రాకెట్ సాంకేతికతతో విన్యాసాలు
టెక్సాస్ : అపార కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ ఎగిరే సామర్థ్యమున్న కారును ప్రదర్శించింది. టెక్సాస్‌లోని స్పేస్ఎక్స్ రాకెట్ అభివృద్ధి, పరీక్షా కేంద్రంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో రోడ్‌స్టర్-2 నమూనా కారుతో విన్యాసాలు చేసింది. వంపు తిరిగిన ర్యాంప్‌పై తలకిందులుగా ప్రయాణించిన కారు.. థ్రస్టర్ల సాయంతో గాల్లోకి ఎగిరి తిరిగి నేలపై దిగింది. అనంతరం టెస్లా కార్ల వరుసను దాటి దూసుకెళ్లింది. ఈ నమూనాను రిమోట్ ద్వారా నియంత్రించినట్టు మస్క్ తెలిపారు. స్పేస్ఎక్స్ అభివృద్ధి చేసిన థ్రస్టర్ సాంకేతికతతో కారు రాకెట్లా గాల్లో కదలగలదని పేర్కొన్నారు. గంటకు 60 మైళ్ల వేగాన్ని సెకను కంటే తక్కువ సమయంలో అందుకోగలదని కూడా ఆయన వెల్లడించారు.రోడ్‌స్టర్-2ను 2017లోనే ప్రకటించినప్పటికీ దాని ఉత్పత్తి ప్రణాళికలు పలుమార్లు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం 2028లో ఉత్పత్తి ప్రారంభించాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్పోర్ట్స్ కారు ధర 2 లక్షల డాలర్ల (దాదాపు రూ.2 కోట్లు)కు పైగా ఉండవచ్చని సమాచారం. సంస్థ రిజర్వేషన్ వెబ్సైట్లో సాధారణ పనితీరు మోడల్‌కు 50 వేల పౌండ్ల డిపాజిట్, థ్రస్ట్ వెర్షన్‌కు 2.5 లక్షల డాలర్ల డిపాజిట్ అవసరమని పేర్కొన్నట్టు ‘ది గార్డియన్’ వెల్లడించింది. పూర్తి విమాన వ్యవస్థతో కూడిన సింగిల్ సీటర్ రాకెట్ వెర్షన్‌ను మాత్రమే అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది.ప్రదర్శనలో కారు గాల్లోకి ఎగిరినంత మాత్రాన అది సాధారణ వినియోగానికి సిద్ధమైన ఎగిరే వాహనంగా మారదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజా రహదారులపై ఈ వాహనాన్ని ఎగురవేయడానికి అనుమతి లేదని టెస్లా పేర్కొంది. వివిధ ప్రాంతాల్లో చట్టపరమైన అనుమతులు కూడా సమస్యగా మారవచ్చని మస్క్ అంగీకరించారు. భద్రతా ప్రమాణాలకు పూర్తిగా అనుగుణంగా రూపొందించిన వాహనం కాదని అన్నారు. దీంతో ఈ ఆవిష్కరణ వాణిజ్యపరంగా ఎంతవరకు ఆచరణ సాధ్యమవుతుంది, విమానయాన భద్రతా నిబంధనలను ఎలా అధిగమిస్తుంది అనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి.







కామెంట్లు (0)