Magazines

ఆర్‌‌బీఐ ఎంపీసీ భేటీ షురూ..

45 నిమిషాల క్రితం

RBI MPC meeting begins...
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

వడ్డీ రేట్లు పెంపా.. యథాతథమా?
ముంబయి : అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న ముడి చమురు ధరలు, అమెరికా బాండ్ రాబడులు ఎగబాకడం, రూపాయిపై ఒత్తిడి నేపథ్యంలో ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం సోమవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశం అక్టోబర్ 7న ముగియనుంది. అదే రోజు ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్‌ ‌మల్హోత్రా వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ప్రస్తుతం దేశ పరిస్థితులు తక్షణ రేట్ల పెంపును తప్పనిసరి చేయకపోయినా, అంతర్జాతీయ పరిణామాలు కేంద్ర బ్యాంకుకు సవాలుగా మారాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లను దాటడం, అమెరికా బాండ్ రాబడులు 5 శాతానికి పైగా పెరగడంతో భారత్‌లో పదేళ్ల ప్రభుత్వ బాండ్ రాబడులు సుమారు 7.1 శాతానికి చేరింది. దీంతో ఈసారి నుంచే రేట్ల పెంపు చక్రం ప్రారంభమయ్యే అవకాశంపై మార్కెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రూపాయి విలువ, దిగుమతి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బిఐ రేట్లను పెంచవచ్చని జెఎం ఫైనాన్షియల్ అంచనా వేసింది. సెప్టెంబరులో ముడి చమురు ధరలు 14 శాతం పెరగడం రూపాయిపై మరింత ఒత్తిడి పెంచవచ్చని పేర్కొంది. తక్కువ వర్షపాతం కారణంగా ఖరీఫ్ సాగు తగ్గితే ఆహార ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది. మోతీలాల్ ఓస్వాల్ కూడా చమురు ధరలు అధిక స్థాయిలో కొనసాగితే భవిష్యత్తులో 75 నుంచి 100 బేసిస్ పాయింట్ల వరకు రేట్ల పెంపు జరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా మాత్రం రెపో రేటును ప్రస్తుత 5.25 శాతం వద్దే కొనసాగించే అవకాశం ఉందని పేర్కొంది. పండుగల సీజన్‌కు ముందు రేట్ల పెంపు వినియోగ డిమాండ్‌ను దెబ్బతీసి వృద్ధిపై ప్రభావం చూపవచ్చని తెలిపింది. వృద్ధి, ద్రవ్యోల్బణం, రూపాయి, అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య ఆర్‌బిఐ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో అక్టోబర్ 7న తేలనుంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్