డ్రాగా ముగిసిన రంజీ మ్యాచ్
నవతెలంగాణ-హైదరాబాద్ : రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బిలో హైదరాబాద్, పంజాబ్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. పిచ్ నుంచి బౌలర్లకు సహకారం లభించిన వేళ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోసం ఇరు జట్లు ఆఖరు వరకు రసవత్తరంగా పోటీపడ్డాయి. పార్ట్ టైమ్ స్పిన్నర్ విహాన్ మల్హోత్రా (4/15) ఆరు ఓవర్లలో నాలుగు వికెట్ల మాయాజాలం చేయగా పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా 51 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది. నాలుగు రోజుల ఆటలో ఫలితం తేలే పరిస్థితులు లేకపోవటంతో లంచ్ సెషన్ అనంతరం ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో పంజాబ్ 3 పాయింట్లు ఖాతాలో వేసుకోగా, డ్రాతో హైదరాబాద్ ఒక్క పాయింట్ దక్కించుకుంది.
రాణించిన సహరన్, ప్రభుసిమ్రన్
పంజాబ్ కెప్టెన్ ఉదయ్ సహరన్ (55 నాటౌట్, 106 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), ప్రభుసిమ్రన్ సింగ్ (68, 76 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), విహాన్ మల్హోత్రా (53, 119 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలతో రాణించారు. 78 ఓవర్లలో 6 వికెట్లకు 240 పరుగులు చేసిన పంజాబ్.. టీ విరామానికి మరో 27 నిమిషాల ముందు ఇన్నింగ్స్‌ను డిక్లరేషన్ ప్రకటించింది. ఫలితం తేలే అవకాశం లేకపోవటంతో హైదరాబాద్ డ్రాకు అంగీకరించింది. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ (2/51), రక్షణ్ రెడ్డి (2/16), సీవీ మిలింద్ (1/22) మెరిశారు. రంజీ ట్రోఫీ నాల్గో రౌండ్‌లో జింఖానా వేదికగా చత్తీస్‌గఢ్‌తో హైదరాబాద్ తలపడనుండగా.. సొంతగడ్డపై ఆంధ్రతో పంజాబ్ పోటీపడనుంది. తొలి ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీతో చెలరేగిన సాలిల్ అరోరా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
ఆ రెండు ప్రతికూలం
తొలి రెండు మ్యాచ్‌ల్లో స్పష్టమైన విజయాలు సాధించిన హైదరాబాద్ హ్యాట్రిక్ అంచనాల నడుము పంజాబ్ మ్యాచ్ బరిలోకి దిగింది. అయినా, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయి ప్రత్యర్థికి మూడు పాయింట్లు ఇచ్చింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోవటంపై సీవీ మిలింద్ స్పందించాడు. ప్రధానంగా రెండు అంశాలు ప్రతికూలంగా మారాయని అభిప్రాయపడ్డాడు. ‘పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో 315/9తో ఉండగా ఆఖరు వికెట్‌కు సాలిల్ అరోరా, ఉమేశ్ యాదవ్ జోడీ 116 పరుగులు జోడించారు. దీంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసింది. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో 343/4తో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దిశగా సాగుతుండగా.. పార్ట్‌టైమ్ స్పిన్నర్ విహాన్ మల్హోత్రా ఆరు ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టాడు. 37 పరుగులకు ఆఖరు ఆరు వికెట్లు చేజార్చుకోవటం దెబ్బకొట్టింది. పంజాబ్ బౌలర్ల కోసం బ్యాటర్లు సన్నద్ధమయ్యారు. కానీ విహాన్ మల్హోత్రా బౌలింగ్ అంచనా వేయలేదు. అతడి బౌలింగ్ అర్థం చేసుకునేలోపే నష్టం జరిగిందని’ మిలింద్ అన్నాడు.
సంక్షిప్త స్కోరు వివరాలు
పంజాబ్ తొలి ఇన్నింగ్స్ : 431/10 (సాలిల్ అరోరా 151, ప్రభుసిమ్రన్ సింగ్ 81, రమణ్‌దీప్ సింగ్ 52, సీవీ మిలింద్ 4/79)
హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ : 380/10 (అభిరథ్ రెడ్డి 97, రాహుల్ రాదేశ్ 86, కొడిమెల హిమతేజ 81, ప్రజ్క్షయ్ రెడ్డి 65, విహాన్ మల్హోత్రా 4/15)
పంజాబ్ రెండో ఇన్నింగ్స్ : 240/6 డిక్లేర్డ్ (ప్రభుసిమ్రన్ సింగ్ 68, ఉదయ్ సహరన్ 55, విహాన్ మల్హోత్రా 53, రక్షణ్ రెడ్డి 2/16, తనయ్ 2/51)







కామెంట్‌లు (0)