ఏఐ విస్తరణతో అమెరికాలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్
డేటా కేంద్రాల కోసం వందల మైళ్ల మేర హైటెన్షన్ లైన్ల నిర్మాణం
రైతుల భూముల మీదుగా విద్యుత్ లైన్లు.. ఆస్తుల విలువ తగ్గుతుందని ఆందోళన
‘లాభాలు ప్రయివేటుకు.. నష్టాలు మాకా’ అంటూ గ్రామీణుల ఆగ్రహం
మా భూములెందుకు త్యాగం చేయాలంటూ నిరసన
వాషింగ్టన్: కృత్రిమ మేధ (ఏఐ) రంగం వేగంగా విస్తరిస్తుండటంతో అమెరికాలో డేటా సెంటర్లకు విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ అవసరాన్ని తీర్చేందుకు వందల మైళ్ల దూరంలోని గ్రామీణ ప్రాంతాల మీదుగా భారీ విద్యుత్ లైన్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దీంతో తమ భూములు, ఇండ్లు, పర్యావరణం దెబ్బతింటాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రయివేటు కంపెనీల వ్యాపార అవసరాల కోసం తమ ఆస్తులను త్యాగం చేయాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాభాలు డేటా సెంటర్లకు, నష్టాలు తమకు మిగులుతున్నాయని ఆవేదన చెందుతున్నారు.అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ఉన్న లౌడౌన్ కౌంటీలో ప్రపంచంలోనే అత్యధికంగా డేటా సెంటర్లు ఉన్నాయి. సుమారు 230 డేటా సెంటర్లు, 56 మిలియన్ చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో పనిచేస్తున్నాయి. వీటికి విద్యుత్ సరఫరా చేయడానికి వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, మేరీల్యాండ్ రాష్ట్రాల మీదుగా కొత్త విద్యుత్ లైన్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో వ్యాలీ లింక్ ప్రాజెక్టు ప్రధానమైనది. 765 కిలో ఓల్టుల సామర్థ్యంతో, సుమారు 260 మైళ్ల పొడవున భారీ స్తంభాలతో ఈ లైన్ నిర్మించనున్నారు. మరో 116 మైళ్ల లైన్ కూడా ప్రతిపాదనలో ఉంది. మార్ల్ పేరుతో మరో 500 కిలో ఓల్టుల విద్యుత్ లైన్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఈ లైన్ల నిర్మాణం వల్ల తమ భూముల విలువ పడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వెస్ట్ వర్జీనియాలోని తన 70 ఎకరాల వ్యవసాయ క్షేత్రం మీదుగా విద్యుత్ లైన్ వెళ్లనుండటంతో క్యాట్ కెమ్మెర్లింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భూమికి పరిహారం ఇచ్చినా, దాని మొత్తం విలువ తగ్గిపోవడానికి అది సరిపోదన్నారు. “మేం లౌడౌన్‌కు విద్యుత్ అందించే పొడిగింపు తీగలుగా మారుతున్నాం. కానీ మాకు ఎలాంటి ప్రయోజనం లేదు” అని ఆమె వ్యాఖ్యానించారు. అమెరికాలోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తున్నారు. స్థానిక సంస్థలు తీర్మానాలు చేస్తున్నాయి. న్యాయవాదులను నియమించుకుని ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని చోట్ల ప్రజల నిరసనలతో విద్యుత్ లైన్ల మార్గాలను మార్చిన సందర్భాలూ ఉన్నాయి. అయితే, ప్రజా ప్రయోజనాల పేరుతో ప్రభుత్వం ప్రయివేటు భూములను స్వాధీనం చేసుకునే అధికారం కలిగి ఉండటంతో, స్థానికుల అభ్యంతరాలకు పరిమిత అవకాశాలే ఉన్నాయి. 2021 నుంచి 2025 మధ్య లౌడౌన్ కౌంటీలో విద్యుత్ వినియోగం 233 శాతం పెరిగి ఐదు గిగావాట్లకు పెరిగింది. 2030 నాటికి ఏఐ అవసరాల కారణంగా ఈ డిమాండ్ 20 నుంచి 30 గిగావాట్లకు చేరవచ్చని అంచనా. ఇప్పటికే కొన్ని డేటా సెంటర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి ఏడాది లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతోంది. గత జులైలో విద్యుత్ లైన్‌లో పరికరం విఫలం కావడంతో కొన్ని డేటా సెంటర్లు బ్యాకప్ విద్యుత్‌కు మారాయి. ఫలితంగా గ్రిడ్‌పై ఒక్కసారిగా 3,000 మెగావాట్ల డిమాండ్ తగ్గి, చికాగో నుంచి మయామి వరకు విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయి. డేటా సెంటర్లు పన్నుల ద్వారా స్థానిక అభివృద్ధికి నిధులు అందిస్తున్నాయని వాటి అనుకూల వర్గాలు చెప్తున్నాయి. ఆరోగ్య సేవలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, క్లౌడ్ నిల్వ వంటి అవసరాలకు కూడా ఇవి కీలకమని వివరిస్తున్నాయి. అయితే, ఏఐ విస్తరణతో విద్యుత్ అవసరాలు మరింత పెరుగుతుండటంతో, కొత్త డేటా సెంటర్లకు అనుమతులు ఇవ్వాలా వద్దా అన్న చర్చ తీవ్రమవుతోంది. న్యూయార్క్ రాష్ట్రం డేటా సెంటర్లపై తాత్కాలిక నిషేధం విధించగా, వర్జీనియాలోనూ అలాంటి డిమాండ్లు వినిపిస్తున్నాయి.






కామెంట్‌లు (0)