరంగ ప్రకటనలు, ప్రచార సామగ్రిని రాయిటర్స్‌ నిశితంగా పరిశీలించింది. వచ్చే నెల 3వ తేదీన 62 కాంగ్రెస్‌ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. వీటిలో 41 స్థానాలకు పోటీ చేస్తున్న రిపబ్లికన్‌ అభ్యర్థులు ట్రంప్‌కు దూరంగా ఉంటున్నారని రాయిటర్స్‌ తెలిపింది. ట్రంప్‌ అజెండాతో వారు విభేదించకపోయినప్పటికీ ఆయన వ్యక్తిగత వ్యవహార శైలిపై, విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకుడితో నేరుగా సంబంధాలు తెంచుకోకుండా స్వతంత్ర ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోటీలో ఉన్న రిపబ్లికన్‌ అభ్యర్థులలో 23 మంది ట్రంప్‌ విధాన నిర్ణయాలతో విభేదిస్తున్నారు. ఉదాహరణకు ఇరాన్‌పై ట్రంప్‌ చేస్తున్న యుద్ధాన్ని 12 మంది రిపబ్లికన్‌ అభ్యర్థులు వ్యతిరేకించారు. కొందరు సిట్టింగ్‌ అభ్యర్థులు ట్రంప్‌ యుద్ధ అధికారాలకు కత్తెర వేసే తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు కూడా. గ్యాస్‌ ధరలను పెంచి, ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపుతున్న యుద్ధానికి తక్షణమే ముగింపు పలకాలని కొందరు బహిరంగంగానే పిలుపునిచ్చారు.


ఓ వైపు పడిపోయిన రేటింగ్‌... 
మరోవైపు ధిక్కార స్వరాలు
కొందరు రిపబ్లికన్‌ అభ్యర్థులకు, ట్రంప్‌కు మధ్య అభిప్రాయబేధాలు తలెత్తడానికి డేటా సెంటర్లు కూడా కారణమవుతున్నాయి. డేటా సెంటర్లను వేగవంతంగా అభివృద్ధి చేయాలని ట్రంప్‌ భావిస్తుండగా ముగ్గురు అభ్యర్థులు ఆ ప్రాజెక్టును వ్యతిరేకించారని, అవి ముందుకు సాగకుండా అడ్డుకున్నారని రాయిటర్స్‌ పరిశీలనలో తేలింది. రిపబ్లికన్‌ పార్టీలో వచ్చిన ఈ మార్పు అసాధారణమైనదిగా కన్పిస్తోంది. ఎందుకంటే ట్రంప్‌ గత దశాబ్ద కాలంగా ఆ పార్టీని తన సొంత ప్రతిబింబంలా పునర్నిర్మిం చారు. తనను ధిక్కరించిన చట్టసభ సభ్యులను, అభ్యర్థులను తన దారికి తెచ్చుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఓ వైపు పడిపోతున్న ఆమోద రేటింగ్‌, మరోవైపు పార్టీలో ధిక్కార స్వరాలు ట్రంప్‌ను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాయిటర్స్‌/ఇప్సోస్‌ నిర్వహించిన తాజా పోల్‌లో ట్రంప్‌ రేటింగ్‌ గతంలో ఎన్నడూ లేని విధంగా 32 శాతం కనిష్ట స్థాయికి దిగజారింది. డెమొక్రాట్లకు 44 శాతం మంది ఓటర్లు మద్దతు ఇస్తుంటే రిపబ్లికన్లను కేవలం 37 శాతం మందే సమర్ధించారు. స్వతంత్రులలో కూడా కూడా డెమొక్రాట్లకే మద్దతు ఎక్కువగా కన్పిస్తోంది. 37 శాతం స్వతంత్రులు డెమొక్రాట్లకు మద్దతు ఇస్తుంటే 21 శాతం మందే రిపబ్లికన్ల వెంట ఉన్నారు.


కొంచెం ఇష్టం...కొంచెం దూరం
రిపబ్లికన్‌ అభ్యర్థులలో ట్రంప్‌పై పూర్తి స్థాయిలో వ్యతిరేకత కన్పించడం లేదు. ఆయనను ఇష్టపడుతూనే విధానాల పరంగా వ్యతిరేకిస్తు న్నారు. ఉదాహరణకు నెబ్రాస్కాలో స్వతంత్ర అభ్యర్థి నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్న రిపబ్లికన్‌ సెనెటర్‌ పీట్‌ రికెట్స్‌... గొడ్డు మాంసం దిగుమతులను పెంచాలన్న ట్రంప్‌ నిర్ణయంతో విభేదించారు. తీవ్ర పోటీ ఉన్న లోవాలో బరిలో ఉన్న రిపబ్లికన్‌ అభ్యర్థి మరియానెట్‌ మిల్లర్‌-మిక్స్‌ కూడా పలు అంశాలపై ట్రంప్‌తో విభేదిస్తున్నారు. బీఫ్‌ దిగుమతి విధానాలను ఆమె వ్యతిరేకించడంతో పాటు ఇరాన్‌ విషయంలో ట్రంప్‌ యుద్ధ అధికారాలను కుదించేందుకు ఉద్దేశించిన తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. కొంతమంది అభ్యర్థులు ట్రంప్‌ పట్ల తమ విధేయతను బహిరంగంగా ప్రదర్శించడానికి వెనుకంజ వేస్తున్నారు. డెమొక్రటిక్‌ ప్రతినిధి క్యాథీ కాస్టర్‌పై పోటీ చేస్తున్న ఫ్లోరిడా రాష్ట్ర మాజీ ప్రతినిధి మైక్‌ బెల్ట్రాన్‌ తన ప్రచార వెబ్‌సైట్‌ నుంచి ట్రంప్‌కు సబంధించిన ప్రస్తావనలను తొలగించారు. ఆగస్టులో బెల్ట్రాన్‌ ఇంటర్నెట్‌ హోమ్‌ పేజీలో కన్పించిన ట్రంప్‌ ఫొటో ఇప్పుడు అదృశ్యమైంది. చాలా మంది అభ్యర్థులు ట్రంప్‌కు దగ్గరగా ఉంటూనే స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. హైతీ వలసదారులకు చట్టపరంగా తాత్కాలిక రక్షణ కల్పించడం, టర్కీకి ఎఫ్‌-35 యుద్ధ విమానాల సరఫరాను పునరుద్ధరించడం వంటి ట్రంప్‌ ప్రతిపాదనలను తాను వ్యతిరేకిస్తున్నానని ప్రతినిధిసభకు పోటీ చేస్తున్న న్యూయార్క్‌ ప్రతినిధి మైక్‌ లాలర్‌ చెప్పారు. ట్రంప్‌కు, తనకు అన్ని విషయాలలోనూ ఏకాభిప్రాయం ఉండదని, అయినా ఫర్వాలేదని ఆయన ఓ ర్యాలీలో తెలిపారు.


ఓటర్ల మనోగతానికి అద్దం పడుతోంది

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోవడాన్ని గమనించిన డజను మంది రిపబ్లికన్‌ అభ్యర్థులు తమ ప్రచార వెబ్‌సైట్ల నుంచి ఆయన పేరును, ఫొటోలను తొలగించారు. పార్టీ అభ్యర్థిత్వం పొందిన తర్వాతే వీరంతా ట్రంప్‌ను దూరం పెట్టడం గమనార్హం. కొందరు అభ్యర్థులేమో ట్రంప్‌ కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్నారు. తమకు మద్దతుగా ట్రంప్‌ ప్రచారం చేయాలా అవసరం లేదా అని చెప్పడానికి కూడా కొందరు నిరాకరించారు. ప్రజాదరణ కోల్పోయిన దేశాధ్యక్షుడి నుంచి అభ్యర్థులు దూరం జరగడం అమెరికాలో కొత్తేమీ కాదు. 2014, 2022 ఎన్నికలలో డెమొక్రాట్లు కూడా ఇలాంటి వ్యూహాన్నే అమలు చేశారు. 'ఈ ఎన్నికలలో అభ్యర్థులు ఓటర్ల వైఖరిని ప్రతిబింబిస్తున్నారు' అని రిపబ్లికన్‌ వ్యూహకర్త రాన్‌ బోనోజిన్‌ వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా స్వతంత్ర ఓటర్లను ఆకర్షించాలంటే అభ్యర్థులు ట్రంప్‌ను దూరం పెట్టక తప్పదని ప్రచార సలహాదారులు అభిప్రాయపడ్డారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్