బ్యాంకులు, ఓడరేవులకు అమెరికా సెనెటర్ల లేఖ
చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
వాషింగ్టన్ : అమెరికా, రష్యా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ మధ్య కుదిరిన డీజిల్ సరఫరా ఒప్పందంపై భవిష్యత్తులో పార్లమెంటరీ దర్యాప్తు జరిపేందుకు వీలుగా దానికి సంబంధించిన అన్ని రికార్డులను భద్రపరచాలని డెమొక్రాట్ సెనెటర్లతో పాటు కొందరు రిపబ్లికన్ ప్రతినిధులు కూడా డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు అమెరికాలోని ప్రముఖ బ్యాంకులు, ప్రధాన ఓడరేవుల అధికారులకు అధికారికంగా లేఖలు పంపారు. లేఖలు అందుకున్న బ్యాంకుల్లో జేపీ మోర్గాన్ ఛేజ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్, ఫార్గో, గోల్డ్‌మన్ శాక్స్, మోర్గాన్ స్టాన్లీ ఉన్నాయి. న్యూయార్క్/న్యూజెర్సీ పోర్ట్ అథారిటీతో పాటు టెక్సాస్‌లోని హ్యూస్టన్ కార్పస్ క్రిస్టి, బ్యూమాంట్ రేవుల అధికారులకు కూడా లేఖలు అందాయి.
2020లో అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన చట్టం ప్రకారం రష్యా నుంచి ఇంధన దిగుమతులపై స్పష్టమైన నిషేధం అమలులో ఉన్నదని సెనెటర్లు గుర్తు చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని రష్యా పూర్తిగా ఆపేంతవరకూ ఈ నిషేధం అమలులో ఉండాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. రష్యా డీజిల్ కొనుగోలు, రవాణా, దిగుమతి, నిల్వ లేదా పంపిణీకి సహకరించే కంపెనీలు తీవ్రమైన సివిల్, క్రిమినల్ విచారణలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే 20 సంవత్సరాల వరకూ జైలు శిక్ష పడుతుందని తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ట్రంప్-పుతిన్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రష్యా నుంచి తొలి డీజిల్ రవాణా నౌకలు ఇప్పటికే అమెరికా తీరానికి బయలుదేరాయని తెలుస్తోంది.బ్యాంకులు, ఓడరేవుల అధికారులకు రాసిన లేఖకు డెమొక్రాట్ సెనెటర్ జీన్ షాహీన్, రిపబ్లికన్ సెనెటర్ థామ్ టిల్లిస్ ప్రధాన సూత్రధారులు కాగా సెనెటర్లు క్రిస్ కూన్స్, ఎలిజబెత్ వారెన్, రాన్ వైడెన్, షెల్డన్ వైట్‌హౌస్, రిప్రజెంటింగ్ ప్రతినిధి గ్రెగరీ మీక్స్ దానిపై సంతకాలు చేశారు. కాగా రష్యా డీజిల్‌పై విధించిన ఆంక్షలను సడలించడాన్ని ట్రంప్ ప్రభుత్వం సమర్ధించుకుంది. దేశంలో పెరిగిన డీజిల్ ధరల భారాన్ని తగ్గించి రైతులు, సామాన్యులకు ఊరట కలిగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.






కామెంట్‌లు (0)