550 ఎకరాలపై ప్రయివేటు హక్కుల వాదనలు
తిరస్కరించిన సుప్రీంకోర్టు
తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా
తీర్పు.. అన్ని సివిల్ అప్పీళ్లు కొట్టివేత
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలోని మియాపూర్ భూముల వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. మియాపూర్లోని సర్వే నంబర్లు 100, 101 పరిధిలో ఉన్న 550 ఎకరాలకు పైగా భూములపై ప్రయివేటు వ్యక్తుల యాజమాన్య హక్కుల వాదనలను కోర్టు తిరస్కరించింది. ఈ భూములు ప్రభుత్వానికి చెందుతాయన్న తెలంగాణ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ, వివిధ పక్షాలు దాఖలు చేసిన అన్ని సివిల్ అప్పీళ్లను కొట్టివేసింది. దీంతో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ భూ వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువడింది.
జాగీర్ హక్కులున్నంత మాత్రాన యాజమాన్యం రాదు
1949లో జాగీర్ వ్యవస్థ రద్దయిన తర్వాత భూములపై హక్కుల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
జాగీర్ హక్కులు ఉన్నంత మాత్రాన సంబంధిత భూములపై యాజమాన్య హక్కులు సంక్రమించవని స్పష్టం చేసింది. ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు కూడా వ్యాఖ్యానించింది.
ప్రభుత్వ రికార్డులకే ప్రాధాన్యం
1912 నుంచి అందుబాటులో ఉన్న ప్రభుత్వ రికార్డులకు కోర్టు ప్రాధాన్యతనిచ్చింది. పహాణీ రికార్డుల్లో పేర్లు నమోదైనంత మాత్రాన భూమిపై యాజమాన్య హక్కులు లభించవని స్పష్టం చేసింది. భూములపై చట్టబద్ధమైన యాజమాన్య హక్కులను నిరూపించడంలో అప్పీలుదారులు విఫలమయ్యారని పేర్కొంది.
పరిహారానికీ నిరాకరణ
భూములపై హక్కుల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు, అప్పీలుదారులకు పరిహారం లేదా ఇతర సమానత్వపరమైన ఉపశమనాలు కల్పించేందుకు కూడా నిరాకరించింది. ఈ తీర్పుతో మియాపూర్ సర్వే నంబర్లు 100, 101 పరిధిలోని భూముల యాజమాన్య వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.






కామెంట్లు (0)