జ్ఞానేశ్ కుమార్‌పై ప్రజా విచారణ
అభిప్రాయాలు వెల్లడించనున్న ఓటర్లు,పౌర సమాజ ప్రతినిధులు
ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఇండియా బ్లాక్ శుక్రవారం నిర్వహించనున్న ‘ప్రతీకాత్మక అభిశంసన’ కార్యక్రమం ప్రజా బహిరంగ విచారణ జరగనుంది. రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నివాసంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ అధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానాన్ని ఖర్గే ప్రవేశపెడతారు. ఇండియా బ్లాక్‌లోని ప్రతిపక్షం నుంచి ఒక్కో ప్రతినిధి చర్చలో పాల్గొంటారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్) కారణంగా ఓటు హక్కు కోల్పోయిన ఓటర్లు, పౌర సమాజ ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముగింపు ప్రసంగం చేస్తారు.
ఖర్గే నివాసంలో జరిగిన ఇండియా బ్లాక్ సమావేశంలో ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేశారు.
ఈ సమావేశానికి సీపీఐ(ఎం) రాజ్యసభా పక్ష నేత జాన్ బ్రిట్టాస్ హాజరయ్యారు. ఎన్నికల కమిషన్ విశ్వసనీయత, పారదర్శకత, నిష్పాక్షికతను దెబ్బతీసిన జ్ఞానేశ్ కుమార్‌పై జరిగే ప్రజా విచారణగా ఈ ప్రతీకాత్మక అభిశంసన నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీలో భారీ భద్రత
ఖర్గే నివాసంలో ఏర్పాటు చేసిన ప్రతీకాత్మక అభిశంసన కార్యక్రమంతో పాటు ఆదివారం నిర్వహించనున్న మహా ర్యాలీ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టనుంది. 2,500 నుంచి 3,500 మంది ఢిల్లీ పోలీసు సిబ్బందితో పాటు కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్)కు చెందిన పది కంపెనీలను మోహరించనున్నట్లు సమాచారం. ర్యాలీ జరిగే ప్రాంతాన్ని 14 జోన్లుగా విభజించి భద్రతా చర్యలు చేపట్టనున్నారు. తనిఖీల కోసం సీసీటీవీ కెమెరాలతో పాటు పోలీసు సిబ్బంది ధరించే బాడీ కెమెరాలను వినియోగించనున్నారు. సుమారు వెయ్యి మంది పోలీసులు బాడీ కెమెరాలతో విధులు నిర్వహించనున్నారు.






కామెంట్లు (0)