Magazines

ఇజ్రాయిల్ లో అనిశ్చితి

1 గంట క్రితం

Uncertainty in Israel
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 3 నిమిషాల చదవడం

నెతన్యాహు పార్టీకి సీట్లు వచ్చినా.. దక్కని మెజార్టీ
అరబ్‌ పార్టీలు కింగ్ మేకర్‌ అవుతాయా?
జెరుసలేం : ఇజ్రాయిల్‌ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది. దీంతో ప్రధాని నెతన్యాహు మరోసారి అధికార పీఠంపై కొనసాగుతారా? లేదంటే ప్రతిపక్షాలు సిద్ధాంతాలను పక్కనబెట్టి ఆయనను గద్దె దించుతాయా? అన్నదానిపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ రెండింటి నడుమ ఇప్పుడు అరబ్‌ పార్టీల మద్దతుకు ప్రాధాన్యత ఏర్పడింది. మరి ఇజ్రాయిల్‌లో ఈ పీటముడి విడిపోయేదెలా?అన్న దానిపైనే చర్చ.

120 పార్లమెంట్‌ స్థానాలున్న ఇజ్రాయిల్‌ లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ మార్కు (61)ను ఏ కూటమీ అందుకోలేక పోయింది. ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు నేతృత్వంలోని అధికార కూటమి 53 సీట్లు దక్కించుకుంది. ఇందులో నెతన్యాహుకు చెందిన ‘లికుడ్‌’ 27 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మాజీ సైన్యాధిపతి గడీ ఐసెన్‌కోట్‌ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీ 48 సీట్లను గెలుచుకుంది. అరబ్‌ పార్టీలు 19 సీట్లు సొంతం చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటుకు నాలుగు మార్గాలు కన్పిస్తున్నాయి.

ఐక్యతా ప్రభుత్వం..

ఈ ఎన్నికల్లో గడీ ఐసెన్‌కోట్‌కు చెందిన ‘యాష్నర్‌’ 21 సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈయన నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమిలో మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌కు చెందిన ‘టుగెదర్‌’ పార్టీ ఉంది. దీనికి 12 సీట్లు దక్కాయి. మరో ప్రతిపక్ష నేత అవిగ్డోర్‌ లిబర్‌మ్యాన్‌కు చెందిన పార్టీకి 7 సీట్లు వచ్చాయి. ఈ మూడు పార్టీలతో నెతన్యాహు కలిస్తే.. ప్రతిపక్షాలతో కూడిన ఐక్యతా ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. అయితే, ఇది దాదాపు అసాధ్యమే. ఎందుకంటే నెతన్యాహును ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఎన్నికల్లో విస్తృతం గా ప్రచారం చేపట్టాయి. అటు నెతన్యాహు కూడా ఈ సంప్రదాయ పార్టీల పట్ల ముందునుంచీ వ్యతిరేకంగానే ఉన్నారు. కానీ, ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల దృష్ట్యా.. ఇజ్రాయిల్‌ ప్రధాన రాజకీయ పార్టీల తమ వైరుధ్యాలను పక్కనబెట్టి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించే అవకాశాలు ఉన్నట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఫిరాయింపుదారులు వస్తే..

ప్రస్తుతం నెతన్యాహు మెజార్టీ మార్క్‌కు కేవలం 8 సీట్ల దూరంలో ఉన్నారు. కాబట్టి, ప్రతిపక్షాలతో చేతులు కలపడం కంటే కూడా.. విపక్ష కూటమి నుంచి ఫిరాయింపుదారులను ఆకర్షించే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయనకు ఇదేం కొత్త కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నఫ్తాలీ బెన్నెట్‌, లిబెర్‌మ్యాన్‌ పార్టీల నుంచి కొంతమంది నెతన్యాహు కూటమి గూటికి చేరనున్నట్టు ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇంకా సస్పెన్స్ కోనసాగుతోంది.

ఎనిమిదేండ్లలో ఏడు ఎన్నికలు ఇజ్రాయిల్‌లో ఇలాంటి అనిశ్చితులు కొత్తేం కాదు. గడిచిన 8 ఏండ్ల లో పలు కారణాల రీత్యా ఏడు సార్లు ఎన్నికలు జరగడం గమనార్హం. ఇక్కడ దామాషా పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. దేశమంతటినీ ఒకే నియోజకవర్గంలా పరిగణిస్తారు. వ్యక్తులకు కాకుండా.. పార్టీలకు ప్రజలు ఓటేస్తారు. పార్లమెంటులో ప్రవేశించాలంటే ఏ పార్టీకైనా కనీసం 3.25 శాతం ఓట్లు రావాలి. ఓట్లను బట్టే పార్టీలకు సీట్లు కేటాయిస్తారు. ఇక, నెతన్యాహు 1996 నుంచి ఇప్పటివరకు వేర్వేరు దఫాల్లో 19 ఏళ్లపాటు ప్రధానిగా ఉన్నారు. ఇటీవలి కాలంలో ఆయనపై అవినీతి సహా అనేక ఆరోపణలొచ్చాయి. ఒకవేళ ఆయన అధికారం నుంచి దిగిపోతే అరెస్టయ్యే అవకాశాలు ఎక్కువే. మరి ఈ పరిస్థితుల్లో ఇజ్రాయిల్‌ నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..!


మళ్లీ ఎన్నికలు..

ఏ పార్టీకీ మెజార్టీ రానప్పుడు అధ్యక్షుడు అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. 28రోజుల్లో ఆ పార్టీ మద్దతు కూడగట్టు కోవాలి. అవసరమైతే మరో 14 రోజులు గడువు కల్పిస్తారు. ఆలోగా, మద్దతు రాకపోతే రెండో అతిపెద్ద పార్టీని ఆహ్వానించి 28 రోజుల గడువిస్తారు. ఆ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే మూడో నేతను పిలిచి 14 రోజుల సమయమిస్తారు. అప్పటికీ ప్రతిష్టం భన తొలగకపోతే.. మళ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు అధ్యక్షుడు ఆదేశి స్తారు. మొత్తంగా ఈ సమస్య తేలడం కోసం 12 వారాలు ఎదురుచూ స్తారు. అప్పటిదాకా ప్రస్తుత ప్రధాని నెతన్యాహు ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొనసాగిస్తారు.

అరబ్‌ పార్టీలతో జతకడితే..

నెతన్యాహును గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతిపక్షాలు భావిస్తే.. వారు అరబ్ పార్టీలతో చేతులు కలపాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీల మద్దతుతో ఐసెన్‌కోట్‌ తదుపరి ప్రధాని బాధ్యతలు చేపట్టొచ్చు. అదే జరిగితే, ప్రభుత్వ ఏర్పాటుతో పాటు ఇజ్రాయిల్‌ విధాన నిర్ణయాల్లో అరబ్‌ పార్టీలు కీలకంగా మారుతాయి. అయితే, 2023 అక్టోబరు 7 ఘటన దృష్ట్యా ఈ పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు ప్రతిపక్ష కూటమిలోని నాలుగు పార్టీలు తీవ్రంగా విభేదిస్తున్నాయి. అయితే, అరబ్‌ పార్టీల వెలుపలి మద్దతుతో ఐసెన్‌కోట్‌ మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం ఉంది. ప్రతిపక్షాలకు మద్దతిచ్చేందుకు అరబ్‌ పార్టీలు కూడా సుముఖంగానే ఉన్నాయి. ఇప్పటివరకు ఇజ్రాయిల్‌ చరిత్రలో ఒకే ఒక్కసారి అరబ్‌ పార్టీ ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉంది. నెతన్యాహును ఓడించేందుకు 2021లో నఫ్తాలీ బెన్నెట్‌ నేతృత్వంలో సంకీర్ణ కూటమి ఏర్పడింది. అందులో అరబ్‌ పార్టీ ‘రామ్‌’ కూడా ఒకటి. అయితే, 18 నెలలకే ఆ ప్రభుత్వం కూలిపోయి.. మళ్లీ ఎన్నికలు జరిగి నెతన్యాహు అధికారంలోకి వచ్చారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్