మరో విజయంపై శ్రేయస్‌సేన గురి
వెస్టిండీస్‌తో రెండో టీ20 నేడు
రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
ఐర్లాండ్, ఇంగ్లాండ్‌కు టీ20 సిరీస్‌లో కోల్పోయినా, శ్రేయస్‌సేన బలంగా పుంజుకుంది. వరుసగా పది విజయాలతో దూసుకెళ్తోంది. 12 వరుస విజయాల స్వీయ రికార్డును బద్దలుకొట్టేందుకు భారత్ సిద్ధమవుతోండగా.. పొట్టి ఫార్మాట్లో భారత్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు కరీబియన్లు ప్రణాళికలు రచిస్తున్నారు. శ్రేయస్ సేన మరో విజయంపై కన్నేయగా నేడు రాంచిలో భారత్, వెస్టిండీస్ రెండో టీ20 పోరు.
నవతెలంగాణ-రాంచి
సొంతగడ్డపై గత ఏడేండ్లుగా టీ20 సిరీస్ చేజార్చుకోని టీమ్ ఇండియా.. ఆ రికార్డును మరింత మెరుగుపర్చుకునేందుకు సిద్ధమవుతోంది. పొట్టి ఫార్మాట్లో భారత్‌కు గట్టి పోటీ ఇస్తామనే ధీమా కరీబియన్లలో కనిపించినా,రెండు జట్ల మధ్య అంతరాన్ని లక్నోలో అయ్యర్‌సేన గుర్తుచేసింది. సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంపై కన్నేయగా నేడు రాంచిలో భారత్, వెస్టిండీస్ రెండో టీ20
జోరుమీదున్న భారత్
టీమ్ ఇండియా రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తోంది. రెగ్యులర్ ఆటగాళ్లు జశ్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, వరుణ్ చక్రవర్తి లేకపోయినా ఆతిథ్య జట్టు వరుస విజయాలు సాధిస్తోంది. పవర్‌ప్లేలో బుమ్రా లేకపోయినా.. అక్షర్ పటేల్ స్పిన్ మాయాజాలం చూపిస్తున్నాడు. పవర్‌ప్లేలో 15 ఓవర్లు వేసిన అక్షర్ పటేల్ 4.71 ఎకానమీతో 8 వికెట్లు పడగొట్టాడు. లక్నోలోనూ పవర్‌ప్లేలో అక్షర్ రెండు ఓవర్లు వేశాడు. అందులో ఓ ఓవర్ మెయిడిన్ వికెట్ కావటం విశేషం. పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఫామ్‌లో ఉన్నాడు. మయాంక్ యాదవ్ స్థానంలో ప్రిన్స్ యాదవ్ ఆడే అవకాశాలు ఉన్నాయి. అక్షర్‌కు తోడుగా కుల్‌దీప్, నమన్ దిర్‌లు సైతం జోరుందుకుంటున్నారు. బ్యాట్‌తో అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ భీకర ఫామ్‌లో ఉండగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సైతం పరుగుల వేట మొదలెట్టాడు. తిలక్ వర్మ, శివం దూబె సైతం భారీ ఇన్నింగ్స్‌లు ఆడేందుకు ఎదురుచూస్తున్నారు. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అవకాశం కోసం మరిన్ని మ్యాచ్‌లు ఎదురుచూడక తప్పదు.
విండీస్ పుంజుకుంటుందా?
వెస్టిండీస్ కాగితంపై బలంగానే కనిపిస్తోంది. కానీ ఆ జట్టు ప్రదర్శన అంచనాల మేరకు ఉండటం లేదు. కెప్టెన్ షయ్ హోప్ నిలకడగా రాణిస్తున్నాడు. కానీ అతడికి సహచరుల నుంచి నిలకడగా సహకారం అవసరం. కామిల్ పూరన్, షిమ్రోన్ హెట్‌మయర్, రోవ్‌మాన్ పావెల్, రూథర్‌ఫోర్డ్, షెఫర్డ్‌లు భారీ ఇన్నింగ్స్‌లు ఆడగల సమర్థులు. కానీ భారత బౌలర్ల ఉచ్చు నుంచి బయటపడటం లేదు. ప్రణాళికలు మార్చుకుని కరీబియన్లు కొత్తగా ప్రయత్నం చేయాలి. లేదంటే ఫలితంలో మార్పు కనిపించదు. బౌలర్లు అకీల్ హోస్సేన్, షమర్ జొసెఫ్, మాథ్యూ ఫోర్డె, రోస్టన్ ఛేజ్‌లు సమిష్టిగా బ్యాటర్లపై ఒత్తిడి పెంచితేనే ఆ జట్టు విజయావకాశాలు మెరుగవుతాయి.
పిచ్, వాతావరణం
2023 నుంచి రాంచిలో టీ20 మ్యాచ్ జరుగలేదు. ఇక్కడ జరిగిన ఆఖరు మ్యాచ్‌లో భారత్‌పై న్యూజిలాండ్ గెలుపొందింది. ఇక్కడ సాధారణంగా భారీ స్కోర్లు నమోదు కాలేదు. పది మ్యాచ్‌ల్లో కేవలం ఒక్కసారే 200 పరుగులు నమోదయ్యాయి. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం మెండుగా ఉంది.
తుది జట్లు (అంచనా)
భారత్ : అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబె, నమన్ ధిర్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, ప్రిన్స్ యాదవ్/మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.
వెస్టిండీస్ : షయ్ హోప్ (కెప్టెన్, వికెట్ కీపర్), కామిల్ పూరన్, షిమ్రోన్ హెట్‌మయర్, రోవ్‌మాన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెఫర్డ్, రోస్టన్ ఛేజ్, షమర్ స్ర్పింజర్, అకీల్ హొస్సేన్, షమర్ జొసెఫ్, మాథ్యూ ఫోర్డె.






కామెంట్‌లు (0)